బెంగళూరు: కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (KSCA) కార్యదర్శి ఎ. శంకర్, ట్రెజరర్ ఇ.ఎస్. జయరామ్ తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ విషయాన్ని PTI రిపోర్ట్ చేసింది. బెంగళూరులో జరిగిన విషాదకరమైన తొక్కిసలాటలో 11 మంది చనిపోవడంతో వీరిద్దరూ KSCA ప్రెసిడెంట్కు తమ రాజీనామా లేఖలు సమర్పించారు. గత కొన్ని రోజులుగా కర్ణాటక క్రికెట్ అసోయేషన్ సభ్యులపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
బెంగళూరు తొక్కిసలాటతో సీనియర్ అధికారులు రాజీనామా
ఒక ఉమ్మడి ప్రకటనలో శంకర్, జైరామ్ కొన్ని విషయాలు వెల్లడించారు. “గత రెండు రోజులుగా జరిగిన ఊహించని, దురదృష్టకర సంఘటనల కారణంగా, మా పాత్ర చాలా పరిమితమైంది. అయినప్పటికీ నైతిక బాధ్యతను స్వీకరిస్తూ, మేము నిన్న రాత్రి కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (KSCA) కార్యదర్శి, ట్రెజరర్ పదవులకు రాజీనామా చేశాం. కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌కు జూన్ 6వ తేదీన’ రాజీనామా లేఖలు సమర్పించాం అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
అంతకుముందు, కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (KSCA) ప్రెసిడెంట్ రఘురామ్ భట్, కార్యదర్శి ఎ. శంకర్, ట్రెజరర్ ఇ.ఎస్. జయరామ్ తో కలిసి కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. ప్రజలు గుమిగూడటం, చిన్నస్వామి స్టేడియంలో గేట్ నిర్వహణ కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ బాధ్యత కాదని పేర్కొన్నారు.
కర్ణాటక విధాన సౌధలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో విజేతగా నిలవడంతో విక్టరీ పరేడ్ నిర్వహించడానికి వారు అనుమతి కోరారు. ఇది ఎలాంటి సమస్యలు లేకుండా నిర్వహించారు.
చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాటతో విషాదం..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) సోషల్ మీడియా ఆహ్వానం మేరకు జట్టు విజయయాత్ర, వేడుకలలో పాల్గొనేందుకు జూన్ 4న లక్షలాది మంది అభిమానులు ఎం. చిన్నస్వామి స్టేడియం వద్దకు తరలివచ్చారు. ఈ క్రమంలో కొందరు గోడలు దూకి మరి లోపలకి వెళ్లే ప్రయత్నం చేశారు. కొందరు స్టేడియం బయట ఉన్న బారీకేడ్లు మీద నుంచి సైతం వెళ్లిపోయారు. స్టేడియం లోపల నిండిపోయి ఉందని, మరెవర్నీ అనుతించకపోవడంతో ఫ్యాన్స్ లోపలకి వెళ్లేందుకు చొచ్చుకొచ్చారు. జనాల రద్దీ కంట్రోల్ చేయడానికి పోలీసులు స్టేడియం బయట లాఠీఛార్జ్ చేశారు. దాంతో ఒక్కసారిగా తోపులాట జరిగి, తొక్కిసలాటకు దారి తీసింది. ఈ తొక్కిసలాటలో ఊపిరాడక 11 మంది చనిపోయారు. మరోవైపు స్టేడియం లోపల ఆర్సీబీ విజయానికి సంబంధించిన వేడుకలు, ఆటగాళ్లకు సన్మానం కొనసాగించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.