Viral News:
14 ఏళ్ల పాటు చిత్రహింసలు..
రష్యాలో 14 ఏళ్ల పాటు ఓ అమ్మాయిని గదిలో బంధించి చిత్రహింసలకు గురి చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్నేళ్లలో ఆమెను తీవ్రంగా కొట్టడమే కాకుండా దాదాపు వెయ్యి సార్లు అత్యాచారం చేసినట్టు బాధితురాలు పోలీసులకు వెల్లడించింది. నిందితుడు వ్లాదిమిర్ చెస్కిడోవ్ మరి కొంత మహిళలనూ ఇలాగే టార్చర్ చేశాడని విచారణలో తేలింది. 19 ఏళ్ల వయసులో బాధితురాలు చెస్కిడోవ్ ఇంటికి నీళ్లు తాగేందుకు వెళ్లింది. అప్పుడే ఆమెని లోబరుచుకుని గదిలో బంధించాడు. అప్పటి నుంచి దారుణంగా హింసిస్తున్నాడు. ఈ నిందితుడికి తల్లి కూడా సహకరించింది. ఇద్దరూ కలిసి ఆమెను వేధించారు. ఇన్నేళ్లకు ఎలాగోలా ఆ ఇంట్లో నుంచి తప్పించుకుని నేరుగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కంప్లెయింట్ ఇచ్చింది బాధితురాలు. ఈ ఫిర్యాదు ఆధారంగా నిందితుడితో పాటు అతడి 72 ఏళ్ల తల్లినీ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులకు కీలక వివరాలు వెల్లడించింది బాధితురాలు. 2009లో బస్‌డిపోలో ఉండగా నిందితుడు చెస్కిడోవ్‌తో పరిచయం ఏర్పడింది. ఆ తరవాత ఇద్దరూ స్నేహితులయ్యారు. డ్రింక్స్ పార్టీ ఉందని చెప్పి అమ్మాయిని ఆహ్వానించాడు నిందితుడు. ఇంట్లోకి వచ్చిన వెంటనే కత్తితో బెదిరించి గదిలో కట్టేశాడు. బెడ్‌రూమ్‌లో బంధించాడు. కేవలం వంట చేయడానికి, ఇల్లు శుభ్రం చేయడానికి మాత్రమే గదిలో నుంచి బయటకు వచ్చేది. అప్పుడు కూడా పక్కనే కత్తి పట్టుకుని నిలబడి ఉండేవాడని పోలీసులకు చెప్పింది బాధితురాలు.
"ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన ప్రతిసారీ నా నోరుకి టేప్ వేసేవాడు. గదిలో మంచానికి కట్టేసి వెళ్లిపోయేవాడు. ఎక్కడికీ పారిపోకుండా కత్తి పట్టుకుని వెంటే వచ్చే వాడు"
- బాధితురాలు
పారిపోయి వచ్చిన బాధితురాలు..
నిందితుడుని కోర్టులో హాజరు పరిచారు పోలీసులు. తాను అత్యాచారం చేశానన్న మాట అవాస్తవమని, ఆమెపై ఎంతో ప్రేమ ఉందని కోర్టుకి చెప్పాడు నిందితుడు. అయితే..నిందితుడి ఇంట్లో సోదాలు చేసిన పోలీసులు అభ్యంతరకరమై వీడియో సీడీలను స్వాధీనం చేసుకున్నారు. ఇక సెల్లార్‌లో ఓ మహిళ శరీర భాగాలు కనిపించాయి. దీనిపై విచారించగా...2011లో చెస్కిడోవ్ ఓ మహిళను హత్య చేశాడని బాధితురాలు చెప్పింది. బాడీని డీకంపోజ్ చేయడానికి సాయం చేయాలని బలవంతం చేశాడని వివరించింది. ఆ చనిపోయిన మహిళ మరెవరో కాదని, అతడి భార్యేనని వెల్లడించింది. తాను ఎలా తప్పించుకుని వచ్చిందో కూడా వివరించింది. నిందితుడు మద్యం మత్తులో వింతగా ప్రవర్తిస్తుంటే అతని తల్లి ఆంబులెన్స్‌కి కాల్ చేసింది. ఆ హడావుడిలో ఇంటికి తాళం వేయడం మరిచిపోయింది. ఇది గమనించిన బాధితురాలు వెంటనే అక్కడి నుంచి పారిపోయి పక్కనే ఉన్న తన గ్రామానికి వెళ్లిపోయింది. తన చెల్లిని కలిసింది. దాదాపు 14 ఏళ్ల తరవాత ఇద్దరూ ఒక్కటయ్యారు. ఎన్నో ఏళ్ల క్రితం కనిపించకుండా పోయిన బాధితురాలు ఉన్నట్టుండి కళ్ల ముందుకు వచ్చే సరికి ఆ కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా ఈ సంఘటన సంచలనం సృష్టించింది.
Also Read: Haryana Clashes: హరియాణాలో ఇంకా తగ్గని అలజడి, ఇంటర్నెట్ సర్వీస్‌లు బంద్