Covid Vaccination: 


పాకిస్థాన్‌ను చూడండి ఎలాగుందో : రామ్ సూరత్ 


పొగడ్తలు కొంత వరకూ బానే ఉంటాయి. మరీ మితిమీరితేనే కాస్త ఎబ్బెట్టుగా అనిపిస్తాయి. రాజకీయాల్లో ఇలాంటివి తరచుగా చూస్తూనే ఉంటాం. తమ ప్రియతమ నేతల్ని ప్రసన్నం చేసుకోవాలనుకునే ఆత్రంలో కొందరు మరీ అతిగా పొగిడేస్తారు. బిహార్‌ మంత్రి ఒకరు ఇదే చేశారు. ముజఫర్‌పూర్‌లో ఓ పబ్లిక్‌ మీటింగ్‌లో పాల్గొన్న మంత్రి రామ్ సూరత్ రాయ్...ప్రధాని మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. "మీరు ఇవాళ బతికున్నారంటే కారణం..ప్రధాని నరేంద్ర మోదీయే. కొవిడ్ సంక్షోభ సమయంలో కరోనా టీకా తయారు చేసి, అందరికీ ఉచితంగా అందించారు. దేశ ప్రజలందరికీ ఈ టీకాలిచ్చారు" అని పొగిడారు రామ్ సూరత్. ఇప్పటికీ కొన్ని దేశాలు కరోనాపై పోరాడలేక అలిసిపోతున్నాయని, భారత్ మాత్రం సమర్థంగా ఈ సవాలుని అధిగమించిందని అన్నారు. "అవసరమైతే పాక్‌ ప్రజలతో మాట్లాడండి. అక్కడ పరిస్థితులెంత దారుణంగా
ఉన్నాయో టీవీల్లో చూస్తూనే ఉన్నాం. భారత్ ఈ విషయంలో చాలా ప్రశాంతంగా ఉంది" అని వ్యాఖ్యానించారు బిహార్ మంత్రి. ఇప్పుడీ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.









 


2 బిలియన్ డోసుల రికార్డు సృష్టించిన భారత్ 


వ్యాక్సినేషన్‌లో తక్కువ సమయంలోనే భారత్ రికార్డు సృష్టించింది. 18 నెలల సమయంలోనే 2 వందల కోట్ల డోస్‌ల టీకాలు అందించింది. ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను ప్రారంభించిన భారత్, ఇంత తక్కువ వ్యవధిలోనే ఎక్కువ మందికి టీకాలను చేరువ చేసింది. ప్రపంచ దేశాల్లో మళ్లీ కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసింది కేంద్రం. ఆసియా దేశాల్లో జపాన్‌లో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. అంతర్జాతీయంగా చూస్తే ఫ్రాన్స్‌లో వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉంది. భారత్‌లో ప్రస్తుతానికి తీవ్రత కనిపించకపోయినా, కేసుల సంఖ్య పెరగకుండా ముందుగానే నియంత్రించాలని భావించింది కేంద్రం. అందుకే ఇటీవలే బూస్టర్ డోసులను ఉచితంగా అందించే క్యాంపెయిన్‌నూ ప్రారంభించింది. ఈ తరుణంలోనే 2 బిలియన్ డోసుల రికార్డు సాధించింది. ఈ రికార్డుపై ప్రధానినరేంద్ర మోదీ ట్విటర్ ద్వారా స్పందించారు. "భారత్ మరోసారి చరిత్ర సృష్టించింది. 2 వందల కోట్ల డోసుల మైలురాయి దాటినందుకు భారత ప్రజలందరికీ అభినందనలు. వ్యాక్సినేషన్‌ ద్వారా కొవిడ్‌పై సమర్థవంతమైన పోరాటం సాగించాం"  అని ట్వీట్ చేశారు. 


ఉచిత బూస్టర్ డోస్ కార్యక్రమం 


భారత్ ఈ రికార్డు సాధించినప్పటికీ..బూస్టర్ డోసుల విషయంలో మాత్రం ఇంకా సాధించాల్సింది చాలానే ఉంది. దేశ జనాభాలో కేవలం   8% మంది మాత్రమే బూస్టర్ డోస్ తీసుకున్నట్టుగా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అందుకే జులై 15వ తేదీ నుంచి 75 రోజుల ఉచిత బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ ప్రక్రియను  ప్రారంభించింది కేంద్రం. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ఈ క్యాంపెయిన్‌ను చేపట్టినట్టు వెల్లడించింది. 


Also Read: Tomato Rates Drop : టమాటా ధరలు భారీగా పతనం, కిలో ధర రూ.5 దిగువకు!


Also Read: Maharashtra News: ప్రెగ్నెంట్ అని బ్లాక్ మెయిల్- ప్రియుడి నుంచి రూ.67 లక్షలు దోచేసిన యువతి!