IPL 2025 DC Updates: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్ కు డుమ్మా కొట్టడంపై ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిషెల్ స్టార్క్ మనసులోని మాటలను బయట పెట్టాడు. తన నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు. గతనెల రెండో వారంలో భారత్, పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో వారం రోజులపాటు ఐపీఎల్ ను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. వారం తర్వాత అంటే మే 18 నుంచి ఐపీఎల్ స్టార్ట్ కాగా, చాలామంది విదేశీ ప్లేయర్లు తాము ప్రాతినిథ్యం వహిస్తున్న ఆయా జట్ల ట్రైనింగ్ సెషన్లకి చేరుకున్నారు. అయితే కొంతమంది విదేశీ ప్లేయర్లు మాత్రం బ్రేక్ తర్వాత ఇండియాకు రాలేదు. తమ స్వదేశంలోనే ఉండిపోయారు. అలాంటి వారిలో ఆస్ట్రేలియాకు చెందిన స్టార్క్ తోపాటు జాక్ ఫ్రేజర్ మెక్ గర్క్ తదితరులు ఉన్నారు. తాజాగా ఐపీఎల్ రీ స్టార్ట్ కు తను రాకపోవడం వెనకాల కారణాన్ని స్టార్క్ బయట పెట్టాడు. ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ఉండటంతో తన మనసు రెడ్ బాల్ పైకి మళ్ళిందని, అందుకే ఇండియాకు తిరిగి రాలేదని చెప్పుకొచ్చాడు. లాస్ట్ ఎడిషన్ ఫైనల్లో భారత్ ను ఓడించిన ఆసీస్.. ఈాసారి డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగుతోంది.
ఆ నిర్ణయంపైనే ఉన్నా..ఇక ఐపీఎల్ రీ స్టార్ట్ తర్వాత తను తిరిగి రాకపోవడానికి కట్టుబడి ఉన్నానని స్టార్క్ తెలిపాడు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో సరైన సమచారం లేకుండా తిరిగి రావడం కరెక్టు కాదని భావించినట్లు వెల్లడించాడు. ఇప్పటికీ దీనికి తాను కట్టుబడి ఉన్నానని పేర్కొన్నాడు. మరోవైపు ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ఈనెల 11 నుంచి లార్డ్స్ మైదానంలో జరుగుతుంది. డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో తలపడుతుంది. అయితే ఆసీస్ జట్టులోనే జోష్ హేజిల్ వుడ్ మాత్రం ఐపీఎల్ రీ స్టార్ట్ అయ్యాక తిరిగి వచ్చాడు. తను ప్రాతినిథ్యం వహిస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మెయిడిన్ టైటిల్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు.
నేనలా కాదు..ఇక ఐపీఎల్ రీస్టార్ట్ కు రాకపోవడం, టోర్నీ నుంచి తప్పుకోవడం లాంటిది కాదని స్టార్క్ అన్నాడు. తననెంతో ఆదరించిన ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం అంటే తనకెంతో గౌరవమని చెప్పాడు. అయితే కొంతమంది ప్లేయర్ ఐపీఎల్ యాక్షన్ లో ఎంపికయ్యాక, టోర్నీ ప్రారంభానికి ముందు తప్పుకున్నారని, తాను అలాంటి వాడిని కాదని చెప్పుకొచ్చాడు. అయితే ఈ విషయాన్ని ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ హేరీ బ్రూక్ ను ఉద్దేశించే అన్నట్లు పలువురు భావిస్తున్నారు. తను గత రెండేళ్లుగా ఐపీఎల్ యాక్షన్ లో పేరు నమోదు చేసుకుని, వేలంలో అమ్ముడు పోయాక, టోర్నీ నుంచి తప్పుకున్నాడు. దీంతో అతనిపై ఈసారి బీసీసీఐ కొరడా ఝళిపించి, నిషేధం కూడా విధించింది. అయితే తను బ్రూక్ మాదిరిగా చేయలేదని స్టార్క్ సంజాయిషీ ఇచ్చాడు. ఇక ఐపీఎల్లో ఆడిన మ్యాచ్ ల మేరకే డబ్బులు వస్తాయని సమాచారం. దీంతో స్టార్క్ కు తన రెమ్యునరేషన్ లో ఆ మేరకు కోత పడుతుందని తెలుస్తోంది. దీంతో తనకు లభించిన దానితోనే సంతృప్తి పడతానని స్టార్క్ ఈ సందర్బంగా చెప్పుకొచ్చాడు.