Bangladesh Violence: ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలంటూ బంగ్లాదేశ్‌లో పౌరులు చేస్తున్న నిరసన హింసాత్మకంగా మారింది. ఫలితంగా హింసాత్మక ఘర్షణల్లో ఇప్పటివరకు 100 మంది మరణించగా, వందల మంది గాయపడ్డారు. ఆదివారం (ఆగస్టు 4) షేక్ హసీనా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు రోడ్లపైకి వచ్చారు. నిరసనకారులకు అధికార పార్టీ అవామీ లీగ్ మద్దతుదారుల మధ్య జరిగిన ఘర్షణల్లో వంద మంది మృత్యువాత పడ్డారు. ఇందులో పోలీసులు కూడా ఉన్నారు.
బంగ్లాదేశ్‌లో హింసాత్మక పరిస్థితులు పెరుగుతున్న వేళ భారత్ కూడా అప్రమత్తమైంది. బంగ్లాదేశ్‌లో ఉన్న భారతీయులకు ఓ సందేశాన్ని ఆదివారం రాత్రి విడుదల చేసింది. బంగ్లాదేశ్‌లో పరిస్థితులు హింసాత్మకంగా ఉన్నందున భారతీయ పౌరులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. వీలైనంత వరకు ఇంటికే పరిమితం కావాలని బయటకు రావద్దని కోరింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు బంగ్లాదేశ్ వెళ్లే ఆలోచన ఉన్న వాళ్లు ఆగిపోవాలని కూడా సూచించింది. బంగ్లాదేశ్‌లో ఉన్న వారి సహాయం కోసం హెల్ప్‌లైన్ నంబర్లు జారీ చేసింది.
భారతదేశం పౌరులకు ఏమి సలహా ఇచ్చింది?
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో ఏముంది అంటే... "బంగ్లాదేశ్‌లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు భారతీయ పౌరులు బంగ్లాదేశ్‌కు వెళ్లవద్దు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉన్న భారతీయ పౌరులందరూ పలు జాగ్రత్తలు పాటించాలి, ప్రయాణాల తగ్గించాలి. ఇంటికే పరిమితం అయితే మంచిది. అత్యవసర ఫోన్ నంబర్‌లు దగ్గర పెట్టుకొని ఢాకాలోని భారత హైకమిషన్‌తో టచ్‌లో ఉండాలి."
మంత్రిత్వ శాఖ ఎమర్జెన్సీ నంబర్‌లను కూడా జారీ చేసింది... 8801958383679, 8801958383680, 8801937400591. బంగ్లాదేశ్‌లో ఉన్న భారతీయ పౌరులు ఎవరైనా ఏదైనా సమస్యను ఎదుర్కొంటే, పైన ఇచ్చిన నంబర్‌లకు కాల్ చేసి భారత హైకమిషన్‌ను సంప్రదించవచ్చు. హింసాత్మక పరిస్థితులు ఉన్న వేళ చాలా మంది భారతీయ విద్యార్థులు కూడా వారం రోజుల క్రితమే బంగ్లాదేశ్ నుంచి దేశానికి తిరిగి వచ్చారు.
మరోపైపు బంగ్లాదేశ్ వ్యాప్తంగా కర్ఫ్యూ కొనసాగుతోంది. నిబంధనలు పాటించాలని ప్రజలను బంగ్లాదేశ్ ఆర్మీ కోరింది. దేశంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్న వేళ ఈ కర్ఫ్యూ విధించారు. ISPR విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో, "బంగ్లాదేశ్ రాజ్యాంగం, దేశంలోని ప్రస్తుత చట్టాలకు అనుగుణంగా బంగ్లాదేశ్ సైన్యం పని చేస్తుంది. ప్రజల రక్షణ కోసం కర్ఫ్యూ విధించాం. ఈ విషయంలో ప్రజలు సహకరించాలి. కర్ఫ్యూ పాటించాలి." అని సైన్యం వెల్లడించింది. కర్ఫ్యూ కారణంగా సోమవారం అవామీ లీగ్ ప్రతిపాదించిన సంతాప ఊరేగింపు రద్దు అయింది.
బంగ్లాదేశ్‌లో పెచ్చుమీరుతున్న హింసపై ఐక్యరాజ్యసమితి స్పందించింది. ఆ సంస్థ మానవ హక్కుల విభాగం చీఫ్ వోల్కర్ టర్క్ హింస అదుపులోకి రావాలని కోరుకున్నారు. బంగ్లాదేశ్ నాయకులు, భద్రతా దళాల సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. నిరసనల్లో శాంతియుతంగా పాల్గొనేవారిని లక్ష్యంగా చేసుకోవడం మంచికాదన్నారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని, ఇంటర్నెట్ సదుపాయాన్ని పూర్తిగా పునరుద్ధరించాలని సూచించారు.