Elon Musk Buys Twitter: ఫ్రీ స్పీచ్.. ఫ్రీడం ఆఫ్ స్పీచ్.. భావ వ్యక్తీకరణ..పేరు ఏదైనా కావచ్చు ఓ మనిషిగా మన ఎగ్జిస్టెన్స్‌కు రెప్లికాలా నిలిచేది భావవ్యక్తీకరణ. మానవ హక్కుల నుంచి మొదలుపెట్టి లా ఆఫ్ ల్యాండ్ వరకూ మనిషికి ఉండాల్సిన ప్రధాన హక్కుల్లో ఫ్రీ స్పీచ్ చాలా గొప్పది పెద్దది కూడా.
నువ్వేం అనుకుంటున్నావో... నీకేం కావాలో, నీ అభిప్రాయం వ్యక్తం చేయలేకపోతే నువ్వు ఉండి కూడా లేనట్లే అంటాడు నీషే. అంతటి విలువైన ఈ భావ వ్యక్తీకరణ హక్కు సోషల్లీ, సైంటిఫికల్లీ, టెక్నికల్లీ అడ్వాన్స్డ్ స్టేజ్‌లో ఉన్న ప్రజెంట్ సొసైటీలో ఉందా అంటే డౌటే. పెట్టుబడి దారీ వ్యవస్థలతో సామాన్యుడి గొంతుక మూగబోతుందని కమ్యూనిస్టులు గోల చేస్తారు. ఎదిగే ప్రపంచాన్ని అడ్డుకోవటమే కమ్యూనిస్టులకు తెలిసిందని క్యాపిటలిస్టులు గగ్గోలు పెడుతుంటారు. మరి ఇంతటి ఇరుకైన గ్యాప్‌లో, సైద్ధాంతిక వైరుద్ధ్యాల మధ్యలో భావ వ్యక్తీకరణ ఉండాలి.. దాని కోసం నేను ఎన్ని కోట్లైనా ఖర్చు పెడతానని నిరూపించి వార్తల్లో నిలిచాడు ప్రపంచంలోనే అతి పెద్ద ధనవంతుడు.. ఎలాన్ మస్క్.
ఎందుకు కొన్నారు?
ట్విట్టర్, ఎలాన్ మస్క్.. ఓ నెల రెండు నెలల నుంచి బాగా వినిపిస్తోన్న పేర్లు. ప్రపంచవ్యాప్తంగా పాపులరైన అమెరికన్ మైక్రో బ్లాగింగ్ కంపెనీని కొనుగోలు చేస్తాడనే వార్తలు గత కొద్దిరోజుగా ట్విట్టర్ షేర్లను సైతం ప్రభావితం చేశాయి. అసలు ట్విట్టర్‌ను కొనాల్సిన అవసరం ఏమొచ్చింది?
2006లో జాక్ డోర్సే, నో గ్లాస్ మరికొంత మంది కలిసి ట్విట్టర్ అనే ఈ మైక్రో బ్లాగింగ్ సైట్‌ను ప్రారంభించారు. చెప్పాలనుకున్నది సూటిగా సుత్తి లేకుండా చెప్పే అవకాశం ట్విట్టర్ ద్వారా కల్పించాలనే ఆ స్నేహితుల కాన్సెప్ట్ వరల్డ్ వైడ్‌గా మోగిపోయింది. చాలా తక్కువ టైంలోనే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది ట్విట్టర్. చాలా మంది ప్రముఖులు తమ అభిప్రాయాలను ట్విట్టర్ ద్వారా పంచుకోవటం మొదలుపెట్టారు. అలా ఎలాన్ మస్క్ కూడా 2009లో ట్విట్టర్ ఖాతా ప్రారంభించాడు.
అతనికి ప్రస్తుతం ట్విట్టర్ లో 84 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. కానీ ట్విట్టర్‌లో మొదటి నుంచి చాలా కఠినమైన ఆంక్షలు, నిర్ణయాలతో నడిపించుకుంటూ వచ్చింది జాక్ డోర్సే టీం. ప్రైవసీ, క్రెడిబులిటీ, అథంటిసిటీకి ప్రాధాన్యత ఇవ్వటం దగ్గర నుంచి వెరిఫైడ్ అకౌంట్ల కాన్సెప్ట్‌లను తీసుకువచ్చి ఫేక్ న్యూస్‌లకు అడ్డుకట్ట వేయటంలోనూ ట్విట్టర్ చాలా విజయాలు సాధించింది. కానీ ట్విట్టర్ బలాలు అనుకునే కొన్ని అంశాలు చాలా మందికి విసుగు తెప్పించేవి.
ప్రత్యేకించి ఎడిట్ ఆప్షన్ లేకపోవటం, ఇతర సామాజిక మాధ్యమాలకు సంబంధించిన కంటెంట్‌ను యాక్సెప్ట్ చేసే ఫెసిలిటీ లేకపోవటం, కమ్యూనిటీ గైడ్ లైన్స్ పేరుతో చాలా మందిపై విధిస్తోన్న ఆంక్షలు ఇలాంటివన్నీ ఎలాన్ మస్క్ లాంటి ఫ్రీ థింకర్స్‌కు విసుగు తెప్పించేవి. ట్విట్టర్‌లో స్పెల్లింగ్ మిస్టేక్‌లను ఎడిట్ చేసుకునే ఫెసిలిటీ లేకపోవటంతో చేసిన ట్వీట్‌ను డిలీట్ చేస్తే నవ్వులపాలు అవుతారు కాబట్టి అమెరికా ప్రెసిడెంట్‌గా చేసిన డొనాల్డ్ ట్రంప్ లాంటి వాళ్లే ట్విట్టర్ చేతిలో అవమానపడ్డారు.
ఇప్పుడు ఎలాన్ మస్క్ ఇగో హర్ట్ అయ్యి ట్విట్టర్ కొనుగోలు చేయటానికి కూడా కారణం అదే. చానాళ్లుగా ఎలాన్ మస్క్ ట్విట్టర్‌లో చేపట్టాల్సిన సంస్కరణల గురించి చెబుతూనే వస్తున్నాడు. గుట్టు చప్పుడు కాకుండా ట్విట్టర్ షేర్లు కొనుగోలు చేయటం దగ్గర నుంచి ట్విట్టర్ కొనుగోలుకు భారీ ఆఫర్ ప్రకటించటం వరకూ ఎలాన్ మస్క్ తీసుకున్న నిర్ణయాలకు కారణం ఆ మార్పులకు ట్విట్టర్ అంగీకరించకపోవటమే.
మరో కారణం
ఇక రెండో అంశం ఫ్రీ స్పీచ్. ట్విట్టర్‌ను ప్రపంచవ్యాప్తంగా ఫాలో అవుతున్న చాలా మంది చేసే కంప్లైంట్స్‌లో ఫ్రీ స్పీచ్‌కు ట్విట్టర్ పాలసీలు అడ్డుకట్ట వేస్తున్నాయనే. ఆయా దేశాల్లో అక్కడి ప్రభుత్వాలకు అనుకూలంగా ఉండే వ్యక్తుల సందేశాలను యథాతథంగా ఉంచటం...నెగటివ్ సెన్స్‌లో మాట్లాడే వాళ్లను కట్టడి చేస్తున్నారనే ఆరోపణలను ట్విట్టర్ ఎదుర్కొంది. కొన్ని చోట్ల దీనికి వ్యతిరేకంగానూ జరిగింది. అమెరికాలో రీసెంట్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ ముందు ఏకంగా డొనాల్డ్ ట్రంప్‌ను ట్వీట్లు చేయనీయకుండా అడ్డుకుంది ట్విట్టర్. ఆయన చేసిన ట్వీట్లకు కూడా ఫ్యాక్ట్ చెక్ అవసరమంటూ ట్వీట్లను పిన్ చేసింది. ఇండియాలో ప్రభుత్వానికి అనుకూల వ్యాఖ్యలు చేసే కంగనా రనౌత్ అకౌంట్‌ను బ్లాక్ చేసింది ట్విట్టర్. ఇలా ఒక్కో దేశంలో ఒక్కో పాలసీలు, నిర్ణయాలతో నష్టాలు, విమర్శల పాలవుతున్న ట్విట్టర్ నుంచి సీఈఓ జాక్ డోర్సే నిష్క్రమించారు. ఆ తర్వాత భారత సంతతి వ్యక్తి పరాగ్ అగర్వాల్ సీఈఓ అయిన తర్వాత కూడా ట్విట్టర్ నష్టాల్లోనే సాగింది.
మార్పు కోసం
ఈ పరిస్థితులనే తను అనుకున్నట్లుగా ట్విట్టర్‌ను సంస్కరించడానికి మార్చుకున్నాడు ఎలాన్ మస్క్. దాదాపు రెండు వారాల కిందటే ట్విట్టర్ సంస్థలలో 9 శాతం వాటా కొనుగోలు చేసినట్లు తెలిపారు. ట్విట్టర్‌లో చేయాల్సిన మార్పులపై ఒపీనియన్స్ పోల్స్ పెట్టాడు. ఆ తర్వాత ఒక్కో షేరు 54.20 డాలర్ల చొప్పున కపెంనీని మొత్తం షేర్లను 46.5 బిలియన్ డాలర్లతో ట్విట్టర్‌ను కొనుగోలు చేసేందుకు ట్విట్టర్‌తో డీల్ కుదుర్చుకున్నట్లు ప్రకటించాడు.
ఇందుకోసం తన టెస్లా, స్పేస్ ఎక్స్, ది బోరింగ్ కంపెనీ, పే పాల్ చాలా వాటిలో ఉన్న షేర్లను పూచీకత్తుగా చూపించి వేర్వేరు బ్యాంకుల నుంచి రుణాలు పోగు చేశాడు. క్రిప్టో కరెన్సీని కూడా ఎస్సెట్స్‌గా చూపించాడని వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఎలాన్ మస్క్‌తో ట్విట్టర్ బోర్డు ఒప్పందం దాదాపు ఖరారైనట్లు వార్తలు రావడంతో ట్విట్టర్ షేర్లు దూసుకెళ్లాయి.
చివరగా 44 బిలియన్ డాలర్లతో ట్విట్టర్‌ను ఎలాన్ మస్క్ కొనుగోలు చేసినట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఈ సందర్భంగా కూడా మస్క్ ఇదే ఫ్రీ స్పీచ్ అంశంపై ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్యానికి స్వేచ్ఛా ప్రసంగం పునాదిగా ఉంటుందని... ట్విట్టర్ అనేది ఓ డిజిటల్ ప్లాట్‌ఫామ్ అయితే ట్విట్టర్ వేదికగా మానవాళికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు చర్చకు వస్తాయని ట్వీట్ చేశాడు.
నాసాకు సరిసమానంగా స్పేస్ ఎక్స్‌ను తీర్చిదిద్దుతున్నా, హైపర్ లూప్ ట్రాన్సిట్ కాన్సెప్ట్ ది బోరింగ్ కంపెనీ నడుపుతున్నా, పే పాల్ బ్యాంక్‌తో ఆర్థిక సామ్రాజ్యాన్ని సృష్టించినా, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మీద ప్రయోగాల కోసం OPEN AI ల్యాబ్ రూపొందించినా, ఏకంగ్ హ్యూమన్ బ్రెయిన్‌పై పరిశోధనలు చేసేలా బ్రెయిన్ మెషీన్ ఇంటర్ ఫేస్ ఇంప్లాట్‌లు తయారు చేసే న్యూరా లింక్‌ను స్థాపించినా, ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజ సంస్థ టెస్లాను రన్ చేస్తున్నా ఆయన రూటే సెపరేటు.
ఇప్పుడు ఎడిట్ ఆప్షన్ ఇవ్వటం లేదని చిరాకుతో ఫ్రీ స్పీచ్ సందేశాన్ని టోపింగ్ చేస్తూ ట్విట్టర్‌ను కొనేసినా ఎలాన్ మస్క్ ఎవరికీ అర్థం కానీ ఓ వింత మనిషి. విజ్ఞాన ప్రపంచాన్ని యావత్ మానవాళిని మరో దశకు తీసుకెళ్లగల సామర్థ్యం ఉన్న వ్యక్తి.. లైక్ ఏ టార్చ్ బేరర్.
Also Read: Tej Pratap Yadav: లాలూకు మరో షాక్- పార్టీకి పెద్ద కుమారుడు గుడ్‌బై