YSRCP Meeting in Bheemili: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో భీమిలి నియోజకవర్గ పరిధిలోని సంగివలస గ్రామంలో నిర్వహించిన తొలి ఎన్నికల సభ విజయవంతం కావడంతో కేడర్‌ జోష్‌లో ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాల పరిధిలోని 34 నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలతో తొలి ఎన్నికల శంఖారావ సభను వైసీపీ సిద్ధం పేరుతో విశాఖ జిల్లాలో నిర్వహించింది. ఈ సభకు సుమారు లక్ష నుంచి లక్షా యాబై వేల మంది హాజరైనట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. భారీగా నాయకులు, కార్యకర్తలు రావడంతో నాయకులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో నియోజకవర్గం నుంచి ఐదు వేల మందికిపైగా నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. సభా ప్రాంగణం కిక్కిరిసి కనిపించడంతోపాటు బయట కూడా వేలాది మంది జనాలు ఉండిపోయారు. 


ఉత్సాహం రెట్టించేలా ప్రసంగం


ఎన్నికల శంఖారావ సభలో సీఎం జగన్మోహన్‌రెడ్డి ప్రసంగం కూడా కేడర్‌ను ఉత్సాహబరిచేలా సాగింది. కౌరవలు, పాండవులకు మధ్య యుద్ధం జరుగుతోందని, పాండవ సైన్యం సిద్ధంగా ఉందంటూ ప్రతిపక్షాలకు సవాల్‌ చేశారు. ఎన్నికల రణ క్షేత్రానికి సన్నద్ధం కావాలంటూ కేడర్‌ను సమాయత్తపరిచే ప్రయతం చేసిన జగన్‌.. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా చూడాలంటూ సూచించారు. ప్రతిపక్షాల చేసే కుట్రలను తిప్పి కొట్టాలంటూ కేడర్‌కు దిశా, నిర్ధేం చేసిన జగన్‌.. 175 కి 175 సీట్లు, 25 ఎంపీ స్థానాలను గెలుస్తున్నామంటూ కేడర్‌లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశారు. సీఎం జగన్‌ మాట్లాడుతున్నంతసేపు వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంతో కనిపించారు. జై జగన్‌ నినాదాలతో ప్రాంగణాన్ని హోరెత్తించారు. 


మరిన్ని సభలు నిర్వహణ


ఎన్నికలకు దగ్గరపడుతున్న నేపథ్యంలో మరిన్ని సభలను ఉత్తరాంధ్రలో నిర్వహించేలా వైసీపీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సంగివలస తరహాలో మిగిలిన చోట్ల రెండు, మూడు సభలను నిర్వహించడం ద్వారా కేడర్‌లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసే ప్రయత్నం చేయాలని వైసీపీ నాయకత్వం భావిస్తోంది. సంగివలసలో శనివారం ఏర్పాటు చేసిన సభ ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలతో నిర్వహించినది. రానున్న రోజుల్లో నిర్వహించబోయే సభలను ప్రజలు, సంక్షేమ పథకాల లబ్ధిదారులతో నిర్వహించేలా వైసీపీ కసరత్తు చేస్తున్నట్టు చెబుతున్నారు. ఒక్కో సభను కనీసం రెండు లక్షల మందితో నిర్వహించాలని వైసీపీ ముఖ్య నాయకులు భావిస్తున్నారు. 


బొత్స, వైవీ విజయం


సంగివలస సభ విజయవంతం కావడంలో ఆ పార్టీ ఉత్తరాంధ్ర ఇన్‌చార్జ్‌ వైవీ సుబ్బారెడ్డి, సీనియర్‌ మంత్రి బొత్స సత్యనారాయణ కీలకంగా వ్యవహరించారు. ఈ ఇరువురు నేతలు జిల్లాలు వారీగా పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో సమావేశాలు నిర్వహించారు. ప్రతి గ్రామం నుంచి కార్యకర్తలు, నాయకులు హాజరయ్యేలా చూడాలంటూ స్థానిక ప్రజాప్రతినిధులకు లక్ష్యాలను విధించారు. ఎన్నికల ముందు నిర్వహిస్తున్న సభ కావడంతో కేడర్‌లో నైతిక స్థైర్యాన్ని కలిగించేందుకు సభ దోహం చేస్తుందంటూ హితబోధ చేశారు. ఈ ఇరువురి నేతలు ఆదేశాలు, ఎప్పటికప్పుడు నిర్వహించిన సమావేశాలు, సమీక్షలతో సభకు భారీగా జనం తరలివచ్చారు. ముఖ్యంగా ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల్లోని జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు మంత్రి బొత్స సత్యనారాయణకు ఉన్న సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కింది స్థాయి నాయకులతో బొత్స మాట్లాడి భారీగా కేడర్‌ సమీకరించేలా చేయడంలో సఫలమై సభను విజయవంతం చేయగలిగారు. ఇదే మాటను ఇప్పుడు ఆ పార్టీ నాయకులు చెప్పుకుంటున్నారు. ఇకపోతే, సభకు వచ్చిన జనాల్లో గ్రామీణ ప్రాంతాల నుంచే అధికంగా వచ్చారు. నగర పరిధిలో నుంచి తక్కువ సంఖ్యలో మాత్రమే కేడర్‌ను తీసుకుని వెళ్లారు.