రిటైల్‌ ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు భారతీయ రిజర్వు బ్యాంకు మరిన్ని కఠిన చర్యలు తీసుకోనుంది. త్వరలో జరిగే ద్వైమాసిక ద్రవ్య సమీక్షలో వడ్డీరేట్లను పెంచే అవకాశం ఉంది. ఆగస్టు నెలలో రెపో రేటును 25-30 బేసిస్‌ పాయింట్ల మేర పెంచొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అమెరికా ఫెడ్‌ బాటలోనే ఆర్బీఐ దూకుడుగా చర్యలు తీసుకోవచ్చని చెబుతున్నారు. ఇదే జరిగితే రుణాల వడ్డీరేట్లు ఇంకా పెరుగుతాయి.


ఆర్బీఐ కీలక రేట్ల నిర్ణయ కమిటీ, ద్రవ్య విధాన కమిటీ ఆగస్టు 3న సమావేశం అవుతాయి. దేశ ఆర్థిక పరిస్థితి గురించి మూడు రోజులు పాటు చర్చిస్తాయి. శుక్రవారం రోజు ద్వైమాసిక సమీక్ష నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ప్రకటిస్తారు. 


ఆరు నెలలుగా రిటైల్‌ ద్రవ్యోల్బణం 6 శాతం కన్నా ఎక్కువే ఉంటోంది. దాంతో ఆర్బీఐ స్వల్ప కాల రుణాల రేట్లను (రెపో రేటు) రెండు సార్లు పెంచింది. మేలో 40 బేసిస్‌ పాయింట్లు పెంచిన కేంద్ర బ్యాంకు జూన్‌లో 50 బేసిస్‌ పాయింట్లు పెంచింది. అయినప్పటికీ కొవిడ్‌ ముందునాటి 5.15 శాతంతో పోలిస్తే ప్రస్తుత రెపోరేటు 4.9 శాతం.. తక్కువే కావడం గమనార్హం. కరోనా మహమ్మారి వల్ల ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు 2020లో ఈ రేటును ఒక్కసారిగా తగ్గించింది.


రెపో రేటు కొవిడ్‌ ముందు నాటి స్థాయికి తీసుకొచ్చేందుకు ఆర్బీఐ ప్రయత్నించొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. రాబోయే నెలల్లో ఇంకా పెంచుతారని చెబుతున్నారు. 'ఆగస్టు 5న ఆర్బీఐ ఎంపీసీ రెపోరేటును 35 బేసిస్‌ పాయింట్లు పెంచొచ్చని మా అంచనా. మరిన్ని కఠిన చర్యలు తీసుకోవచ్చని అనిపిస్తోంది' అని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా గ్లోబల్‌ రీసెర్చ్‌ రిపోర్టు నివేదించింది. దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటే 50 బేసిస్‌ పాయింట్లు పెంచొచ్చని కనీసం 25 బేసిస్‌ పాయింట్ల పెంపును కొట్టిపారేయలేమని వెల్లడించింది.


అమెరికా ఫెడరల్‌ రిజర్వు ప్రస్తుత ఏడాది వడ్డీరేట్లను 225 బేసిస్‌ పాయింట్ల మేర పెంచిందని బ్యాంక్‌ ఆఫ్ బరోడా నివేదిక తెలిపింది. ఆర్బీఐ మాత్రం 90 బేసిస్‌ పాయింట్లే పెంచిందని గుర్తు చేసింది. ఫెడ్‌ దూకుడుగా వడ్డీరేట్లు పెంచుతుండటంతో ఆర్బీఐ సైతం అదే బాటను అనుసరించొచ్చన్న అంచనాలు పెరుగుతున్నాయి. భారత్‌లో పరిస్థితి కాస్త సవ్యంగానే ఉండటంతో కేంద్ర బ్యాంకు అంత దూకుడుగా వ్యవహరించకపోవచ్చనీ కొందరు అంటున్నారు. ఆగస్టులో 25, ఆ తర్వాత మరో 25 బేసిస్‌ పాయింట్లు పెంచొచ్చని పేర్కొంటున్నారు.


వినియోగదారుల ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 4 శాతానికి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐకి తెలిపింది. ఈ లక్షిత రేటుకు 2 శాతం తగ్గినా, 2 శాతం పెరిగినా ఫర్వాలేదని పేర్కొంది. 2022, జనవరిలో సీపీఐ ద్రవ్యోల్బణం 6 శాతం ఉండగా జూన్‌లో అది 7.01 శాతానికి చేరుకుంది. దీనిని అరికట్టేందుకే ఆర్బీఐ కష్టపడుతోంది. ఇందుకోసం రెపో రేటు పెంచితే కస్టమర్లు ఎక్కువ ఈఎంఐ చెల్లించాల్సి వస్తుంది.