Wagner Rebellion: 



వెన్నుపోటు అంటున్న పుతిన్..


వాగ్నర్ గ్రూప్‌ (Wagner Group) తమపై తిరుగుబాటు చేయడంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ తీవ్రంగా స్పందించారు. దేశ ద్రోహులను సహించేదే లేదని తేల్చి చెప్పారు. "ఇది వెన్నుపోటు" అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం తన వ్యక్తిగత కక్ష తీర్చుకునేందుకు దేశ మిలిటరీపైనే దాడి చేయడం సరికాదని అన్నారు. అటు ఉక్రెయిన్ మాత్రం రష్యాలో అంతర్యుద్ధంతో కాస్త ఊపిరి పీల్చుకుంది. పుతిన్‌కి ఇదే సరైన సమాధానం అని అంటోంది. "ఇది కేవలం ఆరంభం మాత్రమే" అని ఉక్రెయిన్‌ ప్రెసిడెంట్ జెలెన్‌స్కీకి సన్నిహుతుడైన ఓ ప్రతినిధి చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. అటు రష్యా మిలిటరీ ఇప్పటికే వాగ్నర్ గ్రూప్‌పై ఉగ్రవాద ముద్ర వేసింది. యాంటీ టెర్రరిజం ఆపరేషన్ చేపట్టనున్నట్టు ప్రకటించింది. ఈ తిరుగుబాటు ఆపితే వాగ్నర్‌ సైనికుల సేఫ్‌టీకి హామీ ఇస్తామని రష్యా వెల్లడించింది. అటు వాగ్నర్ గ్రూప్‌ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఆ మిలిటరీ చీఫ్ ప్రిగోజిన్ (Prigozhin) రోస్తోవ్ (Rostov)లోని రష్యా మిలిటరీ హెడ్‌క్వార్టర్స్‌ని అధీనంలోకి తీసుకున్నట్టు ప్రకటించారు. రష్యా కేవలం ఉక్రెయిన్‌ మీద మాత్రమే దాడి చేసుకునేలా చూసుకుంటామని, తమపై దాడికి దిగితే ఊరుకోమని స్పష్టం చేశారు. ఇప్పటికే ఓ రష్యన్ మిలిటరీ హెలికాప్టర్‌పై దాడి చేసి నేల కూల్చామని చెప్పారు. వాగ్నర్ గ్రూప్‌లో దాదాపు 50 వేల మంది సైన్యం ఉన్నట్టు అంచనా. ఇప్పటికే పాతిక వేల మంది ప్రాణాలిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, మరో పాతిక వేల మంది కూడా పోరాడేందుకు సిద్ధమవుతున్నారని చెప్పారు ప్రిగోజిన్. 






ఉక్రెయిన్‌కి ఊరట లభించేనా..?


దాదాపు ఏడాదిన్నరగా రష్యా దాడులతో వణికిపోతోంది ఉక్రెయిన్. ఎదురు దాడికి దిగి రష్యాను కొంత మేర కంట్రోల్ చేసినప్పటికీ భారీగా ఆస్తినష్టాన్ని చవి చూసింది. మొత్తం దేశమంతా శిథిలాలే కనిపిస్తున్నాయి. ఆ బిల్డింగ్‌లను రీస్టోర్ చేయాలంటే ఎంత కాలం పడుతుందో చెప్పలేకపోతున్నారు. ఇక పవర్‌ స్టేషన్‌లపైనా రష్యా దాడులు చేసింది. వాటినీ పునరుద్ధరించడం సవాలుతో కూడిన పని. మొత్తంగా ఇన్‌ఫ్రా స్ట్రక్చర్‌ని కొత్తగా ఏర్పాటు చేసుకోవాలి. దీనికోసం ఎంత ఖర్చవుతుందో లెక్కలేసుకోవాలి. అంత డబ్బుని సమకూర్చుకోవాలి. ఇవన్నీ జెలెన్‌స్కీ ముందున్న సవాళ్లు. అయితే...రష్యాలో ఇప్పుడు అంతర్యుద్ధం మొదలవడం వల్ల ఆ దేశ మిలిటరీ అంతా వాళ్లను ఎదుర్కోవడంలోనే బిజీ అయిపోతుంది. ఫలితంగా...గతంలోలా పూర్తి స్థాయిలో ఉక్రెయిన్‌పై సైనిక చర్య కొనసాగించడం కుదరకపోవచ్చు. ఇది కొంత వరకూ ఆ దేశానికి ఊరటనిచ్చే విషయమే. కానీ...పుతిన్‌ ప్లాన్ ఎలా ఉంటుందో ఇప్పటికైతే తెలియదు. తన మాస్టర్ మైండ్‌తో ఒకేసారి రెండు యుద్ధాలు చేస్తారా అన్నదీ తేలాల్సి ఉంది. 


Also Read: Wagner Group: పుతిన్‌కి కట్టప్పలాంటోడు ఇప్పుడు ఎదురు తిరిగాడు, తొక్కుకుంటూ పోతాం అని వార్నింగ్ - ఇగో హర్ట్ అయిందట