Donald Trump Attack: అమెరికా చరిత్రలో గతంలో చాలా హింసాత్మక ఘటనలు జరిగాయన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్... వాటితో సమస్యకు పరిష్కారాలు లభించలేదని అన్నారు. హింసామార్గంలోకి వెళ్లడం సరికాదని సూచించారు. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం (జూలై 14) నాడు దేశాన్ని ఉద్దేశించి బైడెన్ ప్రసంగిస్తూ డొనాల్డ్ ట్రంప్‌పై దాడిని ఖండించారు. అమెరికాలో ఇలాంటి హింసకు తావు లేదని అన్నారు. ఇప్పుడు కాస్త ఓపిక పట్టాల్సిన సమయం ఆసన్నమైందని హితవు పలికారు.
మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం (జూలై 13) పెన్సిల్వేనియాలో ఎన్నికల ర్యాలీలో ప్రసగిస్తుండగా దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి ఆయనపై కాల్పులు జరిపాడు. అగంతకుడు వదిలిన బుల్లెట్ ట్రంప్ చెవిని తాకడంతో గాయమైంది. ఈ దాడిలో ఒక పౌరుడు చనిపోయాడు. ఇంకో ఇద్దరు పౌరులు గాయపడ్డారు. వెంనటే స్పందించిన ట్రంప్ సెక్యూరిటీ గార్డ్స్ కాల్పులు జరిపిన థామస్ మాథ్యూ క్రూక్స్ అనే యువకుడిని కాల్చి చంపేశారు.
హింసామార్గంలో వెళ్లలేం: బైడెన్
ఎన్నికల ర్యాలీలో ట్రంప్‌పై జరిగిన దాడిని ఉద్దేశిస్తూ బైడెన్ మాట్లాడారు. " రగులుతున్న రాజకీయాన్ని చల్లార్చేందుకు మీతో నేను మాట్లాడాలనుకుంటున్నాను. మనతో విభేదించేవాళ్లు శత్రువులు కాదు, ఇరుగుపొరుగువాళ్లం, స్నేహితుల, సహచరులం, అన్నింటి కంటే మనందరం అమెరికా పౌరులం. అని అన్నారు.
"పెన్సిల్వీనియలో ట్రంప్ ర్యాలీలో జరిగిన కాల్పుల మనల్ని ఓ అడుగు వెనక్కి వేసేలా చేసింది. మనం ఎక్కడ ఉన్నాం... ముందడుగు ఎలా వేయాలనే ఆలోచన కలిగిస్తోంది. మనకు ఐక్యమత్యం అనేది అన్నింటికంటే ముఖ్యమైన గోల్. ప్రస్తుతానికి అంతకంటే ముఖ్యమైంది ఏదీ లేదు."
"మనం ఒక దేశంగా గట్టిగా నిలబడేందుకు హింస అనేది అవరోధంగా మారుతుంది. అమెరికాలో అలాంటి హింసకు ఇకపై తావు ఇవ్వకూడదు"
"గతంలో చాలా హింసాత్మక ఘటనలు జరిగాయి. ముందుకు వెళ్లే క్రమంలో అమెరికా ఆ మార్గంలో వెళ్లకూడదు. హింస ఎప్పుడూ సమాధానం కాదు. మా విభేదాలపై లోతుగా చర్చించాం. ఈ ఎన్నికల్లో చాలా పెద్ద విషయాలు చర్చకు వచ్చాయి. ఈ ఎన్నికల్లో మనం తీసుకునే నిర్ణయాలు రాబోయే దశాబ్దాల్లో అమెరికా, ప్రపంచ భవిష్యత్తును నిర్ణయిస్తాయని నేను చాలాసార్లు చెప్పాను."
ఈ ఘటన తర్వాత రిపబ్లికన్ పార్టీ కూడా తనను విమర్శించబోతోందని బైడెన్ అన్నారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు మాట్లాడుతూ.. 'రిపబ్లికన్ కన్వెన్షన్ పార్టీ నన్ను టార్గెట్ చేస్తుంది. వారు నా పాలనను విమర్శిస్తారు. నేను కూడా ఈ వారం దేశవ్యాప్తంగా పర్యటిస్తూ నా పని తీరును వివరిస్తాను. నా దార్శనికత, దేశం పట్ల నాకున్న ప్రేమ గురించి కూడా మాట్లాడతాను.
రాజ్యాంగం కోసం, చట్టబద్ధ పాలన కోసం నిలబడండి. మన వీధుల్లో ఎలాంటి హింస ఉండకూడదు. రాజకీయ ప్రత్యర్థులతో వాదిస్తాం, విభేదిస్తాం. అభ్యర్థుల స్వభావం, రికార్డులు, సమస్యలు, అజెండాలు, వైఖరులు పోల్చి చూస్తాం. అమెరికాను మార్చే శక్తి ఎల్లప్పుడూ ప్రజల చేతుల్లోనే ఉండాలి తప్ప హంతకుల చేతుల్లో ఉండకూడదు. అందుకే కానీ బుల్లెట్లు పట్టుకోవద్దు. బ్యాలెట్ బాక్సులో ఓటు వేయడం ద్వారా ఇది సాధ్యమవుతుంది. అని అన్నారు.