Nepal Protests: మంగళవారం నేపాల్ ప్రధానమంత్రి కె.పి. శర్మ ఓలి రాజీనామా చేయడంతో తీవ్ర రాజకీయ సంక్షోభం నెలకొంది. హింసాత్మక నిరసనల కారణంగా ఇప్పటి వరకు 20 మంది వరకు మరణించారు. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ఎక్స్‌ సహా 26 సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను నిషేధించాలన్న తన ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా విస్తృత ప్రదర్శనలు చెలరేగాయి. ఇవి హింసాత్మకంగా మారాయి. ఆందోళన చెలరేగిన 24 గంటల తర్వాత ప్రధానమంత్రి పదవికి కేపీ శర్మ ఓలి రాజీనామా సమర్పించారు.  

Continues below advertisement


ఈ నిషేధం దేశవ్యాప్తంగా సామూహిక ర్యాలీలకు నాయకత్వం వహించిన యువ నేపాలీలలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. మంగళవారం నాటికి, ఖాట్మండులో పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పాయి. నిరసనకారులు భద్రతా దళాలపై రాళ్లు రువ్వారు. అటు నుంచి కూడా రబ్బరు బులెట్ల వర్షం కురిసింది. దీంతో మరింత కోపంతో నిరసనకారులు ప్రభుత్వ ఆఫీసులను ముట్టడించి ధ్వంసం చేశారు. ఆగ్రహంతో ఉన్న జనసమూహం అధికారులతో ఘర్షణ పడటంతో పరిస్థితులను చల్లబరచడం ఎవరి వల్ల కూడా కాలేదు. దీంతో ప్రధానమంత్రి ఈ ఆగ్రహ జ్వాలకు వెనక్కి తగ్గక తప్పలేదు.  



భక్తపూర్‌లో, బాల్కోట్‌లోని బల్వతార్‌లోని ప్రధానమంత్రి అధికారిక నివాసంలో ఓలి ఉండగా ప్రదర్శనకారులు బాల్కోట్‌లోని  ఆయన ప్రైవేట్ ఇంటికి నిప్పంటించారు. ఇతర చోట్ల ఇలాంటి హింసాత్మక ఘటను వెలుగుచూశాయి. భైసేపతిలోని ఉప ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రి బిష్ణు పౌడెల్, నేపాల్ రాష్ట్ర బ్యాంక్ గవర్నర్ బిస్వో పౌడెల్ నివాసాలపై జనాలు దాడి చేశారు. 


ఓలి నిష్క్రమణతో ఆ స్థానంలో ఎవరు వస్తారనే చర్చ ప్రారంభమైంది. ఎవరెవరు రేసులో ఉన్నారనే విషయంపై ఆసక్తికరమైన డిస్కషన్ జరుగుతోంది. 


రబీ లామిచానే


మాజీ హోం మంత్రి రబీ లామిచానే పోటీదారుగా ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కానీ ఓలి నిష్క్రమణ తర్వాత అతను జైలు నుంచి విడుదలైతేనే ఆయనకు ప్రధానమంత్రిగా అయ్యే ఛాన్స్ ఉంటుందని అంటున్నారు. టెలివిజన్ హోస్ట్‌గా ఉన్న ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టి సంచలనం సృష్టించారు. ఆయన 2022లో రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (RSP)ని స్థాపించారు.


ప్రభుత్వంలో పేరుకుపోయిన అవినీతిని బహిర్గతం చేయడంలో రబీ లామిచానే కీలక పాత్ర పోషించారని కోట్లాది మంది యువత నమ్ముతున్నారు. మార్పునకు చిహ్నంగా ఆయన్ని యువ ఓటర్లు చూస్తున్నారు. 21 మంది RSP శాసనసభ్యుల రాజీనామాతో లామిచానే పార్లమెంటులో నాటకీయ పరిణామాలకు ఆజ్యం పోశారనే చర్చ జరుగుతోంది.  


నేపాల్ స్థిరపడినప్పటికి లామిచానే బయటవ్యక్తిగా ప్రచారం చేశారు. కానీ ఆయన మాత్రం విద్యార్థులు, నిరుద్యోగ గ్రాడ్యుయేట్లు, పట్టణ ఓటర్లను ఆకట్టుకోవడంలో విజయం సాధించారు. ఆన్‌లైన్ అసమ్మతిని వీధి పోరాటంగా మార్చచడంలో కీలక పాత్ర పోషించారు. షేర్ బహదూర్ దేవుబా, పుష్ప కమల్ దహల్ "ప్రచండ"  ఓలి వంటి సంప్రదాయ నాయకులకు భిన్నంగా పాలించే నాయకుడు లామిచానే అవుతాడని తన మద్దతుదారులు భావిస్తున్నారు.  


బాలేంద్ర 'బాలెన్' షా


ఖాట్మాండు స్వతంత్ర మేయర్ బాలేంద్ర బాలెన్ షా ఈ ప్రధానమంత్రి రేసులో ఉన్న మరో వ్యక్తి. ప్రస్తుతానికి ఆయన ముందంజలో లేనప్పటికీ, ఆయన మద్దతుదారులు బలంగా కోరుకుంటున్నారు. స్ట్రక్చరల్ ఇంజనీర్,  కళాకారుడిగా ఉన్న బాలెన్ షా  2022లో ఖాట్మాండు మొదటి స్వతంత్ర మేయర్ అయ్యారు. గత వారం, అతను Gen-Z నేతృత్వంలోని నిరసనలకు సంఘీభావాన్ని ప్రకటించారు. దాన్ని స్వచ్ఛంద ఉద్యమంగా అభివర్ణించారు. పాల్గొనేవారికి వయో పరిమితుల కారణంగా అందులో ప్రత్యక్షంగా పాల్గొనలేకపోయినట్టు తెలిపారు. ప్రదర్శనకారులు తమ పోరాటాన్ని నిష్పక్షపాతంగా ఉంచుకోవాలని, రాజకీయ పార్టీలు జోక్యం లేకుండా పోరాటం చేయాలని సూచించారు.