ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా అజయ్ బంగాను నామినేట్ చేశారు. మాస్టర్ కార్డ్ మాజీ సీఈవో అజయ్ బంగాను వరల్డ్ బ్యాంక్ చీఫ్ గా అమెరికా నామినేట్ చేసిందని అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. అంతా ఓకే అయితే ప్రపంచ బ్యాంక్ తదుపరి అధ్యక్షుడిగా త్వరలో బాధ్యతలు చేపట్టనున్నారు. దాంతో మరో ఇండో అమెరికన్ కు కీలక పదవి లభించినట్లయింది. ప్రపంచ బ్యాంక్ బోర్డు తుది నిర్ణయానికి ముందు నెలరోజుల పాటు నామినేషన్ నిర్ధారణ ప్రక్రియను ప్రారంభిస్తుంది.






ఈ క్లిష్ట సమయంలో ప్రపంచ బ్యాంకును ముందుకు నడిపించడానికి అజయ్ బంగా లాంటి వారు అవసరం అని అమెరికా అధ్యక్షుడు బిడెన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మూడు దశాబ్దాలకు పైగా పలు విజయవంతమైన ప్రపంచ కంపెనీలను ప్రారంభించి, నిర్వహించారని అన్నారు. అజయ్ బంగా నాయకత్వంలో ఆర్థిక వ్యవస్థలకు పెట్టుబడులను సమకూర్చుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు బైడెన్.


వరల్డ్ బ్యాంక్ అధ్యక్ష పదవికి డేవిడ్ మాల్పాస్ గత వారం తన రాజీనామా చేశారు. ఆ స్థానంలో మే ప్రారంభంలో కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయాలని భావిస్తున్నట్లు ప్రపంచ బ్యాంక్ బుధవారం తెలిపింది. అయితే అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎదుర్కొంటున్న ఇతర సవాళ్లకు ఎదుర్కొని సంస్కరణలు తీసుకురావడానికి అజయ్ బంగా సరైన వ్యక్తిగా అమెరికా భావించింది. 


క్లైమెట్ ఛేంజ్, కర్బన ఉద్గారాల తగ్గింపు లాంటి ఎన్నో కీలకాంశాలను ప్రతిష్టాత్మక లక్ష్యాలుగా చేసుకుని వరల్డ్ బ్యాంక్ నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రస్తుత ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు డేవిడ్ మాల్పస్ తన ఐదేళ్ల పదవీకాలం దాదాపు ఒక ఏడాది మిగిలి ఉన్నప్పటికీ జూన్ చివరి నాటికి పదవీ విరమణ చేయబోతున్నట్లు ఇటీవల ప్రకటించారు. దాంతో అమెరికా అధ్యక్షుడు బైడెన్, ఉన్నతాధికారులు అజయ్ బంగా వైపు మొగ్గు చూపారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నామినేట్ చేసిన వ్యక్తి ప్రస్తుత వరల్డ్ బ్యాంక్ చీఫ్ మాల్పస్ సవాళ్లపై ఫోకస్ చేయలేకపోయారని  బైడెన్ టీమ్ భావించింది.


ఎవరీ అజయ్ బంగా..
అజయ్ బంగా ప్రస్తుతం ప్రైవేట్ ఈక్విటీ సంస్థ జనరల్ అట్లాంటిక్‌ కి వైస్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఒక దశాబ్దానికి పైగా కంపెనీని విజయవంతంగా నిర్వహించిన అనంతరం 2021లో మాస్టర్ కార్డ్ నుండి తప్పుకున్నారు. సుదీర్ఘ బాధ్యతల కాలంలో సంస్థ లాభాలను నాలుగు రెట్లు పెంచిన ఘనత సాధించారు. అమెరికాలోని  ప్రముఖ భారతీయ అమెరికన్ ఎగ్జిక్యూటివ్‌లలో ఒకరిగా అజయ్ బంగా ఉన్నారు.


మాస్టర్‌కార్డ్‌ లో చేరక ముందు, అజయ్ బంగా భారతదేశంలోని సిటీ గ్రూప్, నెస్లేలో దాదాపు 10 ఏళ్లపాటు సేవలు అందించారు. అనంతరం పెప్సికోలో 2 ఏళ్లు పనిచేశారు. పెప్సికో కు చెందిన అంతర్జాతీయ ఫాస్ట్ ఫుడ్ ఫ్రాంచైజీలను భారతదేశంలో ప్రారంభించడంలో కీలక పాత్ర పోషించారు.


భారతదేశంలో జన్మించిన బంగా ఆర్మీ జనరల్ కుమారుడు. ఢిల్లీ యూనివర్సిటీ నుండి ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.  అజయ్ బంగా అహ్మదాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ పూర్వ విద్యార్థి.