విమర్శలకు సమాధానమిచ్చిన దేవేంద్ర ఫడణవీస్ 


అసెంబ్లీ వేదికగా మహారాష్ట్ర డిప్యుటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ తన మాట చతురతను చూపించారు. "అందరూ మా ప్రభుత్వాన్ని ఈడీ గవర్నమెంట్ అంటున్నారు. అవును. మాది ఈడీ ప్రభుత్వమే. ఏక్‌నాథ్-దేవేంద్ర (Eknath,Devendra-ED)సర్కార్ ఇది" అని విమర్శకులకు కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకే ఈడీని ప్రయోగించారని వస్తున్న ఆరోపణలపై ఇలా స్పందించారు దేవేంద్ర ఫడణవీస్. ట్రస్ట్ ఓట్ జరిగిన సమయంలో కొందరు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు "ఈడీ, ఈడీ" అంటూ నినాదాలు చేశారు. రెబల్స్ ఏక్‌నాథ్ షిందేకి మద్దతుని వ్వగానే ఇంకాస్త గట్టిగా నినదించారు. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేల ఇళ్లపై ఈడీ దాడులు మొదలయ్యాయి. భాజపా కావాలనే ఈ దాడులు చేయిస్తోందని తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు ఆయా ఎమ్మెల్యేలు. భాజపా మాత్రం తన పని తాను చేసుకుంటూ పోతోంది. 


ఎన్‌సీపీ, కాంగ్రెస్‌ మైత్రి కోసమే భాజపాను పక్కన పెట్టింది..


ఎప్పుడైతే ఏక్‌నాథ్ షిందే శివసేనకు ఎదురు తిరిగారో అప్పటి నుంచే భాజపా ఈడీ అస్త్రాన్ని ప్రయోగించటం మొదలైందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈడీ దాడులు చేయిస్తామని బెదిరించి మరీ శివసేన ఎమ్మెల్యేలను షిందే శిబిరంవైపు లాక్కున్నారన్న విమర్శలూ ఉన్నాయి. అయితే దేవేంద్ర ఫడణవీస్ వీటన్నింటికీ సమాధానమిస్తున్నారు. కాంగ్రెస్, ఎన్‌సీపీతో అంటకాగేందుకే, శివసేన భాజపాను కావాలని దూరం పెట్టిందని విమర్శించారు. ఏక్‌నాథ్‌ షిందేతో తాము మరోసారి శివసేన-భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని, శివసేన సైనికుడే సీఎం అయ్యారని స్పష్టం చేశారు. 2014-19 మధ్య కాలంలో శివసేన-భాజపా ప్రభుత్వం  అధికారంలో ఉంది. అధిష్ఠానం ఆదేశాల మేరకే తాను డిప్యుటీ సీఎం సీట్‌లో కూర్చున్నానని చెప్పారు దేవేంద్ర ఫడణవీస్. అధిష్ఠానం ఆదేశిస్తే ఇంట్లో కూర్చోటానికైనా సిద్ధమేనని వెల్లడించారు. 


ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటాం..


"మళ్లీ అధికారంలోకి వస్తాను" అని ఫడణవీస్‌ గతంలో చెప్పిన మాటను ఇప్పుడు ట్రెండ్ చేస్తున్నాయి ప్రతిపక్ష పార్టీలు. ఈ మాట నిలబెట్టుకునేందుకే కావాలని శివసేన ప్రభుత్వాన్ని పడగొట్టారని ఆరోపించాయి. ఈ ఆరోపణలపైనా స్పందించిన ఫడణవీస్ "ఈ ట్రోల్స్‌ చేసే వారిని క్షమించటమే, నేను తీర్చుకునే రివెంజ్" అంటూ తన స్టైల్‌లో సమాధానమిచ్చారు. కొన్నేళ్లుగా మహారాష్ట్రలో సమర్థమంతమైన అధికారం లేకుండా పోయిందని, ప్రస్తుత ప్రభుత్వం మాత్ర ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటుందని ఫడణవీస్ వెల్లడించారు. 


Also Read: Why Modi Soft On KCR : సాఫ్ట్ స్పీచ్‌తో షాకిచ్చిన మోదీ ! విమర్శించలేదని టీఆర్ఎస్ నేతలు ఫీలవుతున్నారా ?


Also Read: Dhoom-style Robbery: 'ధూమ్' రేంజ్‌లో స్కూల్‌లో దొంగతనం- దమ్ముంటే పట్టుకోవాలని సవాల్!