Stock Market Today, 08 May 2023: ఇవాళ (సోమవారం) ఉదయం 8.00 గంటల సమయానికి, సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX Nifty Futures) 34 పాయింట్లు లేదా 0.18 శాతం గ్రీన్‌ కలర్‌లో 18,158 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది. 


ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి:


పిరమాల్ ఎంటర్‌ప్రైజెస్: శ్రీరామ్ ఫైనాన్స్‌లో 375 కోట్ల రూపాయల ఈక్విటీ పెట్టుబడి కారణంగా పిరమల్ ఎంటర్‌ప్రైజెస్ 2023 మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ. 196 కోట్ల నష్టాల్లోకి జారిపోయింది, గత ఏడాది ఇదే కాలంలో 151 కోట్ల లాభం నమోదు చేసింది.


ఓలెక్ట్రా గ్రీన్‌టెక్: మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ. 27 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది, ఇది గత ఏడాది కాలంతో పోలిస్తే 52% పెరిగింది. ఏకీకృత ఆదాయం Q4FY22లోని రూ. 271 కోట్ల నుంచి Q4FY23లో 39% పెరిగి రూ. 376 కోట్లకు చేరుకుంది.


అలెంబిక్ ఫార్మా: 2022 మార్చి త్రైమాసికంలో వచ్చిన రూ. 22 కోట్ల పన్ను తర్వాతి లాభంతో పోలిస్తే, 2023 మార్చి త్రైమాసికంలో రూ. 153 కోట్ల లాభాన్ని నివేదించింది. ఇదే కాలంలో కార్యకలాపాల ఆదాయం రూ. 1415.74 కోట్ల నుంచి రూ. 1406.45 కోట్లకు స్వల్పంగా తగ్గింది. 


ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: నాలుగో త్రైమాసికంలో ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ నికర లాభం 58% జంప్ చేసి రూ. 190 కోట్లకు చేరుకుంది. వ్యాపార విస్తరణ, ఆస్తుల నాణ్యత మెరుగ్గా ఉంది. స్థూల అడ్వాన్సులు ఏడాది ప్రాతిపదికన 35% పెరిగి రూ. 27,861 కోట్లకు చేరుకున్నాయి.


Paytm: రెండు వరుస త్రైమాసికాల్లో నిర్వహణ లాభాన్ని (ESOP వ్యయానికి ముందు EBITDA) పోస్ట్ చేసింది. 2023 మార్చి త్రైమాసికంలో నష్టాలను గణనీయంగా తగ్గించింది. కంపెనీ ఏకీకృత నికర నష్టం ఏడాది క్రితం నాటి రూ. 761 కోట్ల నుంచి ఇప్పుడు రూ. 168 కోట్లకు తగ్గింది. 2022 డిసెంబర్‌ త్రైమాసికంలో ఇది రూ. 392 కోట్లుగా ఉంది. FY23 మార్చి త్రైమాసికంలో ఏకీకృత ఆదాయం దాదాపు 52% YoY పెరిగి రూ. 2,335 కోట్లకు చేరుకుంది.


అదానీ పవర్‌: ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో అదానీ పవర్ ఏకీకృత నికర లాభం ఏడాది క్రితం నాటి రూ. 4,645 కోట్లతో పోలిస్తే రూ. 5,242.48 కోట్లకు, 12.9% పెరిగింది. మొత్తం ఆర్థిక సంవత్సరంలో నికర లాభం రూ. 4911.5 కోట్ల నుంచి రెండింతలు పెరిగి రూ. 10726 కోట్లకు చేరుకుంది. నాలుగో త్రైమాసికంలో ఏకీకృత ఆదాయం రూ. 10,795 కోట్లుగా ఉంది, ఇది అంతకు ముందు త్రైమాసికంలో రూ. 13,308 కోట్లుగా ఉంది.


ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్‌ రిటైల్: TCNS క్లోతింగ్‌లో 51% వాటాను ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ (ABFRL) కొనుగోలు చేసింది. మరో 29% వాటా కొనుగోలు కోసం ఒక్కో షేరుక్ రూ. 503 చొప్పున ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించనుంది.


యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: 2022 మార్చి త్రైమాసికంలో ఈ కంపెనీ ఆర్జించిన రూ. 1,557 కోట్ల లాభంతో పోలిస్తే, 2023 మార్చి త్రైమాసికంలో రూ. 2,812 కోట్లు సాధించింది. నికర NPAలు 1.7%గా ఉన్నాయి, QoQలో 2.14% నుంచి మెరుగుపడ్డాయి.


బ్యాంక్ ఆఫ్ ఇండియా: బ్యాంక్ ఆఫ్ ఇండియా నికర లాభం Q4FY23లో రూ. 1,350 కోట్లకు 123% YoY వృద్ధి చెందింది, Q4FY22లోని రూ. 606 కోట్ల నుంచి పెరిగింది. నిర్వహణ లాభం సంవత్సరానికి 69.67% పెరిగింది. ఇది, Q4FY22లో రూ. 2,466 కోట్ల నుంచి Q4FY23లో రూ. 4,184 కోట్లకు చేరుకుంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.