Wrestlers Protest: 

నేను బజ్‌రంగీనే అంటూ పోస్ట్..

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద రెజ్లర్ల ఆందోళన కొనసాగుతూనే ఉంది. క్రమంగా వీరికి మద్దతు కూడా పెరుగుతోంది. రాజకీయాలకు అతీతంగానే నిరసనలు చేపడుతున్నామని రెజ్లర్లు చెబుతున్నప్పటికీ బీజేపీ వ్యతిరేక పార్టీలు..రెజ్లర్ల ఆందోళనలను ఓన్ చేసుకుంటున్నాయి. పూర్తి మద్దతునిస్తామని ప్రకటిస్తున్నాయి. ఈ ఉద్యమం చేసే వారిలో బజ్‌రంగ్ పునియా కూడా ఉన్నారు. బజరంగ్‌ దళ్‌ను బ్యాన్ చేస్తామన్న కాంగ్రెస్ హామీపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న క్రమంలో పునియా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టారు. "నేను బజ్‌రంగీనే. బజ్‌రంగ్‌ దళ్‌కు మద్దతునిస్తాను" అంటూ పోస్ట్ చేశారు. ఆ పోస్ట్‌తో పాటు షేర్ చేసిన ఫోటోను డీపీగా పెట్టుకోవాలని సూచన కూడా ఇచ్చారు పునియా. ఏమైందో తెలియదు కానీ కాసేపటికే మళ్లీ ఆ పోస్ట్‌ని డిలీట్ చేశారు. ఈ పోస్ట్ పెట్టిన వెంటనే నెటిజన్లు కామెంట్‌లతో విరుచుకుపడ్డారు. తీవ్రంగా విమర్శించారు. అందుకే డిలీట్ చేసినట్టు తెలుస్తోంది. 

రైతుల మద్దతు..

ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరసనలు చేపడుతున్న రెజ్లర్లకు రైతు సంఘాలు మద్దతుగా నిలుస్తున్నాయి. సంయుక్త కిసాన్ మోర్చ (SKM) దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. రెజ్లర్లకు మద్దతు ప్రకటించింది. ఢిల్లీలో ఒక్కసారిగా రైతు సంఘాల నేతలు జంతర్‌మంతర్‌ వద్దకు రావడం వల్ల ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు పెద్ద ఎత్తున మొహరించారు. భద్రత కట్టుదిట్టం చేశారు. పంజాబ్, హరియాణా నుంచి రైతు సంఘాల నేతలు ఢిల్లీకి వచ్చారు. బ్రిజ్ భూషణ్ సింగ్‌ను అరెస్ట్ చేయాలన్న రెజ్లర్ల డిమాండ్‌కు మద్దతునిచ్చారు. వెంటనే ఆయనను అన్ని పదవుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. వీరితో పాటు కీర్తి కిసాన్ యూనియన్‌ నేతలూ రెజ్లర్లతో పాటు నిరసన తెలిపారు. ఇప్పటికే హరియాణా హోం మంత్రి అనిల్ విజ్ రెజ్లర్లకు సపోర్ట్‌గా ఉంటామని ప్రకటించారు. దేశమంతా ఇప్పుడీ అంశం గురించి మాట్లాడుకుంటోందని తేల్చి చెప్పారు. పలు సంఘాలు తమకు మద్దతునివ్వడంపై బజ్‌రంగ్ పునియా స్పందించారు. 

"ప్రజల నుంచే కాకుండా అన్ని సంఘాల నుంచి మాకు మద్దతు లభిస్తోంది. ఇంకా మాకు మద్దతుగా ఎంత మంది వస్తారో చెప్పలేం. అందరికీ మాదొక్కటే విన్నపం. ప్రశాంతంగా నిరసనలు చేపట్టండి. ఒకవేళ పోలీసులు మిమ్మల్ని అడ్డుకుంటే అక్కడే కూర్చుని నిరసనలు చేయండి. మహిళా రెజ్లర్ల కోసం ఇంత మంది నిలబడడం చాలా సంతోషంగా ఉంది"

- బజ్‌రంగ్ పునియా, రెజ్లర్

కాంగ్రెస్ యూటర్న్..

కర్ణాటక కాంగ్రెస్ "భజ్‌రంగ్ దళ్‌"ని బ్యాన్ చేస్తామని హామీ ఇచ్చినప్పటి నుంచి ఆ వివాదం సద్దుమణగడం లేదు. అటు బీజేపీ ఇదే విషయాన్ని పొలిటికల్‌గా తమకు అనుకూలంగా మార్చేసుకుంది. యాంటీ హిందూ పార్టీ అయిన కాంగ్రెస్‌ను ఓడించండి అంటూ ప్రచారం చేస్తోంది. ఇప్పటి వరకూ దీనిపై కాంగ్రెస్ స్పందించలేదు. కనీసం వివరణ కూడా ఇవ్వలేదు. అయితే వివాదం ముదరడం వల్ల ఓ సీనియర్ నేత కీలక వ్యాఖ్యలు చేశారు. భజరంగ్ దళ్‌ను నిషేధించాలన్న  ప్రతిపాదన ఏమీ లేదని తేల్చి చెప్పారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, ఎంపీ వీరప్ప మొయిలీ ఈ స్పష్టతనిచ్చారు. ఉడుపిలో ప్రచారం చేస్తున్న వీరప్ప..ఈ కామెంట్స్ చేశారు. ఇది రాజకీయంగా బీజేపీకే బూస్ట్ ఇచ్చేలా ఉందని కాంగ్రెస్ ఇలా జాగ్రత్తపడింది. వీరప్ప మొయిలి ప్రకటనతో క్లారిటీ ఇచ్చింది. 

Also Read: Army Helicopter Crash: ఇంటిపై కూలిన ఆర్మీ హెలికాప్టర్‌, ఇద్దరు మృతి - పైలట్‌లు మాత్రం సేఫ్