Kerala HC On PFI: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) కేరళలో శుక్రవారం బంద్‌కు పిలుపునివ్వడంపై ఆ రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంపై సుమోటో విచారణ జరిపింది. పోలీసులు లేదా కోర్టు నుంచి ముందస్తు అనుమతి పొందకుండా బంద్‌కు పిలుపునివ్వకూడదని కోర్టు పేర్కొంది.
ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతిస్తున్నారనే ఆరోపణలపై దేశవ్యాప్తంగా ఉన్న పీఎఫ్‌ఐ కార్యాలయాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ), ఇతర ఏజెన్సీలు గురువారం సోదాలు నిర్వహించాయి. తమ పార్టీకి చెందిన కీలక నేతలను అరెస్టు చేసినందుకు నిరసనగా పీఎఫ్‌ఐ కేరళలో హర్తాళ్‌కు పిలుపునిచ్చింది.
హింసాత్మకంగా
పీఎఫ్ఐ పిలుపునిచ్చిన ఈ హర్తాళ్ హింసాత్మక ఘటనలకు దారితీసింది. కేరళ రాజధాని తిరువనంతపురం సహా వివిధ జిల్లాల్లో చెదురుమదురు హింసాత్మక ఘటనలు జరిగాయి. తిరువనంతపురం, కొల్లం, కోజికోడ్, వయనాడ్, అలప్పుజా సహా పలు జిల్లాల్లో కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులపై (కేఎస్‌ఆర్‌టీసీ) ఆందోళనకారులు రాళ్లు రువ్వారు.
కన్నూర్‌లోని నారాయణ్‌పరా వద్ద ఉదయం వార్తా పత్రికలను పంపిణీ చేయడానికి వెళ్తున్న వాహనంపై పెట్రోల్ బాంబు విసిరినట్లు స్థానిక మీడియా పేర్కొంది. అలప్పుజలో హర్తాళ్ చేస్తోన్న ఆందోళనకారులు రాళ్లదాడి చేసిన ఘటనలో కేఎస్‌ఆర్‌టీసీ బస్సులు, ట్యాంకర్ లారీ మరికొన్ని వాహనాలు ధ్వంసమయ్యాయి. కోజికోడ్, కన్నూర్‌లో పీఎఫ్‌ఐ కార్యకర్తలు చేసిన రాళ్ల దాడిలో 15 ఏళ్ల బాలికకు, ఓ ఆటో రిక్షా డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి.
పటిష్ఠ భద్రత
పీఎఫ్‌ఐ రాష్ట్రవ్యాప్తంగా హర్తాళ్‌కు పిలుపునివ్వడంతో కేరళ పోలీసులు రాష్ట్రంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. శాంతిభద్రతలను కాపాడాలని పోలీసు ఉన్నతాధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.
మొత్తం 11 రాష్ట్రాల్లోని PFI (Popular Front of India) ఆఫీసుల్లో ఎన్‌ఐఏ, ఈడీ అధికారులు రెయిడ్స్ చేశారు. జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న 106 మందిని అరెస్ట్ చేశారు. ఈ 106 మందిలో అత్యధికంగా కేరళకు చెందిన వారే ఉన్నారు. కేరళలో 22 మంది, మహారాష్ట్ర, కర్ణాటకలో 20 మంది, ఆంధ్రప్రదేశ్ ఐదుగురు, అసోంలో 9 మంది, దిల్లీలో ముగ్గురు, మధ్యప్రదేశ్‌లో నలుగురు, పుదుచ్చేరిలో ముగ్గురు, తమిళనాడులో 10 మంది, యూపీలో 8 మందితో పాటు రాజస్థాన్‌లో ఇద్దరు అరెస్ట్ అయ్యారు.
Also Read: Hair Conditioner Fatal: అణు యుద్ధం జరిగితే షాంపూలు, కండిషనర్లు వాడొద్దట- అమెరికా సలహా!
Also Read: Amit Shah Bihar Visit: 'నితీశ్‌ది వెన్నుపోటు రాజకీయం- 2024లో భాజపా తడాఖా చూపిస్తాం'