BJP Big Plan: ల‌క్ష్యం పెద్ద‌దిగా ఉన్న‌ప్పుడు.. దానిని ఛేదించే వ్యూహాలు కూడా సుదీర్ఘంగానే ఉంటాయి. ఇప్పుడు ఇదే సుదీర్ఘ ల‌క్ష్యాల‌తో కేంద్రంలోని భారతీయ జ‌న‌తా పార్టీ(BJP) అడుగులు వేస్తోంది. ఇప్ప‌టికి రెండు ద‌ఫాలుగా కేంద్రంలో అధికారం ద‌క్కించుకున్న బీజేపీ.. ఇప్పుడు జ‌ర‌గ‌నున్న పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లోనూ విజ‌యం ద‌క్కించుకునే దిశ‌గా అడుగులు ముమ్మ‌రం చేసింది. ఒక్క విజ‌య‌మే కాదు.. ఏకంగా 400 పైచిలుకు పార్ల‌మెంటు(Parliament) స్థానాల్లో విజ‌యం ద‌క్కించుకోవాల‌ని లక్ష్యంగా నిర్దేశించుకోవ‌డం గ‌మ‌నార్హం. 

వ‌రుస విజ‌యాల కోసం..

అయితే.. ఈ ల‌క్ష్య ఛేద‌న‌కు సంబంధించి చేయాల్సిన వ‌న్నీ పూర్తి చేసుకున్న కేంద్రంలోని న‌రేంద్ర మోడీ(Narendra Modi) ప్ర‌భుత్వం ఇక‌, 2029లో వ‌చ్చే ఎన్నిక‌ల‌(Elections)కు సంబంధించి కూడా గ్రౌండ్ వ‌ర్క్ ప్రారంభించేసింది. మొత్తంగా.. 2014, 2019 ఎన్నిక‌ల్లో సాధించిన విజ‌యాల‌తో సంతృప్తి చెంద‌కుండా.. ప్ర‌స్తుత ఏడాది జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల‌తో పాటు.. 2029లో జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల‌కు కూడా ప‌క్కా ప్లాన్‌ను రెడీ చేసుకుని.. అదేవ్యూహంతో ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ప్ర‌స్తుత జాతీయ రాజ‌కీయాల్లో ఇదే అత్యంత కీల‌కంగా మారింది. 

క‌లిసి వ‌చ్చిన రామ‌మందిరం

2014లో అప్ప‌టి వ‌ర‌కు ప‌దేళ్ల పాల‌న పూర్తి చేసుకున్న కాంగ్రెస్ పార్టీ(Congress Party)ని గ‌ద్దెదింపిన బీజేపీ.. అధికారంలోకి వ‌చ్చింది. ఆ స‌మ‌యంలో గుజ‌రాత్ ముఖ్య‌మంత్రి(Gujarath C.M)గా ఉన్న ప్ర‌స్తుత ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ఇమేజ్‌ను దేశ‌వ్యాప్తంగా ప్ర‌చారం చేసింది. అదేసమ‌యంలో అప్ప‌టి రామమందిర ఘ‌ట‌న‌లు.. గుజ‌రాత్ అభివృద్ధి న‌మూనాను దేశానికి ప‌రిచ‌యం చేసి, న‌ల్ల‌ధ‌నం(Black money) ఏరివేత నినాదంతో ప్ర‌జ‌ల్లోకి చొచ్చుకువ‌చ్చిం ది. ఈ క్ర‌మంలోనే ప్రాంతీయ పార్టీల‌తోనూ పొత్తులు పెట్టుకున్నారు. తొలి స్టెప్‌లోనే కాలం క‌లిసి వ‌చ్చి.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మి అధికారం చేప‌ట్టింది. 

ఊహించ‌ని ఫ‌లితం

ఇక‌, 2019 ఎన్నిక‌ల నాటికి.. న‌ల్ల‌ధ‌నం తేలేద‌న్న‌.. విమ‌ర్శ‌లు ఉన్న‌ప్ప‌టికీ.. అనూహ్యంగా తీసుకున్న నిర్ణ‌యాలు డీమానిటైజేష‌న్ క‌లిసి వ‌చ్చింది. అదేస‌మ‌యంలో కీల‌క‌మైన రామ‌జ‌న్మ‌భూమి(Ramajanma Bhoomi) రామమందిర విష‌యాల‌ను ప్ర‌ధానంగా తెర‌మీదికి తెచ్చారు. మ‌రోసారి మోడీ కేంద్రంలో అధికారంలోకి వ‌స్తేనే ఇది సాకార‌మ‌వుతుంద‌న్న సెంటిమెంటును 2019 ఎన్నిక‌ల‌కుముందు విస్తృతంగా ప్ర‌చారం చేశారు. దేశాన్ని హిందూత్వ(Hinduthva)గా చూపించ‌డంలో.. స‌క్సెస్ అయ్యారు. ఇక‌, పాకిస్థాన్ దూకుడుకు స‌ర్జిక‌ల్ స్ట్ర‌యిక్స్‌తో చెక్ పెట్టార‌నే ప్ర‌చారం కలిసి వ‌చ్చింది.  ఫ‌లితంగా ఎవ‌రూ ఊహించిన విధంగా 300 పైచిలుకు స్థానాల విజ‌యంతో మోడీ కేంద్రంలో రెండో సారిపాగా వేశారు. 

టార్గెట్ 400

ఇక‌, అంద‌రూ అనుకున్న‌ట్టుగానే, ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన హామీ ప్ర‌కార‌మే.. న్యాయ‌ప‌ర‌మైన పోరాటంలో విజ‌యం ద‌క్కించుకుని అయోధ్య రామ‌ల‌యాన్ని సాకారం చేశారు. దీంతో పాటు జ‌మ్ము క‌శ్మీర్‌(Jammu and kashmir)కు చెందిన ఆర్టిక‌ల్ 370, ఐసీపీ, సీఆర్ పీసీ వంటి చ‌ట్టాల స్తానంలో భార‌తీయత‌ను జోడించి కొత్త వాటిని తీసుకురావ‌డం, నూత‌న పార్ల‌మెంటు నిర్మాణం.. వంటి ప్ర‌స్తుత ఎన్నికల్లో బీజేపీకి ప్ర‌ధాన వ‌న‌రుగా మారింది. అంతేకాదు.. ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో ఏకంగా 400 స్థానాల‌ను టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఈ విజ‌యం ఖాయ‌మ‌ని కూడా బీజేపీ పెద్ద‌లు అంచ‌నా వేస్తున్నారు. 

జ్ఞాన‌వాపీ సెంటిమెంటు..

ఈ ఎన్నికల వ్య‌వ‌హారం ఒక‌వైపు కొన‌సాగుతుండ‌గానే.. 2029 ఎన్నిక‌ల‌కు సంబంధించిన వ్య‌వ‌హారాల‌ను కూడా తెర‌మీదికి తెచ్చారు. ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మైన వార‌ణాసి(ప్ర‌ధాని సొంత నియోజ‌క‌వ‌ర్గం)(Varanasi)లోని జ్ఞాన‌వాపీ(Gyanawapi) మ‌సీదు కింద హిందూ దేవ‌త విగ్ర‌హాలు ఉన్నాయ‌నే అంశాన్ని ప్ర‌చారంలోకి తెచ్చారు. తాజాగా దీనిపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ మాట్లాడుతూ.. మ‌ళ్లీ మోడీ అధికారంలోకి వ‌స్తేనే.. జ్ఞాన‌వాపీ సాకారం అవుతుంద‌ని వ్యాఖ్యానించారు. అంటే.. ఈ ఎన్నిక‌లే కాదు.. మ‌ళ్లీ మ‌ళ్లీ వ‌చ్చే ఎన్నికల్లోనూ విజ‌యం ద‌క్కించుకునేందుకు పక్కాప్లాన్ అన్న‌మాట‌. ఇక‌, మ‌హిళ‌లకు 33 శాతం రిజ‌ర్వేష‌న్ వ‌చ్చే రెండేళ్ల త‌ర్వాతే అమ‌లు కానుంది. ఇది కూడా 2029 ఎన్నిక‌లకు ప్ర‌ధాన వ‌న‌రుగా మార‌నుంది. జ‌మిలి ఎన్నిక‌లు స‌హా.. మ‌ధుర(ఇక్క‌డ కూడా మ‌సీదు ఉంది)లో శ్రీకృష్ణుని ఆల‌య నిర్మాణ అంశాలు కూడా బీజేపీ అమ్ముల పొదిలో రెడీగా ఉన్నాయి. మొత్తానికి 2024లో రామ‌మందిరం ఒక అస్త్ర‌మైతే.. వ‌చ్చే 2029 నాటికి కూడా అస్త్రాలు రెడీ చేసుకుని.. వాటిని కూడా ఇప్ప‌టి నుంచే ప్ర‌చారం చేయ‌డం ద్వారా ప‌క్కా ప్ర‌ణాళిక‌తో 400 స్థానాల పైచిలుకు ద‌క్కించుకోవాల‌న్న‌ది బీజేపీ(BJP) ప్లాన్‌. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.