మెరుపు దాడులతో అఫ్గానిస్తాన్‌ దేశాన్ని ఆక్రమించిన తాలిబన్లు.. సర్కారు ఏర్పాటులో మాత్రం మల్లగుల్లాలు పడుతున్నారు. వరుసగా రెండో సారి కూడా తాలిబాన్లు.. ప్రభుత్వ ఏర్పాటును వాయిదా వేశారు. తమ కేబినేట్‌లో సభ్యులుగా ఎవరెవరు ఉండాలనే అంశంపై చర్చలు జరుపుతున్నామని.. వచ్చే వారంలో నూతన సర్కారును ఏర్పాటు చేస్తామని తాలిబన్ల ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ వెల్లడించారు. కేబినేట్‌ సభ్యులకు సంబంధించిన వివరాలను వచ్చే వారం వెల్లడిస్తామని చెప్పారు. అంతర్జాతీయ సమాజం మెచ్చే రీతిలో అధికార యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడంలో తాలిబన్లు ఇక్కట్లు ఎదుర్కొంటున్నట్లు పలు నివేదికలు తెలిపాయి. 


వాస్తవానికి శుక్రవారమే (సెప్టెంబర్ 3) అఫ్గాన్‌లో నూతన సర్కార్ కొలువు తీరాల్సి ఉంది. అఫ్గాన్‌లో తాలిబన్ సహ వ్యవస్థాపకుడు ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పనుందనే తొలుత వార్తలు వచ్చాయి. అనంతరం అనివార్య కారణాల ప్రభుత్వ ఏర్పాటును శనివారానికి (ఈరోజు) వాయిదా వేస్తున్నట్లు ముజాహిద్ వెల్లడించారు. తాజాగా దీనిని వచ్చే వారానికి వాయిదా వేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. 


దీనిపై ఖలీల్ హఖ్కానీ అనే నేత కూడా స్పందించారు. తాలిబన్లు వారి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోగలరని.. కేవలం తాలిబన్లు మాత్రమే యంత్రాంగంలో ఉంటే ప్రపంచం ఆమోదించదని చెప్పారు. అందుకే అన్ని వర్గాల ప్రజలతో పాటు పార్టీలకు ప్రాతినిధ్యం ఇవ్వాలని తాలిబన్లు భావిస్తున్నట్లు తెలిపారు. ఈ కారణం వల్లే ప్రభుత్వ యంత్రాంగ ఏర్పాటులో జాప్యం జరుగుతున్నట్లు పేర్కొన్నారు. అఫ్గాన్‌ మాజీ అధ్యక్షుడు అష్రాఫ్‌ గనీ సోదరుడు హస్మత్‌ గనీతో పాటు.. అఫ్గాన్ మాజీ అధ్యక్షుడు గుల్‌బుద్దీన్‌ హక్మతీయార్‌కు తమ ప్రభుత్వంలో ప్రాతినిధ్యం ఇవ్వాలని తాలిబన్లు యోచిస్తున్నట్లు హఖ్కానీ వెల్లడించారు. వీరితో పాటు ఇతర రాజకీయ పార్టీలతో కూడా తాలిబన్లు సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు. 


అఫ్గాన్‌కు పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ చీఫ్.. 
పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ చీఫ్ జనరల్‌ ఫైజ్‌ హమీద్‌ శనివారం కాబూల్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ల ప్రభుత్వ ఏర్పాటుకు సాయం చేయడానికి ఈయన కాబూల్ వచ్చినట్లు అసోసియేటెడ్ ప్రెస్ పేర్కొంది. మీడియాతో మాట్లాడేందుకు పాక్ అధికారులు నిరాకరించినట్లు తెలిపింది. 


చైనా హస్తం కూడా ఉందా?
అఫ్గానిస్తాన్‌ దేశాన్ని తాలిబన్లు వశం చేసుకున్నప్పటి నుంచి సానుకూలంగా వ్యవహరిస్తున్న చైనా.. మరోసారి కీలక నిర్ణయం తీసుకుందని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. పాక్ సాయంతో చైనా.. అఫ్గాన్ లో తాలిబన్ల రాజ్యం ఏర్పాటు చేసే దిశగా పావులు కదుపుతోందని ఆరోపించింది. పాక్ ఇంటెలిజెన్స్ అధికారి కాబూల్ చేరుకోవడంతో ఈ ఆరోపణలకు మరింత ఊతమిచ్చినట్లయింది. 


Also Read: Afghanistan Crisis: అఫ్గాన్‌లో ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు.. రంగంలోకి దిగిన గూగుల్.. తాలిబన్ నేతలకు మైండ్ బ్లాక్!


Also Read: Taliban Crisis News: ఓవైపు తాలిబన్ల తూపాకీ తూటాలు.. మరోవైపు ప్రజల ఆకలి కేకలు