ముత్యపు పందిరి వాహనంపై మలయప్ప స్వామి, భక్తులకు కనువిందు
ముత్యపు పందిరి వాహనంపై మలయప్ప స్వామి
Download ABP Live App and Watch All Latest Videos
View In Appశ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు రాత్రి 7 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు ముత్యపుపందిరి వాహనంపై దర్శనమిచ్చారు.
ముత్యపు పందిరి వాహనంపై తిరుమాఢ వీధులో ఊరేగుతున్న మలయప్ప స్వామి వారికి భక్తులు కర్పూర నీరాజనాలు పలికారు.
స్వామి వారి వాహన సేవ వీక్షించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తిరుమాఢ వీధులకు చేరుకుని స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు.
ముత్యాల నిర్మలకాంతులు వ్యాపించడానికి, ఆ కాంతులు దర్శించి భక్తులు ముక్తులు కావడానికి రాత్రి వేళ అనుకూలం. అందుకే శ్రీమలయప్పకు మూడో రోజు రాత్రి మొదటి యామంలో ముత్యాల పందిరిలో కూర్చొని విహరించే కైంకర్యాన్ని పెద్దలు నిర్ణయించారు.
తిరుమలలో ఘనంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు
ముత్యం స్వచ్ఛతకు సంకేతం. మనిషి ఆత్మ ఎన్నో జన్మల అనంతరం విశ్వలోకాల నుండి రాలి, దుర్లభమైన మానవజన్మను సంతరించుకుంటుంది. శరీరాన్ని ఆధ్యాత్మిక సంపదతో శుద్ధి చేసుకుంటే బుద్ధి ముత్యంలాగా మారి, జనన, మరణచక్రం నుండి విడుదలై మోక్షాన్ని పొందుతుంది.
స్వామివారికి ప్రీతిపాత్రమైన ముత్యాలహారాలు - రత్నాల వల్ల కలిగే వేడిమినీ, పుష్పాల వల్ల కలిగే సుగంధాన్ని తమలో ఇముడ్చుకుని, స్వామివారి వక్షఃస్థలానికి, అక్కడి లక్ష్మీదేవికి సమశీతోష్ణస్థితిని చేకూరుస్తూ, తాపగుణాన్ని హరిస్తూ, ఉత్సాహాన్ని, ప్రశాంతతను చేకూరుస్తున్నాయి.
బ్రహ్మోత్సవాలలో నాలుగో రోజు ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి 7 గంటలకు సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి వారు దర్శనం ఇవ్వనున్నారు.