Joe Biden  Visit To Kyiv : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైన ఏడాది గడుస్తున్న టైంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్  కీవ్‌లో ఆకస్మికంగా పర్యటించారు.  ముందుగా పోలాండ్‌ లో పర్యటించిన జో బైడెన్... ఆ దేశ అధ్యక్షుడితో భేటీ అయ్యారు. అనంతరం కీవ్ వెళ్లిన బైడెన్ ఉక్రెయిన్ రాజధానిలో ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీతో సమావేశం అయ్యారు.  జెలెన్స్కీతో కలిసి ఉక్రెయిన్ కోసం పోరాడిన సైనికుల కోసం ఏర్పాటుచేసిన వాల్ ఆఫ్ రిమెంబరెన్స్‌ను సందర్శించారు. రష్యా-ఉక్రెయిన్ వార్ మొదలైన తర్వాత మొదటిసారి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్ లో పర్యటిస్తున్నారు.

  


మద్దతు కొనసాగుతోందని జో బైడెన్ ట్వీట్ 


 "దాదాపు ఏడాది క్రితం పుతిన్ ఉక్రెయిన్ పై యుద్ధం ప్రకటించారు. ఉక్రెయిన్ బలహీనంగా ఉందని, ఆ దేశాన్ని సులభంగా ఆక్రమించుకోగలమని పుతిన్ భావించారు. కానీ అతను చేసిందని తప్పని రుజుమైంది. గత ఏడాది యునైటెడ్ స్టేట్స్ ఓ  కూటమిని ఏర్పాటుచేసింది. అట్లాంటిక్ నుంచి పసిఫిక్ వరకు అపూర్వమైన సైనిక, ఆర్థిక మానవతా దేశాల మద్దతుతో ఉక్రెయిన్‌ను రక్షించడంలో సాయం చేస్తున్నాం. ఆ మద్దతు ఇకపై కొనసాగుతుంది” అని యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ ట్వీట్ చేశారు.  






యూఎస్ సాయం కోరిన జెలెన్స్కీ


2022 డిసెంబర్‌లో ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్స్కీ యునైటెడ్ స్టేట్స్‌లో పర్యటించారు. ఆ పర్యటనలో జో బైడెన్ తో భేటీ అయ్యారు.  యూఎస్ పర్యటన సందర్భంగా జెలెన్స్కీ యూఎస్ కాంగ్రెస్‌ను ఉద్దేశించి ప్రసంగించారు. రష్యా దురాక్రమణకు వ్యతిరేకంగా మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు. యూఎస్ సెనేటర్ల బృందం 2023 జనవరిలో కీవ్‌లో ఉక్రేనియన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ, ఇతర అధికారులను కలిశారు. యూఎస్ సెనేటర్లు లిండ్సే గ్రాహం, రిచర్డ్ బ్లూమెంటల్, షెల్డన్ అధ్యక్ష భవనంలో జెలెన్స్కీని కలుసుకున్నారు.  నెలల తరబడి ఉక్రెయిన్‌పై రష్యా భీకరయుద్ధం చేస్తుంది.  ఫిబ్రవరి 24, 2022న మాస్కో ఉక్రేనియన్ భూభాగంలో యుద్ధాన్ని ప్రకటించింది.
 






 అర బిలియన్ డాలర్ల సాయం 


ఉక్రెయిన్ పై రష్యా సైనిక చర్యకు వ్యతిరేకంగా అమెరికా మొదటినుంచి ఉక్రెయిన్‌కు అండగా నిలుస్తుంది. రష్యన్‌ సంస్థలు, వ్యక్తులపై ఆంక్షలు విధించడంతో పాటు కీవ్‌కు ఆయుధాలు అందిస్తుంది. అబ్రామ్‌ యుద్ధ ట్యాంకులనూ సరఫరా చేస్తామని ఇటీవల యూఎస్ తెలిపింది. కీవ్ పర్యటనలో ఉన్న జో బైడెన్ మరో అర బిలియన్ డాలర్ల సాయం ప్రకటించినట్లు తెలుస్తోంది. ఈ విపత్కర పరిస్థితుల్లో అమెరికాతోపాటు ఇత దేశాలు ఉక్రెయిన్ కు అండగా ఉంటాయని జో బైడెన్ హామీ ఇచ్చినట్లు జెలెన్స్కీ తెలిపారు.