Who is Usha Chilukuri Vance: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అంచనాలన్నీ నిజమైతే ఓ తెలుగింటి అమ్మాయి.. ఆ దేశ రెండో మహిళగా నిలుస్తారు. రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపికైన జె.డి.వాన్స్ (JD Vance) భార్య, ఉషా చిలుకూరి వాన్స్ (Usha Chilukuri Vance) తెలుగు మూలాలున్న మహిళ. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, వాన్స్ పేరు ప్రకటించగానే.. ఆయన భార్య ఉష గురించి కూడా ఎక్కువగా చర్చిస్తున్నారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్న పేరు ఉషా చిలుకూరి వాన్స్. పేరు చూస్తే తెలుగు మూలాలున్నమహిళగా అర్థమవుతోంది. అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ చేస్తున్న డోనాల్డ్ ట్రంప్ తన డిప్యూటీగా ౩9 ఏళ్ల జేడీ వాన్స్ పేరును సోమవారం అనౌన్స్ చేశారు. రిపబ్లికన్ పార్టీ తరుపున డోనాల్డ్ ట్రంప్ అధికారిక అభ్యర్థిగా పోటీ పడుతున్నారు. మిల్వాకీలో జరిగిన పార్టీ కన్వెన్షన్‌లో ఆయన వాన్స్ పేరును స్వయంగా అనౌన్స్ చేశారు. తనపై హత్యాయత్నం తర్వాత ట్రంప్ పాల్గొన్న మొదటి కార్యక్రమం ఇదే. వాన్స్ పేరును అనౌన్స్ చేసినప్పుడు ఉషా అక్కడే ఉన్నారు.
తెలుగింటి అల్లుడు JD వాన్స్.. ఎవరీ ఉష చిలుకూరి?
డోనాల్డ్ ట్రంప్ జె.డి.వాన్స్ (JD Vance) పేరు ప్రకటించిన తర్వాత ఆడిటోరియం అంతా మార్మోగిపోయింది. ఓహియోకు ప్రాతినిధ్యం వహిస్తున్న వాన్స్ పెద్దగా రాజకీయ అనుభవం ఉన్నవారు కాదు. తొలిసారి ఆయన సెనేటర్ అయ్యారు. పైగా ట్రంప్ ఆంతరంగిక బృందంలోని వాడు కూడా కాదు. కానీ వయసులో పెద్ద అయిన ట్రంప్ తన టీమ్‌కు యంగ్ లుక్ ఇవ్వడం కోసం ౩9 ఏళ్ల వాన్‌ను ఎంపిక చేశారు. అయితే వాన్ పేరు బయటకు వచ్చాక ఆయనతో పాటే ఆయన భార్య Usha Chilukuri Vance పేరు కూడా ఎక్కువ చర్చలోకి వచ్చింది. ప్రఖ్యాత పత్రిక Newyork Timesతో పాటు CNN, Fox, ABC వంటివన్నీ ఆమె గురించి చర్చించడం మొదలుపెట్టాయి. జెడి వాన్ రాజకీయ గమనానికి ఆమే ముఖ్య కారణం. అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థి ఇప్పుడు తెలుగింటి అల్లుడు. రిపబ్లికన్ పార్టీకి ఉన్న గెలుపు అవకాశాల దృష్ట్యా ఆయనే ఉపాధ్యక్షుడు అయ్యే అవకాశం ఉంది. అలా అయితే U.S సెకండ్ లేడీగా Usha Chilukuri Vance నిలుస్తారు.
ఎవరీ ఉష చిలుకూరి..?
Who is Usha Chilukuri..? ఇప్పుడు అమెరికాలోనే కాదు.. మన ఆంధ్రా, తెలంగాణలో కూడా ఇదే ఎక్కువగా నడుస్తోంది. అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థి ప్రకటన తర్వాత ఆమె గురించి తెలుసుకునేందుకు గూగుల్‌ను, Linked In తెగ వెతికేస్తున్నారు. ఉషా చిలుకూరి తెలుగు మూలాలున్న అమెరికన్. ఆమె తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్ నుంచి కాలిఫోర్నియా వెళ్లి వెళ్లి స్థిరపడ్డారు. ఆ రాష్ట్రంలోని శాన్‌డియాగోలోనే ఉష పుట్టి పెరిగారు. ప్రఖ్యాత Yele University లో 2010-13 వరకూ చదివి న్యాయ శాస్త్ర పట్టా పుచ్చుకున్నారు. అక్కడే ఆమెకు జెడి వాన్స్ పరిచయం. 2014లో వారిద్దరి వివాహం జరిగింది.
సుప్రీంకోర్టులో లా క్లర్క్
2015లో ఉష... Munger, Tolles & Olson లా ఫర్మ్‌లో అసోసియేట్‌గా ఉద్యోగం ప్రారంభించారు. ఆ తర్వాత 2018లో కేంబ్రిడ్జ్ నుంచి M. Phill చేసిన ఆమె సుప్రీంకోర్టులో లా క్లర్క్‌గా పనిచేశారు. అత్యున్నత న్యాయస్థానంలో ఇది ముఖ్యమైన పొజిషన్. ఉన్నత విద్య, టెక్నాలజీ, స్థానిక ప్రభుత్వాలకు సంబంధించిన వ్యాజ్యాల్లో ఆమెకి మంచి పేరు ఉంది. సుప్రీంకోర్టులో పనిచేసిన తర్వాత మళ్లీ బయటకు వచ్చి పాత కంపెనీలోనే ఉద్యోగం చేస్తూ వచ్చిన ఆమె... తన భర్త పేరు అనౌన్స్ చేసిన తర్వాత రాజీనామా చేశారు.
జేడీ వాన్స్ పొలిటికల్ స్పిరిట్ ఉష
భర్తతో వైవాహిక బంధం పంచుకోవడం మాత్రమే కాదు.. ఆయన్ను రాజకీయాల వైపు నడిపించడంలోనూ ఉషదే ముఖ్య పాత్ర. యేల్స్‌లో ఉన్నప్పటి నుంచే అనేక సామాజిక అంశాలపై వీళ్లిద్దరూ పరిశోధనలు చేసేవారు. అతన్ని రాజకీయాల వైపు ఓ విధంగా ఆమెనే ప్రోత్సహించారు. ఈ విషయాన్ని జెడీ వాన్స్ పలు ఇంటర్వూల్లో చెప్పారు. తనని ఎప్పుడూ Yele Spirit Guide అంటూ అందరికీ పరిచయం చేస్తుంటారు. అంటే తనని నడిపించిన స్ఫూర్తి ఆమె అని ఆయన పలు సందర్భాల్లో చెప్పారు. తన జీవిత అనుభవాలతో ఆయన 'Hillbilly Elegy' అనే బుక్ కూడా రాశారు. ఇది ఆ తర్వాత Netflixలో మూవీగా కూడా వచ్చింది. 2016లో వాన్స్ మొదటి సారి సెనేటర్‌గా పోటీ చేసినప్పుడు ఆమె తన భర్త వెంట పొలిటికల్ ర్యాలీల్లో తిరిగారు. అతని రాజకీయ నిర్ణయాలన్నింటికీ మద్దతుగా నిలిచారు.
ఉష హిందూ, వాన్స్ కాథలిక్ క్రిష్టియన్. వీరిద్దరి వివాహం హిందూ సాంప్రదాయ పద్ధతిలో జరిగిందని సమాచారం. ఉష కుటుంబం గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియడం లేదు. ఆమె తెలుగు మూలాలున్న వ్యక్తి అని తెలుస్తున్నా పూర్తి వివరాలు ఎక్కడ అని తెలుసుకునేందుకు ఏబీపీ దేశం ప్రయత్నించింది. అమెరికాలోని ఎన్‌ఆర్‌ఐలు కూడా ఇప్పుడే ఆమె గురించి సమాచారం సేకరిస్తున్నారు. “యు.ఎస్‌లో రెండు పూల్స్ ఉంటాయి. కొత్తగా అక్కడికి వెళ్లిన యువకులు.. ౩౦-40 ఏళ్ల క్రితం అక్కడకి వెళ్లిన ముందు తరాల వారు. కానీ ఉష కుటుంబం చాలా కాలం క్రితమే కాలిఫోర్నియా వెళ్లిపోయింది. ఆమె సుప్రీంకోర్టులో బెంచ్ క్లర్క్‌గా చేశారు అంటేనే ఆమె స్థాయి ఏంటో అర్థం అవుతోంది. లీగల్ డిపార్ట్‌మెంట్‌లో దేశం మొత్తం మీదు ఉన్న 5-6 పెద్ద పొజిషన్లలో అదొక్కటి. కాబట్టి ఆమె లీగ్ పూర్తిగా వేరు. మన తెలుగు వాళ్లు కూడా ఇప్పుడే తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. రెండు రోజుల్లో పూర్తి వివరాలు రావొచ్చు” అని ఏపీ నాన్ రెసిడెంట్ ఫోరమ్ APNRT పూర్వ అధ్యక్షడు రవి వేమూరి తెలిపారు.
అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ వయసులో సగం ఉన్న జేడీ వాన్స్ ఇప్పుడు రిపబ్లికన్ పార్టీకి యువతరం ప్రతినిధి. అతను అమెరికాలోని దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన శ్వేతజాతి యువకుడు. సొంతంగా తన కష్టంతో ఎదిగినవాడు. ఉష.. ఆయన ప్రతి అడుగులోనూ వెన్నంటి నిలిచిన అదృశ్య శక్తి. అందుకే అమెరికన్ పత్రికలు ఇప్పుడు ఆమె గురించి కూడా ఎక్కువగా చర్చిస్తున్నాయి.
అమెరికాలో భారతీయుల హవా
అమెరికాలో భారతీయుల హవా చాలాకాలంగా మొదలైంది. ముఖ్యంగా తెలుగువాళ్లు అక్కడ రాజకీయాల్లో దూసుకెళ్తున్నారు. తెలుగు మూలాలున్న చాలా మంది సెనేటర్లుగానూ.. లోకల్ ఎన్నికల్లోనూ పోటీ చేశారు. ట్రంప్ ఎన్నికల బృందంలోనూ చాలా మంది తెలుగు వాళ్లు పనిచేశారు. ఇప్పుడు జేడీ వాన్స్ గెలిస్తే.. తెలుగింటి అల్లుడు యుఎస్ ఉపాధ్యక్షుడు అవుతాడు. ఆయన భార్య సెకండ్ లేడీ అవుతారు. ప్రస్తుతం డెమక్రాట్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కమలా హారిస్ కూడా భారతీయ మూలూలున్న మహిళనే. ఆమె పూర్వీకులు తమిళనాడు నుంచి వెళ్లి స్థిరపడ్డారు.