Stampede in Bengaluru Updates: ఆర్సీబీ విజయోత్సవ వేడుకల్లో తొక్కసలాటకు సంబంధించి స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ చిక్కుల్లో పడే అవకాశముంది. తాజాగా తొక్కిసలాటకు తాను కారణమని ఒక ఎఫ్ఐఆర్ నమోదైంది. మంగళశారం కప్పు సాధించాక, బుధవారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించిన విజయోత్సవ వేడుకలలో తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 11 మంది చనిపోగా, 50 మందికిపైగా గాయపడ్డారు. దీనిపై ఆర్సీబీ ఫ్రాంచైజీ, కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం, విజయోత్సవ ఆర్గనైజర్ డీఎన్ఎ పై కేసులు నమోదై, పలువురు అరెస్టైన సంగతి తెలిసిందే. తాజాగా కోహ్లీ పై కూడా కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అలాగే ఇదే స్టేషన్ లో నమోదైన మరో కేసుతో కలిపి విచారణ చేస్తామని వెల్లడించారు.
బాధితుడి ఫిర్యాదు..ఇక తొక్కిసలాటకు కారణమైన ఆర్సీబీ ఫ్రాంచైజీ టీమ్ మేనేజ్మెంట్, ఈవెంట్ ఆర్గనైజర్ డీఎన్ఎ, కేఎస్సీఏలపై కేసు నమోదు చేయాలని ఈ ఘటనలో గాయపడిన బాధితుడు ఒకరు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో ఆర్సీబీ ఫ్రాంచైజీ ట్వీట్ చేయడంతోనే చిన్నస్వామి స్టేడియానికి తాను వచ్చామని, స్టేడియం గేట్ దగ్గర బీభత్సమైన తొక్కిసలాట జరగడంతో తన భుజానికి గాయమైందని, దీనిపై చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ చేశారు. దీంతో పోలీసులు ఈ కేసుపై కూడా విచారణ చేస్తున్నారు. తొక్కిసలాట ఘటనలో నేరపూరిత నిర్లక్ష్యం జరిగిందని FIRలో పేర్కొన్నారు. FIRలో సెక్షన్లు 105, 125 (1) (2), 132, 121/1, 190 R/W 3 (5) కింద కేసులు నమోదు చేశారు.
సీఎం, డీసీఎంలపై ఫిర్యాదు.. ఇక ఈ తొక్కిసలాటకు మూల కారణం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్ కారణమని బీజేపీ బృందం కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. మూల కారకులను వదిలి, అమాయకులైన పోలీసులను బలి పశువులను చేస్తూ, వారిని సస్పెండ్ చేస్తున్నారని విమర్శించింది. పోలీసులు సభకు అనుమతి ఇవ్వకపోయాని, సీఎం, డీసీఎం పాల్గొనడంతోనే కార్యక్రమం జరిగి, ఇంతటి అనర్థం జరిగిందని తెలిపింది. ఇప్పటికైనా ఏమాత్రం నైతికత ఉన్నా రాజీనామా చేయాలని ఇద్దరు నేతలను బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ బృందంలో ఎంఎల్సీ రవికుమార్. రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిథి రాజీవ్, అశ్వత్ నారాయణన్,దత్తాత్రి, హరీష్, సప్తగిరి గౌడ, వసంత కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇక ఈ విషయంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా స్పందించింది. జిల్లా యంత్రాంగం, పోలీసులకు నోటీసులు పంపి, ఒక వారంలో నివేదిక సమర్పించాలని కోరింది. NHRC ప్రకారం, అధికారుల ద్వారా జనాలను నియంత్రించడంలో సరైన ప్రణాళికలు లేవనే ఆరోపణలు వచ్చాయని పేర్కొంది. విషాదం జరిగిన తర్వాత, స్టేడియం వెలుపల మృతదేహాలు పడి ఉన్నప్పటికీ, స్టేడియం లోపల వేడుకలు కొనసాగాయని తెలిపింది.