Most Wanted Maoist Hidma Photo: హైదరాబాద్: రెండు దశాబ్దాల నుంచి మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేత మడావి హిడ్మా ఎలా ఉంటాడన్న దానిపై క్లారిటీ వచ్చేసింది. మావోయిస్టు పార్టీలో భారీ గెరిల్లా దాడులకు వ్యూహకర్తగా ఉన్న మడావి హిడ్మా లేటెస్ట్ ఫొటో బయటకు వచ్చింది. ఇప్పటివరకూ హిడ్మా అంటే పాతికేళ్ల కిందటి ఫొటోనే అందరికీ తెలుసు. ఆపరేషన్ కగార్ చివరి దశకు వచ్చిన క్రమంలో తాజాగా మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ మడావి హిడ్మా ఫొటో బయటకు రావడం హాట్ టాపిక్ అవుతోంది. మరోవైపు ఛత్తీస్ గఢ్ దండకారణ్యాన్ని బలగాలు జల్లెడ పడుతున్నాయి. ఇప్పటికే పలు ఎన్ కౌంటర్లలో మావోయిస్టు పార్టీ అగ్రనేతలు ప్రాణాలు కోల్పోయారు.
25 ఏళ్ల తరువాత మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు హిడ్మా ఫొటో బయటకు రావడంతో ఆయన కదలికలపై బలగాల వద్ద సమాచారం ఉందని తెలుస్తోంది. PLGA ఒకటో బెటాలియన్ కమాండర్ గా కొనసాగుతున్న హిడ్మా కోసం వందలాది జవాన్లు ప్రస్తుతం నేషనల్ పార్క్ ని జల్లెడ పడుతున్నారు. కొన్ని రోజుల కిందట మావోయిస్టుల కంచుకోట కర్రెగుట్టపై భారత జాతీయ జెండా ఎగరేశారు. కర్రెగుట్టలో మావోయిస్టుల శకం ముగిసిందని బలగాలు తెలిపాయి. వచ్చే ఏడాది మార్చి నాటికి మావోయిస్టు రహిత భారత్ లక్ష్యమని కేంద్రం చెబుతోంది. హోం మంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు కొన్ని నెలల నుంచి ఛత్తీస్ గఢ్ అడవులు, అణువణువు భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి.
మెరుపు దాడులకు వ్యూహకర్త..
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా పూవర్తికి చెందిన మడావి హిడ్మాకు పార్టీలో విలాస్, సంతోష్, హిడ్మాల్, అనే పేర్లు ఉన్నాయని సమాచారం. కేంద్ర కమిటీలో అత్యంత పిన్నవయస్కుడు హిడ్మానే. ప్రస్తుతం అతడి వయసు 51 ఏళ్లు అని తెలుస్తోంది. వాంటెడ్ మావోయిస్టు హిడ్మాకు హిందీ, తెలుగు, కోయ, గోండి, బెంగాలీ భాషల్లో పట్టుంది. భారీ మెరుపు దాడులకు వ్యూహకర్త. జవాన్లు, బలగాల క్యాంపులపై మెరుపుదాడులు నిర్వహించడంలో అందెవేసిన చేయి. పక్కా ప్లాన్‌తో భారీ దాడుల్లో పాల్గొనడంతో తక్కువ కాలంలోనే కేంద్ర బలగాలకు మోస్ట్ వాంటెడ్‌గా మారాడు హిడ్మా.