Indian rupee Weakens Past 81 Mark for First Time: రూపాయి మరోసారి బలహీనపడింది! చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సరికొత్త కనిష్ఠ స్థాయికి పతనమైంది. డాలర్‌తో పోలిస్తే తొలిసారి 81 మార్క్‌ను దాటేసింది. యూఎస్‌ ఫెడ్‌ వడ్డీరేట్లు పెంచడం, పదేళ్ల అమెరికా బాండ్ల రాబడి 6 బేసిస్‌ పాయింట్లు పెరగడం, యూఎస్‌ ట్రెజరీ యీల్డులు రెండు నెలల గరిష్ఠానికి చేరుకోవడమే ఇందుకు కారణాలు.


భారీ గ్యాప్‌డౌన్‌


శుక్రవారం ఆరంభమే రూపాయి భారీ గ్యాప్‌డౌన్‌తో మొదలైంది. ఉదయం 9.15 గంటల వద్ద జీవితకాల కనిష్ఠమైన 81.26 వద్ద ఓపెనైంది. ఆ తర్వాత 81.15 వద్ద కొనసాగింది. చివరి ముగింపు 80.87తో పోలిస్తే 0.33 శాతం పతనమైంది. మధ్యాహ్నం కాస్త కోలుకొని 80.86 వద్ద చలించింది. 12 గంటలకు 80.95 వద్ద కొనసాగుతోంది. చివరి ఎనిమిది సెషన్లలో ఏడు సార్లు రూపాయి 2.51 శాతం బలహీనపడటం గమనార్హం. మొత్తంగా ఈ ఏడాది 8.48 శాతం పతనమైంది.


ఆర్బీఐ కిం కర్తవ్యం?


రూపాయి ఆల్‌టైమ్‌ కనిష్ఠ స్థాయికి పతనమవ్వగానే కరెన్సీ మార్కెట్లలో ఆర్బీఐ జోక్యం చేసుకుందో లేదో తెలియడం లేదు. ఇకపై రూపాయి విలువ పతనాన్ని ఆపడం కేంద్ర బ్యాంకుకు కష్టమేనని నిపుణులు అంచనా వేస్తున్నారు. బ్యాంకింగ్‌ వ్యవస్థలో లిక్విడిటీ తక్కువగా ఉండటమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. ఒకవేళ స్పాట్‌ మార్కెట్లో ఆర్బీఐ జోక్యం చేసుకుంటే బ్యాంకింగ్‌ వ్యవస్థలో లిక్విడిటీ మరింత దారుణంగా మారుతుందని, స్వల్ప కాల రుణాల వడ్డీరేట్లు పెరుగుతాయని పేర్కొంటున్నారు.


82కు తప్పని పతనం!


ఒకవేళ ఆర్బీఐ ఎలాంటి చర్యలు తీసుకోకపోతే రూపాయి విలువ షార్ట్‌ టర్మ్‌లో 81.80 నుంచి 82 స్థాయిలను టెస్టు చేస్తుందని సీఆర్‌ ఫారెక్స్‌  తెలిపింది. ఆర్బీఐ విధానం, లిక్విడిటీని మెరుగుదల, రిజర్వుల పతనం ఆపేందుకు కేంద్ర బ్యాంకు ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనని ట్రేడర్లు ఎదురు చూస్తున్నారు. కాగా సెప్టెంబర్‌ 28-30న ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ సమావేశం కానుంది. సెప్టెంబర్‌ 30న మరోసారి వడ్డీరేట్లపై నిర్ణయం ప్రకటించనుంది.


భవిష్యత్తులో ఢోకా లేదు!


రూపాయి పతనం మరీ ఎక్కువగా ఉండకపోవచ్చని ఐసీఐసీఐ డైరెక్ట్‌ అంచనా వేస్తోంది. ఒకవేళ జేపీ మోర్గాన్‌ ప్రభుత్వ బాండ్లను సూచీల్లో కలిపితే 2024 ఆర్థిక ఏడాదిలోపు భారత్‌లోకి విదేశీ సంస్థాగత పెట్టుబడులు 30 బిలియన్‌ డాలర్ల మేర ప్రవహిస్తాయని అంచనా వేసింది. 'రూపాయి 79పై స్థాయిల్లో ఉన్నంత వరకు 81.50 స్థాయి వరకు తగ్గిపోక తప్పదు. ఎందుకంటే ట్రేడ్‌ డెఫిసిట్‌, డాలర్‌ ఆధిపత్య భయాలు వెంటాడతాయి. ఆర్బీఐ చర్యలు తీసుకుంటే కరెన్సీ మార్కెట్లో ఒడుదొడుకులు తగ్గొచ్చు' అని వెల్లడించింది.