China Scooters Running With Sea Salt Batteries Technology: ఇప్పటివరకు మీరు పెట్రోల్, డీజిల్ లేదా లిథియం బ్యాటరీలతో నడిచే స్కూటర్ల గురించి విన్నారు. ఇకపై, "ఉప్పుతో నడిచే స్కూటర్ల" గురించి కూడా మాట్లాడుకుంటారు. సోడియం-అయాన్ బ్యాటరీ టెక్నాలజీ (Sodium-ion battery technology) ఆధారంగా తయారు చేసిన కొత్త తరం స్కూటర్లు ఇప్పుడు చైనా రోడ్లపై కనిపిస్తున్నాయి. ఈ బ్యాటరీల తయారీ కోసం ఉపయోగించిన సోడియాన్ని సముద్రపు ఉప్పు (Sea Salt) నుంచి తీశారు. సముద్రపు ఉప్పు కారు చవకగా దొరకడం మాత్రమే కాదు, ఊహించనంత పెద్ద పరిమాణంలోనూ లభిస్తుంది. కాబట్టి, "ఉప్పుతో నడిచే స్కూటర్లు" విరివిగా లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
సాల్ట్ అయాన్ బ్యాటరీతో బండి ఎలా నడుస్తుంది?సాంప్రదాయ ఎలక్ట్రిక్ స్కూటర్లు సాధారణంగా లిథియం-అయాన్ లేదా లెడ్-యాసిడ్ బ్యాటరీల నుంచి పవర్ పొందుతాయి & పరుగులు తీస్తాయి. కొత్త టెక్నాలజీ స్కూటర్లలో సముద్రపు ఉప్పు నుంచి తయారు చేసిన సోడియం అయాన్ బ్యాటరీలను (Sodium-ion Battery Scooters) అమరుస్తున్నారు. ఈ బ్యాటరీ టెక్నాలజీ లిథియం కంటే సులభంగా అందుబాటులో ఉండటమే కాకుండా పర్యావరణానికి కూడా సురక్షితమైనది. సోడియం బ్యాటరీల ధర లిథియం బ్యాటరీల కంటే తక్కువ & చాలా వేగంగా ఛార్జ్ చేయవచ్చు. ఇంకా వివరంగా చెప్పాలంటే, సోడియం బ్యాటరీలను కేవలం 15 నిమిషాల్లోనే 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. నూతన టెక్నాలజీ కారణంగా ఈ ఉప్పు స్కూటర్ల ధర కూడా చాలా తక్కువగా ఉంది, చైనాలో ఒక్కో స్కూటర్‌ను రూ. 35,000 నుంచి రూ. 51,000 (సుమారు 400 నుంచి 660 US డాలర్లు) వరకు అమ్ముతున్నారు.
ఈ స్కూటర్ మొదటిసారి ఎక్కడ కనిపించింది?ఉప్పుతో నడిచే స్కూటర్ల మొదటి ప్రదర్శన చైనాలోని హాంగ్‌జౌలోని ఒక షాపింగ్ మాల్ వద్ద జరిగింది. ప్రత్యేకంగా రూపొందించిన ఛార్జింగ్ స్టేషన్‌లను కూడా అక్కడ ఏర్పాటు చేశారు, ఈ స్కూటర్ల బ్యాటరీని కేవలం 15 నిమిషాల్లో 80% వరకు ఛార్జ్ చేసి చూపించారు. సోడియం బ్యాటరీ టెక్నాలజీని ఆచరణలోకి తీసుకురావచ్చని, సాధారణ ఉపయోగం కోసం కూడా పూర్తిగా ఉపయోగించుకోవచ్చని ఈ లైవ్ ఎగ్జిబిషన్ రుజువు చేసింది.
లిథియంకు చవకైన & తెలివైన ప్రత్యామ్నాయంప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ వేగంగా పెరుగుతున్న ప్రస్తుత టైమ్‌లో, లిథియం పరిమిత లభ్యత & అధిక ధర అంశాలు పెద్ద ఆందోళనగా మారాయి. దీనికి తోడు, లిథియం తవ్వకం కూడా పర్యావరణానికి హాని కలిగిస్తుంది. దీనికి విరుద్ధంగా... సోడియం చాలా చవకగా, విస్తృతంగా లభించే & పర్యావరణ అనుకూల పదార్థం. దీనివల్ల నూతన సాంకేతికతపై ఆశలు పెరిగాయి.
ఉప్పుతో నడిచే స్కూటర్లు భారతదేశానికి ఎప్పుడు వస్తాయి?ప్రస్తుతం, భారతదేశంలో సోడియం బ్యాటరీలపై పరిశోధన ప్రారంభ దశలోనే ఉంది. ఓలా, అథర్ & హీరో ఎలక్ట్రిక్ సహా వివిధ ప్రభుత్వ & ప్రైవేట్ కంపెనీలు ప్రత్యామ్నాయ బ్యాటరీ టెక్నాలజీల కోసం తీవ్రంగా పరిశీలిస్తున్నాయి. సోడియం అయాన్ బ్యాటరీ టెక్నాలజీ భారతదేశంలో ఎప్పుడు వాణిజ్యపరంగా అందుబాటులోకి వస్తుందో చెప్పలేము. అది అందుబాటులోకి వస్తే మాత్రం చాలా భారీ ప్రయోజనాలు కలిగిస్తుందని మాత్రం చెప్పవచ్చు.