USA On Hardeep Singh Nijjar Murder: కెనడాలో సిక్కు వేర్పాటువాద నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ (45) హత్యలో భారతీయ ఏజెంట్లు ప్రమేయం ఉన్నారనే ఆరోపణలపై వైట్ హౌస్ తీవ్ర ఆందోళన చెందుతోందని  జాతీయ భద్రతా ప్రతినిధి జాన్ కిర్బీ బుధవారం చెప్పారు.  దీనిపై  భారతదేశం పూర్తిగా సహకరించాలని ఆయన కోరుతున్నట్లు అక్కడి ప్రధాన మీడియా ప్రచురించింది. కెనడా ఆరోపణలను అమెరికా తిరస్కరించినట్లు, కొట్టిపారేసినట్లు వచ్చిన వార్తా కథనాలు అవాస్తవమని కిర్బీ అన్నారు. కొన్ని పత్రికా ఊహాగానాలు ప్రచురిస్తున్నాయని, కెనడా ఆరోపణలను తిరస్కరించింనట్లు వచ్చిన వార్తలు పూర్తి అవాస్తవమని చెప్పారు.


భారతదేశంపై ట్రూడో ఆరోపణలు చేయడానికి కొన్ని వారాల ముందు, సిక్కు వేర్పాటు వాద నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యను బహిరంగంగా ఖండించాలని అమెరికాతో సహా దాని సన్నిహిత మిత్రదేశాలను కెనడా కోరిందని వాషింగ్టన్ పోస్ట్ మంగళవారం ప్రముఖంగా ప్రచురించింది. కెనడా అభ్యర్థనలను అమెరికా తిరస్కరించబడిందని వాషింగ్టన్ పోస్ట్ తన కథనంలో పేర్కొంది. నిజ్జర్ హత్యపై న్యూఢిల్లీలో జీ 20 సమ్మిట్‌కు కొన్ని వారాల ముందు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, UK, US, కెనడా దేశాలకు చెందిన పలువురు సీనియర్ అధికారులు ప్రైవేట్‌గా చర్చించారని వాషింగ్టన్ పోస్ట్ నివేదించింది. 


మరో ఖలిస్థాన్ టెర్రరిస్ట్ హత్య
ఖలిస్థాన్‌ వేర్పాటువాదంతో కెనడా అట్టుడుకుతోంది. హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ ఘటనపై విచారణ జరుగుతుండగానే మరో ఖలిస్థాన్ టెర్రరిస్ట్ హత్యకు గురవ్వడం సంచలనం సృష్టిస్తోంది. ఖలిస్థానీ గ్యాంగ్‌స్టర్‌ Arsh Dalla కి రైట్ హ్యాండ్‌గా ఉన్న సుఖా దునెకే (Sukha Duneke)హత్యకు గురయ్యాడు. గత నెల సుఖా దునేకేతో సన్నిహితంగా ఉండే మన్‌ప్రీత్ సింగ్ పీటా, మన్‌దీప్ ఫిలిప్పైన్స్ నుంచి ఇండియాకి వచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే NIA ఈ ఇద్దరినీ అరెస్ట్ చేసింది. ఆ సమయంలో పంజాబ్ పోలీసులూ NIAకి సహకరించారు. 


పంజాబ్‌తో పాటు భారత్‌లో మరి కొన్ని చోట్ల అల్లర్లకు ప్లాన్ చేశారు. అర్స్ దల్లా వేసిన స్కెచ్ ఆధారంగా ఆందోళనలు చేపట్టాలని చూశారు. కానీ NIA ముందుగానే గ్రహించి అరెస్ట్ చేసింది. ఆ తరవాత గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్ బిష్ణోయ్ (Lawrence Bishnoi) బంధువైన సచిన్‌నీ అదుపులోకి తీసుకున్నారు. పంజాబ్ గాయకుడు సిద్దూ మూసేవాలా హత్య కేసులో అనుమానితుల లిస్ట్‌లో సచిన్ కూడా ఉన్నాడు. అప్పటి నుంచి అతని కోసం గాలిస్తున్నారు పోలీసులు. పంజాబ్‌లో Category A లిస్ట్‌లో ఉన్న సుఖా దునే హత్య మరోసారి కలకలం రేపుతోంది. 2017లో ఫేక్ పాస్‌పోర్ట్‌తో కెనడాకి వెళ్లాడు సుఖా. కెనడాలోని గ్యాంగ్‌స్టర్‌లందరితోనూ సుఖాకి సన్నిహిత సంబంధాలున్నాయి. 


రెచ్చగొట్టడానికి కాదంటూ ట్రూడో వ్యాఖ్యలు
జూన్‌లో జరిగిన సిక్కు వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందని జస్టిన్ ట్రూడో గతంలో ఆరోపించారు. ఇది ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారి తీస్తోందని, అమెరికా సైతం తీవ్ర ఆందోళన చెందుతోందని అన్నారు. తాజాగా మంగళవారం ట్రూడో విలేకరులతో మాట్లాడుతూ.. తాము భారత్‌ను రెచ్చగొట్టడానికి చూడటం లేదన్నారు. తాము భారత్‌తో కలసి పని చేయాలనుకుంటున్నామని, ఈ క్రమంలో ప్రతి విషయం స్పష్టంగా సరైన ప్రక్రియలో ఉన్నాయని నిర్ధారించుకోవాలనని అనుకుంటున్నట్లు చెప్పారు. 


సోమవారం హౌస్ ఆఫ్ కామన్స్‌లో జస్టిన్ ట్రూడో మాట్లాడుతూ.. భారత ప్రభుత్వ ఏజెంట్లు, కెనడియన్ పౌరుడు హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యకు మధ్య సంబంధాల గురించి  కెనడియన్ సెక్యూరిటీ ఏజెన్సీలకు విశ్వసనీయమైన సమాచారం ఉందని అన్నారు. అయితే ట్రూడో వాదనలను భారత్ తిరస్కరించింది. కెనడాలో హింసాత్మక చర్యలో భారత ప్రభుత్వం ప్రమేయం ఉందనే ఆరోపణలు పూర్తి అసంబద్ధమైనవని, ప్రేరేపించబడినవి అంటూ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. భారత ప్రధాని మోదీపై కెనడా ప్రధాని ట్రూడో చేసిన ఆరోపణలను ఖండిస్తున్నట్లు పేర్కొంది.