హైదరాబాద్: ఓలా స్టాక్ ధరలు పడిపోవడం, ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు తగ్గిపోవడంతో ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ వ్యవస్థాపకుడు, సీఈఓ భవిష్ అగర్వాల్ తనఖా పెట్టిన షేర్లకు అదనపు హామీగా ₹200 కోట్ల నగదు చెల్లించారన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం ఈ వార్త వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

బ్లూమ్బెర్గ్ నివేదిక ఏం చెప్పిందంటే?

ఎవరైనా తన షేర్లను తనఖా పెట్టి రుణం తీసుకున్నప్పుడు, స్టాక్ మార్కెట్‌లో ఆ షేర్ల విలువ పడిపోతే, రుణం తీసుకున్న వ్యక్తి అదనపు హామీ (కొల్లేటరల్) ఇవ్వాలని రుణదాతలు అడుగుతారు. దీన్నే 'మార్జిన్ కాల్' అని కూడా అంటారు. అయితే, ఈ పరిస్థితి రాకముందే తనఖా పెట్టిన షేర్లపై రుణదాతలు ఆందోళన చెందకుండా ఉండేందుకు ఈ నిర్ణయాన్ని ఓలా సీఈఓ, వ్యవస్థాపకుడు అయిన భవిష్ అగర్వాల్ తీసుకున్నట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదిస్తోంది. ఓలా ఎలక్ట్రిక్ వాటాలో భవిష్ అగర్వాల్ 8 శాతం షేర్లను తనఖా పెట్టినట్లు స్టాక్ ఎక్స్ఛేంజ్ డేటా ద్వారా తెలుస్తోంది. ఓలా ఎలక్ట్రిక్ వాటాలో 30 శాతం షేర్లు తనఖా పెట్టినట్లు సమాచారం. అయితే నిధులు ఏఐ స్టార్టప్ కంపెనీ కోసం సేకరించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

మార్కెట్ వాటా కోల్పోయిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు

గత ఏడాది 48 శాతం ఉన్న ఓలా ఎలక్ట్రిక్ మార్కెట్ వాటా, ఇప్పుడు 18 శాతానికి పడిపోయింది. ఈ పతనం భారీ దెబ్బగా వ్యాపార వర్గాల అంచనా. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు తగ్గిపోవడమే కాకుండా, కంపెనీ నిర్వహణపరంగా కూడా సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ₹200 కోట్లు రుణదాతలకు చెల్లింపులు జరుపుతున్నారంటేనే ఓలా ఎలక్ట్రిక్ తీవ్రమైన ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.

ఆర్థిక సవాళ్లను, మార్కెట్ వాటాను పొందే ప్రణాళికలు ఏంటో?

ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్లో నిత్యం సవాళ్లను ఎదుర్కొంటోంది ఓలా ఎలక్ట్రిక్. ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో నిత్యం జరుగుతున్న మార్పులను అందిపుచ్చుకోవడం కూడా ఓలాకు ఛాలెంజ్‌గా మారింది. ఈ మార్కెట్‌లో నిత్యం కొత్త మోడళ్లను విడుదల చేస్తూ తన మార్కెట్ వాటాను తిరిగి రాబట్టేందుకు ఓలా యాజమాన్యం ప్రయత్నిస్తూ ఉంది. అయితే రానున్న రోజుల్లో ఈ మార్కెట్ వాటాను తిరిగి దక్కించుకునేందుకు ఏం చేయనుందో వేచి చూడాలి. అయితే భవిష్ అగర్వాల్ చేసిన అదనపు నగదు చెల్లింపు వ్యవహారం మాత్రం పెట్టుబడిదారుల్లో ఆందోళన రేపుతోంది.