Pawan Kalyan: పిఠాపురంలో నేను గెలిస్తే వర్మ గెలిచినట్లే, కూటమి విజయమే ఉమ్మడి లక్ష్యం: పవన్ కళ్యాణ్
పిఠాపురంలో కేవలం పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నట్లు భావించాల్సిన అవసరం లేదని, వ్యక్తిగత విజయం కంటే కూటమి విజయం ముఖ్యమని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. పిఠాపురంలో తాను గెలిస్తే వర్మ గెలిచినట్లే అని పవన్ పేర్కొన్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appశనివారం మధ్యాహ్నం యు.కొత్తపల్లిలో పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఈ ఎన్నికలు సమష్టి పోటీ అని 3 పార్టీల నాయకులు, కార్యకర్తలు భావించాలని పవన్ కళ్యాణ్ అన్నారు.
చంద్రబాబు జన్మదినం రోజున పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు పవన్ కళ్యాణ్. వచ్చే ఎన్నికల్లో మూడు పార్టీలు 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నట్లు భావించాలి. ప్రతి చోట జనసేన పోటీ చేసినట్లు జన సైనికులు, వీర మహిళలు భావిస్తే... ప్రతి చోట తెలుగుదేశం పార్టీ పోటీ చేసినట్లు తెలుగుదేశం కార్యకర్తలు భావించాలి.
ముందుగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు బర్త్ డే సందర్భంగా టీడీపీ పిఠాపురం ఇంఛార్జి ఎస్.వి.ఎస్.ఎన్.వర్మ, కార్యకర్తలు ఏర్పాటు చేసిన కేక్ ను పవన్ కళ్యాణ్ కట్ చేశారు. మాజీ సీఎం చంద్రబాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
బీజేపీ కార్యకర్తలు కూడా తాము 175 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు భావించి, 3 పార్టీల కార్యకర్తలు ఐకమత్యంగా పోరాడితేనే ఉమ్మడి విజయం అద్భుతంగా ఉంటుంది. కూటమి ప్రభుత్వం బలంగా ఏర్పడుతుందని జనసేనాని పవన్ అభిప్రాయపడ్డారు.
రాష్ట్రంలో వైసీపీ పాలన ముగిసి సుస్థిరమైన పాలన ప్రజలకు అందాలనే ఆకాంక్షతోనే తెలుగుదేశ పార్టీతో జనసేన చేతులు కలిపిందన్నారు. క్లిష్టతరమైన ఆ రోజు రాజమండ్రి జైలుకు వెళ్లి చంద్రబాబుని పరామర్శించిన వెంటనే పొత్తు నిర్ణయం తెలియజేశాం అన్నారు.
బీజేపీ సైతం తరువాత కూటమిలోకి రావడంతో వైసీపీ పతనం ఖాయమైందని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణ గల పార్టీ కాబట్టే కీలక సమయంలో ఆ పార్టీకి అండగా నిలిచిచామని తెలిపారు.
చంద్రబాబు లాంటి వ్యక్తిని వైసీపీ వేధిస్తూ.. కావాలని జైల్లో పెట్టిన సమయంలో ఆయనకు వెన్నుదన్నుగా నిలిచాం. ఈ రాష్ట్రంలో వైసీపీ పాలనకు అంతం పలకాలి అన్నదే దీని అర్థమన్నారు పవన్. రెండు పార్టీల కార్యకర్తలు సూక్ష్మంగా ఆలోచించి సమష్టిగా ముందుకు కదలడంపై హర్షం వ్యక్తం చేశారు.
పొత్తులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 144 స్థానాల్లో పవన్ కళ్యాణ్ గారు టీడీపీని మోస్తుంటే, 21 స్థానాలు చంద్రబాబు జనసేనను మోస్తున్నారని పిఠాపురం టిడిపి ఇంచార్జ్ వర్మ అన్నారు.
పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన ఎమ్మెల్యే అభ్యర్ధిగా పవన్ కళ్యాణ్, ఎంపీ అభ్యర్ధిగా ఉదయ్ శ్రీనివాస్ బరిలో ఉన్నారు. టీడీపీ అధినేత ఆదేశాలను పాటిస్తూ ప్రతి కార్యకర్త వీరిరువురినీ భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కాకినాడ జనసేన పార్టీ లోక్ సభ అభ్యర్థి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్, పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు, జనసేన, టిడిపి నేతలు డా. జ్యోతుల శ్రీనివాస్, మర్రెడ్డి శ్రీనివాస్, గిరిష్ వర్మలు పాల్గొన్నారు.