Wagner Chief Yevgeny Prigozhin Feared Killed:
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై కొన్ని రోజుల కిందట తిరుగుబాటు చేసిన ప్రైవేట్ సైన్యం వాగ్నర్ గ్రూప్ చీఫ్ యెవ్‌గెనీ ప్రిగోజిన్ మృతి చెందాడు. విమాన ప్రమాదంలో ప్రిగోజిన్ చనిపోయారని రియా నోవోస్టి వెల్లడించారు. వాగ్నర్ అధినేత ప్రయాణిస్తున్న విమానం అకస్మాత్తుగా కుప్పకూలిన ప్రమాదంలో ప్రిగోజిన్ తో పాటు 10 మంది వరకు మృతిచెందినట్లు రష్యా అత్యవసర సేవల విభాగం తెలిపింది. విమానం కూలిపోయిన ప్రదేశంలో తొమ్మిది వరకు మృతదేహాలను కనుగొన్నట్లు రష్యా ఏజెన్సీ వర్గాలు వెల్లడించాయి.
ట్వెర్ ప్రాంతంలో ఓ విమానం కూలిపోయింది. అందులో ప్రైవేట్ సైన్యం వాగ్నర్ అధినేత యెవ్‌గెనీ ప్రిగోజిన్ ప్రయాణిస్తున్నారు. కానీ విమాన ప్రమాదంతో పెను విషాదం చోటుచేసుకుందని TASS వార్తా సంస్థతో పాటు RIA నోవోస్టి, ఇంటర్‌ఫాక్స్ రిపోర్ట్ చేశాయి. ఆ విమానంలో మొత్తం 10 మంది ప్రయాణిస్తుండగా, అందులో ముగ్గురు సిబ్బంది ఉన్నారు. దురదృష్టవశాత్తూ అందులో ప్రయాణిస్తున్న అంతా చనిపోయారని రష్యా ఎమర్జెన్సీ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే ఇటీవల రష్యా అధినేతకు ఎదురుతిరిగిన ప్రిగోజిన్ విమాన ప్రమాదంలో చనిపోవడంతో అనుకోకుండా జరిగిందా, లేదా ఏదైనా కుట్ర కోణం దాగి ఉందా అని ప్రపంచ వ్యాప్తంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పుతిన్ పై వాగ్నర్ చీఫ్ తిరుగుబాటు!
గత రెండేళ్ల నుంచి రష్యా సైన్యం ఉక్రెయిన్ పై దాడులు చేస్తోంది. ఉక్రెయిన్ పై సైనిక చర్యలో రష్యా ఆర్మీకి ప్రైవేట్ ఆర్మీ వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్ అండగా నిలిచారు. అయితే ఈ ఏడాది జూన్ లో రష్యా అధ్యక్షుడు పుతిన్ పై ప్రిగోజిన్ తిరుగుబాటు చేశారు. ప్రభుత్వం చర్యలను తీవ్రంగా ఖండించిన వాగ్నర్.. పుతిన్ ను రష్యా అధ్యక్ష పీఠం నుంచి తప్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అప్పటివరకూ ఉక్రెయిన్ పై సైనిక చర్యలో అండగా నిలిచిన ప్రిగోజిన్ ఎదురు తిరగడంతో రష్యాలో పరిస్థితి అదుపుతప్పినట్లు కనిపించింది. తాను న్యాయ పోరాటం చేస్తున్నానని, ప్రభుత్వం తిరుగుబాటు చేయడం తన ఉద్దేశం కాదని వెల్లడించడంతో రష్యా సర్కార్ ఊపిరి పీల్చుకుంది. బెలారస్ అధ్యక్షుడు లుకషెంకో జోక్యం చేసుకుని సర్దిచెప్పడంతో వాగ్నర్ బలగాలు రష్యా ప్రభుత్వంపై దాడుల విషయాన్ని ముందుకు తీసుకెళ్లలేదు. దేశంలో అంతర్గతంగా రక్తపాతాన్ని కోరుకునేందుకు ఇష్టపడని ప్రిగోజిన్ తన బలగాన్ని వెనక్కి తీసుకున్నారు.
వాగ్నర్ గ్రూప్ చర్యలను వెన్నుపోటుగా పేర్కొన్న పుతిన్..
వాగ్నర్ గ్రూప్ (Wagner Group) తమపై తిరుగుబాటు చేయడంపై అప్పట్లోనే రష్యా అధ్యక్షుడు పుతిన్ తీవ్రంగా స్పందించారు. దేశ ద్రోహులను సహించేదే లేదని వ్యాఖ్యానించారు. ప్రిగోజిన్ చర్య కచ్చితంగా "ఇది వెన్నుపోటు" అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం తన వ్యక్తిగత కక్ష తీర్చుకునేందుకు దేశ మిలిటరీపైనే దాడి చేయడం సరికాదని హితవు పలికారు. అటు ఉక్రెయిన్ మాత్రం రష్యాలో అంతర్యుద్ధంతో కాస్త ఊపిరి పీల్చుకుంది.
రష్యా మిలిటరీ ఇప్పటికే వాగ్నర్ గ్రూప్‌పై ఉగ్రవాద ముద్ర వేసింది. తమపై తిరుగుబాటు ఆపితే వాగ్నర్ సైనికుల రక్షణకు హామీ ఇస్తామని రష్యా వెల్లడించింది. కానీ వెనక్కి తగ్గని ప్రిగోజిన్.. రోస్తోవ్ లోని రష్యా మిలిటరీ హెడ్‌క్వార్టర్స్‌ని అధీనంలోకి తీసుకున్నారు. అనంతరం జరిగిన చర్చలతో ఆయన శాంతించారు.