Ukraine Naatu-Naatu: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ క్రియేట్ చేసిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. ఈ చిత్రంలోని నాటు నాటు సాంగ్ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇందులో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ కు తోడు ఫాస్ట్ బీట్ సాంగ్ విశేషంగా ఆకట్టుకుంది. ఏకంగా ఆస్కార్ ను తెచ్చిపెట్టింది నాటు నాటు సాంగ్. సినిమాలోని ఒరిజినల్ సాంగ్ చిత్రీకరణ ఉక్రెయిన్ లోని అధ్యక్ష భవనం ముందు జరిగిన విషయం తెలిసిందే. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభానికి ముందు 2021 ఆగస్టులో ఈ సాంగ్ షూటింగ్ జరిగింది. తాజాగా అదే చోట ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అధికారిక నివాసం ముందు ఆ దేశ సైనికులు నాటు నాటు సాంగ్ కు స్టెప్పులేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తాజాగా ఉక్రెయిన్ సైన్యం రష్యాపై డ్రోన్లతో విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. ఏకంగా పుతిన్ నివాసాన్ని టార్గెట్ చేసుకుని డ్రోన్ దాడులు చేస్తున్నారు. రెండ్రోజుల క్రితం ఏకంగా రష్యా రాజధాని మాస్కోపైనా డ్రోన్లతో దాడులు చేసింది ఉక్రెయిన్. మాస్కోలోని నివాసప్రాంతాలపై ఈ డ్రోన్ దాడులు జరిగాయి. పలు భవనాలు కూడా దెబ్బతిన్నాయి. ఇదే తరహాలో దాడులు చేసేందుకు వస్తున్న పలు డ్రోన్లను కూల్చేసినట్లు రష్యా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్ సైన్యం ఈ నాటు నాటు సాంగ్ పై డ్యాన్స్ చేస్తూ ఆ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు. ఈ వీడియో రష్యాకు వ్యతిరేకంగానే చేసినట్టు అర్థమవుతోంది.
వీడియోలో ఏముందంటే..
ఆర్ఆర్ఆర్ సినిమాలోని హిట్ సాంగ్ అయిన నాటు నాటుకు ఉక్రెయిన్ సైన్యం స్టెప్పులేసింది. దాదాపుగా అదే స్థాయి ఎనర్జీతో సైనికులు డ్యాన్స్ తో ఇరగదీశారు. ఈ సాంగ్ చిత్రీకరణ మొత్తం జెలెన్ స్కీ అధికారిక నివాసం ఎదుటే జరిగింది. సైనికులు యూనిఫామ్‌లు ధరించి డ్యాన్స్ చేస్తుంటే.. మరికొందరు వైట్ కలర్ యూనిఫామ్ లో బ్యాండ్ వాయిస్తూ కనిపించారు. మరికొందరు మహిళలు కలర్ ఫుల్ గౌనులు ధరించి పాటలో భాగమయ్యారు. ఈ స్టెప్పులు వేస్తూనే మధ్య మధ్యలో డ్రోన్లు ఎగురవేశారు. టార్గెట్ ప్రాంతంలో విజయవంతంగా బాంబులు జార విడిచారు. ఇందులో డ్రోన్లతో చేసిన విన్యాసాలే ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ సాంగ్ చిత్రీకరణ జరుగుతున్నప్పుడు ఆ ప్రాంతంలో పెద్దగా జనసంచారం లేనట్లుగా వీడియోలో కనిపిస్తోంది. మాస్కోపై ఉక్రెయిన్ డ్రోన్ దాడుల తర్వాత ప్రతీకారంగా రష్యా దాడులు ఉద్ధృతం చేసింది. ఉక్రెయిన్ రాజధాని నగరమైన కీవ్ పై బాంబులతో విరుచుకుపడుతోంది. నివాస ప్రాంతాలు, సైనిక ప్రాంతాలు అనే తేడా లేకుండా బాంబాల వర్షం కురిపిస్తోంది. అందుకే జనసంచారం పెద్దగా లేనట్లు తెలుస్తోంది.
ఉక్రెయిన్ సైన్యం చేసిన నాటు నాటు వీడియోను ఉక్రెయిన్ వైస్ ప్రెసిడెంట్ జేన్ ఫెడోతోవా తన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ లో పోస్టు చేశారు.