YS Sharmila Meets YS Jagan: వైఎస్ షర్మిల తన సోదరుడు, ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను కలిశారు. తన కుమారుడి నిశ్చితార్థం జనవరి 22న జరగనున్నందున ఆహ్వానపత్రికను అందించారు. షర్మిల వెంట భర్త అనిల్, కుమారుడు వైఎస్‌ రాజారెడ్డి, కుటుంబసభ్యులు కూడా ఉన్నారు. అరగంట పాటు వైఎస్ షర్మిల, జగన్ కుటుంబాలు సమావేశం అయినట్లు సమాచారం. లోనికి మీడియాను అనుమతించలేదు. అన్న వైఎస్ జగన్, వదిన వైఎస్ భారతిని కలిసి తన కుమారుడు రాజారెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను షర్మిల అందించారు. అనంతరం విజయవాడలోని నోవాటెల్ హోటల్‌కు షర్మిల బయలుదేరి వెళ్లారు. అక్కడ విశ్రాంతి తీసుకుని.. రాత్రి 8.50 గంటలకు గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు.


అంతకుముందు వైఎస్ షర్మిల, ఆమె కుటుంబ సభ్యులు కడప నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి భారీ బందోబస్తు నడుమ ఆమె తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసానికి వెళ్లారు. షర్మిల ఎయిర్ పోర్టుకు చేరుకోగానే ఆమెకు ఘన స్వాగతం లభించింది. ఆమె ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పదవీ బాధ్యతలు చేపడతారనే ప్రచారం నేపథ్యంలో కాంగ్రెస్ అభిమానులు, షర్మిల మద్దతుదారులు చాలా మంది గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎయిర్ పోర్టు వద్ద షర్మిల మాట్లాడుతూ.. తన కుమారుడి నిశ్చితార్థ వేడుకకు ఆహ్వాన పత్రికను జగన్ కు అందించడానికి వచ్చానని చెప్పారు. ఇలాంటి వేడుకలకు అందర్నీ ఆహ్వానించాలి కాబట్టి.. తన సోదరుడి వద్దకు వస్తున్నట్లు చెప్పారు.


తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ వద్ద ఆర్కే హడావుడి


వైఎస్ షర్మిల, వారి కుటుంబ సభ్యులకు ఎయిర్ పోర్టులో ఆళ్ల రామకృష్ణారెడ్డి స్వాగతం పలికారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసానికి షర్మిల బయల్దేరి వెళ్లారు. వైఎస్ షర్మిల కాన్వాయ్ జగన్ క్యాంప్ ఆఫీస్ లోనికి వెళ్లిన కొద్ది నిమిషాలకు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణారెడ్డి కూడా అక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా మీడియా  ప్రతినిధులు ఆయన్ని చుట్టుముట్టగా.. రేపు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతారని.. ఆమె ఏపీ కాంగ్రెస్ విభాగం అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టగానే తాను కూడా కాంగ్రెస్ లో చేరతానని ఆర్కే స్పష్టం చేశారు. ఆ పార్టీలో చేరిన తర్వాత ఆ పార్టీ లైన్ లోనే వెళ్తానని స్పష్టం చేశారు.