Why Protests in Bangladesh: బంగ్లాదేశ్‌లోని అవామీ లీగ్ పార్టీ అధ్యక్షురాలు, ప్రస్తుత ప్రధాన మంత్రి షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేశారు. దేశ వ్యాప్తంగా హసీనా పదవి నుంచి దిగిపోవాలని నిరసనలు హోరెత్తుతూ, ఏకంగా ప్రధాని ఇంటినే ముట్టడించిన క్రమంలో ఆమె రాజీనామా చేసి దేశాన్నే విడిచి వెళ్లిపోయారు. బంగ్లాదేశ్ నుంచి పొరుగునే ఉన్న భారత్‌లోని త్రిపుర రాజధాని అగర్తలకు ప్రత్యేక మిలిటరీ హెలికాప్టర్‌లో హసీనా చేరుకున్నారు.


బంగ్లాదేశ్‌లో అల్లర్లు ఎందుకు?
బంగ్లాదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుడు అయిన షేక్ ముజిబుర్ రెహమాన్ కుమార్తె షేక్ హసీనా, ప్రపంచంలో అతి ఎక్కువ కాలం ప్రధానిగా కొనసాగిన మహిళగా పేరు పొందారు. బంగ్లాదేశ్ లో సివిల్ సర్వీసెస్ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు తేవాలని ప్రభుత్వం నిర్ణయించడం ప్రస్తుత పరిస్థితికి దారి తీసింది. స్వాతంత్ర్య సమరయోధుల వారసులకు 30 శాతం ఉద్యోగ కోటాను పునరుద్ధరించాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో గత నెలలో నిరసనలు ప్రారంభమయ్యాయి.


బంగ్లాదేశ్ జనాభా 17 కోట్లకు పైగా ఉన్నారు. అందులో దాదాపు 3 కోట్లకు పైగా యువకులు నిరుద్యోగులుగా ఉండగా, వారిలో కొందరు విద్యకు దూరం అయ్యారు. స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలకు 30 శాతం రిజర్వేషన్ కోటాను ప్రభుత్వం కొట్టేయాలని విద్యార్థులు, విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చారు. కోర్టు ఆదేశాలనే తాము శిరసావహిస్తామని షేక్ హసీనా స్పష్టం చేశారు. విద్యార్థుల డిమాండ్లను నెరవేర్చేందుకు హసీనా నిరాకరించడంతో పరిస్థితి బాగా తీవ్రం అయింది.




అంతేకాక, 1971 సమయంలో బంగ్లాదేశ్ స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్న వారి వారసులకు ఈ కోటా వర్తింపజేయడాన్ని వ్యతిరేకిస్తున్నవారు ‘రజాకార్లు’ అని పేర్కొంటూ షేక్ హసీనా వ్యాఖ్యలు చేశారు. దీంతో జూలై నెలలో ఢాకా యూనివర్సిటీలోని తమ హాస్టళ్లను వదిలేసి వేలాది మంది విద్యార్థులు నిరసన తెలిపారు. హసీనా వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసినట్లు అయ్యాయి. ఫలితంగా దేశవ్యాప్తంగా పౌరుల్లో అశాంతిని కలిగించింది. దీంతో బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు సివిల్ సర్వీస్ ఉద్యోగాల విషయంలో వివాదాస్పద కోటా విధానాన్ని వెనక్కి తీసుకుంది. దాని పరిధిని తగ్గించింది కానీ పూర్తిగా రద్దు చేయలేదు.


పైగా దేశ వ్యాప్తంగా నిరసనల్లో పాల్గొంటున్న వారు విద్యార్థులు కారని, వారంతా ఉగ్రవాదులు అని ప్రధాని షేక్ హసీనా కొన్ని మాటలు అన్నారు. వారిని అణచివేయాలని ప్రజలకు పిలుపు ఇచ్చారు. దీంతో నిరసన కారులు మరింత రెచ్చిపోయారు. వన్, టూ, త్రీ, ఫోర్.. షేక్ హసీనా ఈజ్ ఏ డిక్టేటర్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. నిరసన కారులను అదుపు చేసేందుకు బంగ్లాదేశ్‌లో పోలీసులు, ఇతర భద్రతా సిబ్బంది కొద్ది వారాలుగా ప్రయత్నిస్తున్నారు. కానీ నిలువరించలేకపోతున్నారు. కొన్ని విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చిన ‘పూర్ణ్ అసహయోగ్ ఆందోళన్’ ఢాకా నగరంతో పాటు కొద్ది రోజుల్లోనే దేశ వ్యాప్తంగా విస్తరించింది. ప్రధాన మంత్రి షేక్ హసీనా పదవి నుంచి దిగిపోవాలనే విపరీతమైన డిమాండ్ చేయడంతో విద్యార్థి నాయకులు నిరసనలకు పిలుపునివ్వడంతో ఆ దేశంలో శాంతి భద్రతలు మరింతగా క్షీణించాయి.




జూలై 1న మొదలు
సివిల్ సర్వీసెస్ కోటాలో సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్ చేస్తూ యూనివర్సిటీ విద్యార్థులు బయటికి వచ్చారు. రోడ్లు, రైల్వే లైన్లను మూసేయడం, కార్యకలాపాలను దిగ్భంధించడం మొదలుపెట్టారు. ఈ కోటా విధానం హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ అనుచరులకు అనుకూలంగా ఉందని వారు గొంతెత్తారు.


జూలై 18 నాటికి ప్రశాంతత కోసం హసీనా చేసిన వ్యాఖ్యలపై విద్యార్థులు కదం తొక్కారు. ఆమె పదవి నుంచి దిగిపోవాలని, కొత్త ప్రభుత్వం రావాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భవనాలతో పాటు బంగ్లాదేశ్ టెలివిజన్ మెయిన్ ఆఫీసును కూడా తగులబెట్టారు.


జూలై 21న బంగ్లాదేశ్ సుప్రీం కోర్టు ఉద్యోగ కోటాను తిరిగి ప్రవేశపెట్టడానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. ఈ కోర్టు నిర్ణయాన్ని నిరసనకారులు హసీనా ప్రభుత్వంతో వారు చేసుకున్న పొత్తుగా భావించారు. అయినా కోర్టు తీర్పుతో నిరసనకారుల సంతృప్తి చెందలేదు.


నిరసనకారులకే మాజీ ఆర్మీ చీఫ్ మద్దతు
ఆదివారం (ఆగస్టు 4) జరిగిన ఘర్షణల్లో 14 మంది పోలీసు అధికారులు, మరో 68 మంది మరణించారు. మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఇక్బాల్ కరీం భుయాన్ ప్రజలవైపే నిలబడ్డారు. దళాలను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ హత్యలను ఖండించారు. ప్రస్తుత ఆర్మీ చీఫ్ వాకర్-ఉజ్-జమాన్ సాయుధ దళాలు ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తాయని అని పేర్కొన్నారు. ఇక చివరి నిరసనగా ఢాకాకు లాంగ్ మార్చ్ చేయాలని పిలుపునిచ్చారు. ప్రధాని ఇంటిని కూడా ముట్టడించారు. దీంతో షేక్ హసీనా దేశాన్ని విడిచి వెళ్లిపోవాల్సి వచ్చింది.