US Presidential Elections 2024 Latest News: అమెరికాలో జరగబోయే అధ్యక్ష ఎన్నికల వేళ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన సంచనలంగా మారుతోంది. దీపావళి పండగ సందర్భంగా హిందూ అమెరికన్ల ఓట్లను టార్గెట్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. హిందూ అమెరికన్ల ప్రయోజనాలను పరిరక్షిస్తానని, మత వ్యతిరేక ఎజెండా నుంచి కాపాడతానని ప్రతిజ్ఞ చేశారు.


ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి భారత్‌తో సంబంధాలను బలోపేతం చేస్తామన్నారు ట్రంప్. ప్రధాని మోదీ తనకు మంచి మిత్రుడన్నారు. దీపావళి పండుగ సందర్భంగా సోషల్‌మీడియా వేదికగా హిందువులకు శుభాకాంక్షలు తెలిపారు. 




'బంగ్లాదేశ్‌లో అరాచక పరిస్థితి'
మాజీ ప్రధాని షేక్ హసీనా రాజీనామా తర్వాత బంగ్లాదేశ్‌లో హిందువులు, ఇతర మైనారిటీలపై జరుగుతున్న హింసను ట్రంప్ ఖండించారు. బంగ్లాదేశ్‌లో హిందువులు, క్రైస్తవులు, ఇతర మైనారిటీలపై జరుగుతున్న అనాగరిక హింస సరికదాని అన్నారు. అక్కడ మైనారిటీలపై దాడి చేసి దోచుకుంటున్నారని, ఇది పూర్తి అరాచకమని అన్నారు.


బైడెన్ హిందువులను విస్మరించారని ఆరోపణ
అధ్యక్షుడు జో బైడెన్, వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ ప్రపంచవ్యాప్తంగా, యునైటెడ్ స్టేట్స్‌లో ఉన్న హిందువులను విస్మరించారని ట్రంప్ విమర్శించారు. "నా హయాంలో ఇది ఎన్నడూ జరగలేదు. కమలా, జో బైడెన్ ప్రపంచవ్యాప్తంగా, అమెరికాలోని హిందువులను విస్మరించారు. వారు ఇజ్రాయెల్ నుంచి ఉక్రెయిన్‌కు, మన సొంత దక్షిణ సరిహద్దులో దాడులు నిలువరించడంలో విఫలమయ్యారు. దేశానికి విపత్తుగా మారారు. కానీ అమెరికాను మళ్లీ బలపరుస్తాం. శాంతిని తిరిగి తీసుకువస్తాము." అని అన్నారు. 


ఆర్థిక విధానాలతోపాటు ఇతర అంశాలపై కూడా కమలా హారిస్‌ను ట్రంప్ విమర్శించారు."కమలా హారిస్ మీ నిబంధనలు అధిక పన్నులతో చిన్న వ్యాపారాలను నాశనం చేస్తున్నారు. నేను పన్నులను తగ్గించాను. నిబంధనలు సడలించాను, అమెరికన్ ఎనర్జీని విముక్తి చేశాను. చరిత్రలో గొప్ప ఆర్థిక వ్యవస్థ సృష్టించాము." మళ్ళీ, మునుపెన్నడూ లేనంత మెరుగ్గా పాలన ఉంటుంది. అమెరికాను మళ్లీ గొప్పగా తయారు చేస్తాం."


దీపావళి శుభాకాంక్షలు
ట్రంప్ హిందువులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. "అందరికీ దీపావళి శుభాకాంక్షలు. దీపాల పండుగ చెడుపై మంచి విజయం సాధించడానికి దారితీస్తుందని ఆశిస్తున్నాను" అని అన్నారు.