Noida Gurugram Rains: 


రికార్డు స్థాయి వర్షపాతం..


ఈ మధ్యే బెంగళూరులో వరదల  కారణంగా...ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో చూశాం. సిటీల్లో ఇది సర్వసాధారణమైంది. బెంగళూరులో పరిస్థితులు కాస్త కుదుటపడేలోపే..యూపీలో ఇదే రిపీట్ అయింది. భారీ వర్షాల కారణంగా అక్కడి రోడ్లు జలమయమయ్యాయి. ఉత్తర్‌ప్రదేశ్ సహా గుడ్‌గావ్‌లో రోడ్లు నీళ్లతో నిండిపోయాయి. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇచ్చేశారు. అటు దేశ రాజధాని ఢిల్లీలోనూ వరదల ప్రభావం కనిపిస్తోంది. ఈ వరదలతో యూపీలో సామాన్యుల జీవనం అస్యవ్యస్తమైంది. ఉరుములు, గోడలు కూలడం, ఇళ్లు ధ్వంసం అవడం లాంటి ఘటనలతో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఫిరోజాబాద్‌ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలీగర్‌ ప్రాంతంలో అన్ని స్కూల్స్‌ని మూసేశారు. గురువారం సాయంత్రం 5.30 నుంచి ఢిల్లీలో 40.8మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఫలితంగా...ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ అస్తవ్యస్తమైంది. ఢిల్లీలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని IMD అంచనా వేస్తోంది. ఇక్కడి కనిష్ఠ ఉష్ణోగ్రతలు 22 డిగ్రీ సెంటిగ్రేడ్‌గా నమోదైంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 28 డిగ్రీల సెల్సియస్‌గా నమోదవుతుందని అంచనా. ఇప్పటికే ఢిల్లీకి ఎల్లో అలర్ట్ ఇచ్చింది IMD.గుడ్‌గావ్ అధికార యంత్రాంగం అన్ని ఆఫీస్‌లకు సూచనలు చేసింది. ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇవ్వాలని చెప్పింది. తప్పనిసరై బయటకు వచ్చిన వాళ్లంతా ట్రాఫిక్‌లో ఇరుక్కుంటున్నారు. ఎక్స్‌ప్రెస్‌ వేలో నీరు నిలిచిపోయింది. 


గత నెలలోనూ ఇంతే..


ఆగస్టులోనూ ఢిల్లీలో భారీ వర్షాలు కురిశాయి. యమున నది ప్రవాహ ఉద్ధృతి రికార్డు స్థాయిలో పెరిగింది. ఆ సమయంలో ముంపు ప్రాంతాల్లోని పౌరుల్లో 5 వేల మందిని హాథీ ఘాట్‌లో టెంట్లలోకి తరలించారు. మరి కొందరిని నార్త్‌ఈస్ట్ జిల్లాల్లోని సురక్షిత ప్రాంతాలకు పంపారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి బాధితులకు వసతులు ఏర్పాటు చేస్తున్నాయి. ఆహారం, తాగునీరు సహా ఇతరత్రా నిత్యావసరాలు అందించాయి. కరవాల్ నగర్‌లో 200 మంది ఎత్తైన ప్రాంతానికి తరలించినట్టు అధికారులు తెలిపారు. హరియాణాలో యమునా నగర్‌లోని 
హత్నికుండ్ బ్యారేజ్‌ నుంచి రికార్డు స్థాయిలో నీరు విడుదలవటం వల్ల దిల్లీకి ఇబ్బందులు తప్పలేదు. ఒకానొక సమయంలో లక్ష క్యూసెక్కుల మార్క్‌నూ దాటింది. వెంటనే అక్కడి ప్రజల్ని అప్రమత్తం చేశారు. దాదాపు 37 వేల మందిపై ఈ వరదల ప్రభావం పడింది. కొందరికి స్కూల్స్‌లోనే శిబిరాలు ఏర్పాటు చేశారు. ఇంకొందరికి బిల్డింగ్‌లలో వసతులు కల్పించారు. సాధారణంగా...హత్నికుండ్ బ్యారేజ్‌ ఫ్లో రేట్ 352 క్యూసెక్కులు మాత్రమే. కానీ..భారీ వర్షాల కారణంగా డిశ్చార్జ్ అనూహ్యంగా పెరిగింది. బ్యారేజ్ నుంచి విడుదలయ్యే నీరు దిల్లీకి చేరుకోటానికి 
రెండు,మూడు రోజుల సమయం పడుతుంది. కానీ...వర్షాల ధాటికి ముందుగానే దిల్లీని ముంచెత్తాయి. గతేడాది కూడా యమునా నది ప్రమాదకర స్థాయిలో ప్రవహించింది. గతేడాది జులై 30వ తేదీన ఓల్డ్ రైల్వే బ్రిడ్జ్ వద్ద నది నీటిమట్టం 205.59 మీటర్లకు చేరుకుంది.