Nepal Army Chief asks PM Oli to step down:  నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ రాజీనామా చేశారు.   ఆయన సహాయకుడు ప్రకాష్ సిల్వాల్ ఈ అంశాన్ని ధ్రువీకరించారు. అవినీతి వ్యతిరేక ఆందోళనలు, సోషల్ మీడియా నిషేధం, పోలీసు హింసలపై జరిగిన తీవ్రమైన ప్రజా ఆందోళనల కారణంగా ఆర్మీ ఆయనతో రాజీనామా చేయించింది. తనను సురక్షితంగా దేశం దాటించాలని ఓలీ సైన్యాన్ని వేడుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. 


సోమవారం నేపాల్‌లో జనరేషన్ Z యువత నేతృత్వంలో అవినీతి వ్యతిరేక ఆందోళనలు తీవ్రస్థాయిలో సాగాయి. ప్రభుత్వం 26 సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై  నిషేధం విధించడం, అవినీతి ఆరోపణలు, పోలీసు హింసలపై ప్రజల ఆగ్రహం ఈ ఆందోళనలకు దారితీసింది. సోమవారం కాఠ్మండులో జరిగిన ఘర్షణల్లో 19 మంది ప్రాణాలు కోల్పోయారు, దాదాపు 500 మంది గాయపడ్డారు. ఈ ఘటనలు దేశవ్యాప్తంగా ఆందోళనలను  తీవ్రతరం చేశాయి. ఆందోళనకారులు "కేపీ చోర్, దేశ్ ఛోడ్"  అనే నినాదాలతో ప్రధానమంత్రి ఓలీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.





 
ఆందోళనలు కొనసాగుతుండగా, ప్రభుత్వం సోషల్ మీడియా నిషేధాన్ని  ఎత్తివేసినప్పటికీ, ఆందోళనలు ఆగలేదు.   కర్ఫ్యూ విధించినప్పటికీ, ఆందోళనకారులు రోడ్లపై టైర్లు కాల్చి, ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు.  ప్రధానమంత్రి ఓలీ బాల్కోట్‌లోని నివాసం, రాష్ట్రపతి రామ్ చంద్ర పౌడెల్, మాజీ ప్రధానమంత్రులు  ప్రచండ , షేర్ బహదూర్ దేవ్బా నివాసాలపై దాడులు జరిగాయి. మాజీ హోం మినిస్టర్ రమేష్ లేఖక్ సోమవారం రాజీనామా చేశారు, ఇతర మంత్రులు కూడా ప్రభుత్వం ఆందోళనకారుల ఫిర్యాదులను విస్మరిస్తోందని రాజీనామా  ప్రకటించారు.[ 





మంగళవారం మధ్యాహ్నం, ఓలీ తన రాజీనామాను సమర్పించారని ఆయన సెక్రటేరియట్ ధ్రువీకరించింది. రాజీనామాకు ముందు, ఓలీ సాయంత్రం 6 గంటలకు అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసినప్పటికీ, రాజీనామా నిర్ణయంతో ఆ సమావేశం అవసరం లేకపోయింది. ఓలీ రాజీనామాతో నేపాల్‌లో రాజకీయ సంక్షోభం  ముదిరింది. ఓలీ రాజీనామాతో, నేపాల్ రాజకీయ నాయకత్వంలో తదుపరి అడుగులపై అనిశ్చితి నెలకొంది. కాఠ్మండులో కర్ఫ్యూ కొనసాగుతోంది, పాఠశాలలు, దుకాణాలు మూతపడ్డాయి, అంతర్జాతీయ విమానాశ్రయం  మూతపడింది.