Cyber Fraud: భారతదేశంలో పెరుగుతున్న ఇంటర్నెట్ వాడకంతో పాటే సైబర్ నేరం కేసుల సంఖ్య కూడా వేగంగా పెరుగుతోంది. చెప్పుల షాపింగ్ నుంచి ఆహారం ఆర్డర్ చేయడం వరకు అన్ని రకాల పనుల కోసం ప్రజలు ఇంటర్నెట్‌ ఉపయోగిస్తున్నారు. ఇందుకోసం రకరకాల వెబ్‌సైట్లను ఆశ్రయిస్తున్నారు. వీటిలో కొన్ని నమ్మకమైన వెబ్‌సైట్లు అయితే, మిగిలినవి ఫేక్‌ సైట్లు. ఫేక్‌ సైట్లలో సైబర్‌ నేరగాళ్లు పొంచి ఉంటారు, ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే, ప్రజల నమ్మకాన్ని చూరగొన్న సైట్లలోనూ ఇప్పుడు మోసాలు వెలుగు చూస్తున్నాయి. కాబట్టి, ఆన్‌లైన్‌లో షాపింగ్‌ లేదా ఆర్డర్‌ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. 


స్థిరాస్తి క్రయవిక్రయం లేదా అద్దె కోసం కూడా చాలా ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు ఇంటర్‌నెట్‌లో దర్శనమిస్తున్నాయి. మన దేశంలోని ఐటీ సిటీ బెంగళూరులో, ప్రముఖ రియల్ ఎస్టేట్ పోర్టల్ "నోబ్రోకర్‌" (NoBroker) ద్వారా జరిగిన ఒక మోసం కేసు  వెలుగులోకి వచ్చింది. ఈ పోర్టల్‌ ద్వారా, కొంతమంది వ్యక్తులు ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను రూ. 1.60 లక్షలు మేర మోసం చేశారు.


అసలు విషయం ఏమిటి?
టైమ్స్ ఆఫ్ ఇండియాలో ప్రచురించిన నివేదిక ప్రకారం.. మోసానికి గురైన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు బెంగళూరులో ఉద్యోగం వచ్చింది. అతను, జూన్ 1, 2023 నాటికి ఆ నగరానికి మారవలసి వచ్చింది. దీంతో, అద్దె ఇంటి కోసం అతను ఇంటర్నెట్‌ను ఆశ్రయించారు.చాలా రియల్ ఎస్టేట్ పోర్టల్స్‌లో మంచి అద్దె ఫ్లాట్ కోసం వెదికాడు.  ప్రముఖ రియల్ ఎస్టేట్ పోర్టల్ "నోబ్రోకర్‌"లో, మారతహళ్లి ప్రాంతంలో అద్దెకు ఇచ్చే ఫ్లాట్‌ వివరాలు కనిపించాయి. ఆ ఫ్లాట్‌ అతనికి నచ్చింది. ఆ ఫ్లాట్‌కు సంబంధించిన వివరాల్లో ఇచ్చిన నంబర్‌కు సదరు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ కాల్‌ చేశాడు. కాల్‌ లిఫ్ట్‌ చేసిన వ్యక్తి, తాను ఆ ఫ్లాట్ యజమానని, తాను ఇండియన్ ఆర్మీలో రిటైర్డ్ అధికారిగా అభివర్ణించుకున్నాడు. ఆ తర్వాత, ఫ్లాట్‌ అద్దె, ఇతర వివరాల గురించి తన మేనేజర్‌తో మాట్లాడమని చెప్పి, అతని నంబర్ ఇచ్చాడు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆ మేనేజర్‌తో మాట్లాడగా, అడ్వాన్స్ పేమెంట్ చేయమని అతను చెప్పాడు. ఆ విధంగా, అడ్వాన్స్‌ పేరుతో మొత్తం 8 లావాదేవీల్లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ నుంచి రూ. 1.60 లక్షలు తీసుకున్నారు.


డబ్బు బదిలీ చేసిన తర్వాత, ఆ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఫ్లాట్ యజమానిని సంప్రదించడానికి ప్రయత్నించగా, అతనిది, అతని మేనేజర్ మొబల్‌ నంబర్‌లు స్విచ్ ఆఫ్ అని వ్చాయి. తాను మోసపోయినట్లు అప్పుడు గుర్తించాడు ఆ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. అయితే.. నోబ్రోకర్ పోర్టల్ ప్రసిద్ధ వెబ్‌సైట్ అని, దానిపై తనకు ఎటువంటి సందేహం లేదని చెప్పాడు.


వెబ్‌సైట్‌ ఏం చెప్పింది?
మోసం కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత, ఆ ఇంటి ప్రకటనను తీసివేసినట్లు పేర్కొంటూ NoBroker ఒక ప్రకటన విడుదల చేసింది. దీంతో పాటు, ఎటువంటి విచారణ లేకుండా, ఓనర్‌ని అని చెప్పుకున్న అపరిచిత వ్యక్తి ఖాతాకు లక్షల రూపాయలు బదిలీ చేయడం ముమ్మాటికీ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ తప్పని తెలిపింది. 


మన దేశంలో గత కొన్ని సంవత్సరాలుగా సైబర్ క్రైమ్‌ల కేసుల్లో విపరీతమైన పెరుగుదల కనిపిస్తోంది. కాబట్టి, ఏదైనా పోర్టల్ ద్వారా ఇల్లు కొనుగోలు/అద్దె లేదా షాపింగ్ వంటివి చేసేటప్పుడు కచ్చితంగా క్రాస్ చెక్ చేయండి. ఒకవేళ ఆన్‌లైన్ మాధ్యమం ద్వారా అద్దె ఇంటి కోసం చూస్తున్నట్లయితే, ముందుగా ఆ ఇంటికి వెళ్లి చూడండి. ఆ తర్వాత మాత్రమే అడ్వాన్స్ ఇవ్వండి.