Ukraine-Russia War: రష్యా- ఉక్రెయిన్ మధ్య ఐదో రోజు కూడా యుద్ధం కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం నుంచి ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరాన్ని చుట్టుముట్టి రష్యా సేనలు భీకర దాడులు చేస్తున్నాయి. కీవ్‌ను అధీనంలోకి తీసుకునేందుకు రష్యా సైన్యం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కానీ రష్యా సేనలను ఉక్రెయిన్ ఆర్మీ దీటుగా ప్రతిఘటిస్తోంది. అయితే తాజాగా బ్రిటన్ పత్రిక 'ద టైమ్స్' ఓ సంచలన నివేదికను బయటపెట్టింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లొదిమిర్ జెలెన్‌స్కీని చంపేందుకు రష్యా పక్కా ప్రణాళికను సిద్ధం చేసిందని పేర్కొంది.


400 మంది


జెలెన్‌స్కీని చంపేందుకు 400 మంది రష్యా ఉగ్రవాదులను కీవ్‌లో మోహరించినట్లు ఈ నివేదిక చెబుతోంది. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ను దక్కించుకోవాలంటే జెలెన్‌స్కీని మట్టుబెట్టాలని రష్యా యోచిస్తున్నట్లు సమాచారం.  


కీవ్‌లో వైమానిక దాడులకు రష్యా ప్రయత్నించే అవకాశముందని సమాచారం. దీంతో అక్కడి ప్రజలు సమీపంలోని షెల్టర్‌లో ఆశ్రయం పొందాలని ప్రభుత్వం సూచించింది. అలాగే చెర్నిహివ్‌లోని ఓ నివాస భవనంపై క్షిపణి దాడి జరిగింది. దాంతో రెండు అంతస్తులు మంటల్లో చిక్కుకున్నాయి.


198 మంది మృతి


ఉక్రెయిన్‌పై రోజురోజుకు రష్యా సేనలు దాడులను పెంచుతున్నాయి. ఇప్పటికే ఉక్రెయిన్‌లోని పలు నగరాలను రష్యా సేనలు అధీనంలోకి తీసుకున్నాయి. అలానే మరిన్ని నగరాలపై క్షిపణి దాడులు చేస్తోంది. శనివారం వరకు రష్యా దాడుల్లో 198 మంది ఉక్రెయిన్ పౌరులు మరణించినట్లు సమాచారం. ఇందులో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. 1,684 మంది గాయపడ్డారు.


తగ్గేదేలే 


రష్యా దాడులను ఉక్రెయిన్ దీటుగా ఎదుర్కొంటోంది. ఆయుధాలు, సైనికులు తక్కువున్నప్పటికీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ నేతృత్వంలో ఆ దేశ ఆర్మీ పోరాడుతోంది. ప్రపంచ దేశాలు సాయం చేయాలని జెలెన్‌స్కీ కోరుతున్నారు. ఆదివారం సాయంత్రం బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌తో ఉక్రెయిన్ అధ్యక్షుడు మాట్లాడారు. తదుపరి 24 గంటలకు ఎంతో కీలకమని ఇరువురు నేతలు అభిప్రాయపడ్డారు.


బెలారస్ సైన్యం 


ఉక్రెయిన్​తో యుద్ధంలో రష్యాకు మద్దతుగా బెలారస్ తన సైన్యాన్ని పంపే యోచనలో ఉన్నట్లు అమెరికాకు చెందిన ఓ ఇంటెలిజెన్స్ అధికారి తెలిపారు. ఈ మేరకు ఉక్రెయిన్​తో రష్యా బలగాలతోపాటు బెలారస్ సైన్యం పోరాడవచ్చన్నారు. ఉక్రెయిన్​పై రష్యా దాడిని బెలారస్ మద్దతిస్తోంది. కానీ ఎప్పుడూ ప్రత్యక్షంగా ఉక్రెయిన్​తో పోరాడలేదు. 


Also Read: Russia Ukraine War: మన ఆడపిల్లలపై ఉక్రెయిన్ సైనికుల వేధింపులు- కాలితో తన్ని నెట్టేస్తోన్న వీడియో వైరల్


Also Read: Ukraines Lifestyle: ఉక్రెయిన్లో ఒక నెల ఖర్చు ఎంత తక్కువో తెలుసా? మనం హ్యాపీగా బతికేయచ్చు