Yediyurappa Graft Case: ముడుపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పకు సుప్రీం కోర్టులో భారీ రిలీఫ్ దొరికింది. ఈ కేసులో ఆయనపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ నిలిపివేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.




భూ కేటాయింపుల కేసులో 79 ఏళ్ల యడియూరప్పపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను కొట్టివేసేందుకు కర్ణాటక హైకోర్టు నిరాకరించింది. దీంతో ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తాజాగా ఈ కేసులో ఆయనకు ఊరటనిస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.


ఇదీ కేసు


టీజే అబ్రహం అనే సామాజిక కార్యకర్త 2021 జూన్​లో ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో ఓ పిటిషన్​ వేశారు. యడియూరప్ప ముఖ్యమంత్రిగా ఉండగా.. కోట్లాది రూపాయలు ముడుపులు తీసుకుని బెంగళూరు డెవలప్​మెంట్ అథారిటీ(బీడీఏ) పరిధిలోని హౌసింగ్ ప్రాజెక్టు కాంట్రాక్టును ఓ ప్రైవేట్ కంపెనీకి ఇచ్చారని ఆరోపించారు. ఈ పిటిషన్‌లో యడియూరప్ప, ఆయన కుమారుడు విజయేంద్ర, కుమార్తె పద్మావతి బంధువు శశిధర్​ను నిందితులుగా పేర్కొన్నారు.


ఈ పిటిషన్‌ను తొలుత ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు కొట్టివేసింది. దీనిపై ఆయన హైకోర్టు ఆశ్రయించారు. టీజే అబ్రహం పిటిషన్​ను పునఃపరిశీలించాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశించగా స్పెషల్ కోర్టు మరోసారి విచారణ జరిపింది. యడియూరప్ప, ఆయన కుటుంబ సభ్యులపై వచ్చిన అవినీతి ఆరోపణలపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది.


యడియూరప్ప


కర్ణాటక రాష్ట్రానికి నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా సేవలందించారు యడియూరప్ప. అయితే ఆయన.. ఒక్కసారి కూడా ఐదేళ్ల పాటు పూర్తిస్థాయిలో అధికారంలో ఉండలేకపోయారు. రాజకీయ కుట్రలు, అవినీతి ఆరోపణలు.. కారణమేదైనా కావొచ్చు.. సీఎం పీఠం మాత్రం ఆయనకు ముళ్ల కుర్చీ అయ్యింది. 


బుకనకరె సిద్ధలింగప్ప యడియూరప్ప చదువు పూర్తిచేసుకున్న అనంతరం 1965లో సాంఘిక సంక్షేమ శాఖలో డివిజన్‌ క్లర్క్‌గా ఉద్యోగంలో చేరారు. అయితే కొద్ది రోజులకే ఆ ఉద్యోగం వదిలి తన స్వస్థలమైన శిఖారీపురలో ఓ రైస్‌మిల్లులో క్లర్క్‌గా చేరారు. ఆ మిల్లు యజమాని కుమార్తె మిత్రాదేవిని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత శివమొగ్గ వెళ్లి సొంతంగా హార్డ్‌వేర్‌ షాపు పెట్టుకున్నారు. అయితే చిన్నతనం నుంచే రాజకీయాలపై ఆసక్తి ఉన్న యడ్డీ.. జనసంఘ్‌లో చేరారు. 1970 తొలినాళ్లలో జనసంఘ్‌ శిఖారీపుర తాలుకా చీఫ్‌గా ఎంపికయ్యారు. అలా రాజకీయాల్లో తొలి అడుగు పడింది. 


Also Read: Kerala HC On PFI: 'అనుమతి లేకుండా బంద్‌ ఎలా చేస్తారు?' PFIపై కేరళ హైకోర్టు సీరియస్


Also Read: Hair Conditioner Fatal: అణు యుద్ధం జరిగితే షాంపూలు, కండిషనర్లు వాడొద్దట- అమెరికా సలహా!