In Pics: బ్రహ్మోత్సవాల్లో మనోరథాన్ని అధిరోహించిన దేవదేవుడు, భక్తిశ్రద్ధలతో లాగిన భక్తులు
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా కొనసాగుతున్నాయి.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజైన మంగళవారం ఉదయం 7 నుండి 9 గంటల వరకు ఉభయ దేవేరులతో కలిసి శ్రీ మలయప్ప స్వామి వారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.
పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి రథాన్ని లాగారు. బ్రహ్మోత్సవాలలో ఎనిమిదో రోజున ఉభయ దేవేరులతో మలయప్పస్వామిని మహోన్నత రథంపై అధిష్ఠింపజేసి ఆలయ వీథులలో విహరింపజేశారు.
శ్రీవారికి భక్తులు అడుగడుగునా నీరాజనాలు సమర్పించారు.
గోవిందనామస్మరణతో ఆలయ మాడవీధులు మారుమోగాయి. అనాదికాలం నుండి రాజులకు రథసంచారం ప్రసిద్ధం.
యుద్ధాలలో కూడా విరివిగా రథసంచారం జరిగినట్లు భారతాది గ్రంథాలు వివరిస్తున్నాయి.
శ్రీహరి గరుడధ్వజుడై నాలుగు గుర్రాలతో కూడిన రథంపై విహరిస్తాడు.
ఇక ప్రసిద్ధ దేవాలయాలలో ఉత్సవవేళలో దేవుని ఉత్సవమూర్తిని రథంపై ఉంచి ఊరేగించే ఆచారం, ఆగమశాస్త్ర సిద్ధమై బహుళ ప్రచారంలో ఉంది.
తిరుమలలో రథోత్సవం అన్నివిధాలా ప్రసిద్ధమైనది. ''రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మనవిద్యతే'' అన్న ఆర్షవాక్కులు రథోత్సవం మోక్షప్రదాయకమని వివరిస్తున్నాయి.
తిరుమాడ వీథులలో రథాన్ని లాగేటప్పుడు ప్రమాదాలు జరగకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.
రథానికి తాళ్ళుకట్టి వీధులలో భక్తులు, అధికారులు అందరూ రథాన్ని ముందుకు లాగారు.
రథోత్సవానికి విశిష్టమైన ఆధ్యాత్మికార్థం ఉంది. కఠోపనిషత్తులో ఆత్మకు, శరీరానికీ ఉండే సంబంధాన్ని రథరూపకల్పనతో వివరించడం జరిగింది.
ఆత్మ రథికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు.
ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో - స్థూలశరీరం వేరనీ, సూక్ష్మశరీరం వేరనీ, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది.
రథోత్సవంలో ముఖ్యంగా కలిగే తత్త్వజ్ఞానమిదే. భక్తులు రథాన్ని లాగుతారు.
కానీ, అన్నమయ్య సకలజీవులలో అంతర్యామిగా ఉన్న పరమాత్మ తన రథాన్ని తానే లాగుతున్నాడని అనడం సముచితం. ఎనిమిదో రోజు రాత్రి అశ్వ వాహనంపై తిరుమాఢ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నారు మలయప్ప స్వామి.