టర్కీ, సిరియాలో సంభవించిన భారీ భూకంపం పెను విషాదాన్ని మిగిల్చింది. ఇప్పటికే భారీగా ప్రాణ నష్టం సంభవించగా.. మృతుల సంఖ్య 1300కు చేరుకుందని అధికారులు తాజా ప్రకటనలో వెల్లడించారు. ఆగ్నేయ టర్కీ ప్రాంతంలో, ఉత్తర సిరియాలో సోమవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.8 గా నమోదు కావడంతో ఇది భారీ, ప్రమాదకర భూకంపమని అధికారులు తెలిపారు. భారీ భవంతులు నిమిషాల్లో నేలమట్టం కావడంతో శిథిలాల కింద చిక్కుకుని, మరణాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. టర్కీలోని 10 నగరాల్లో భూకంప తీవ్రత అధికంగా ఉంది. ఈ భూకంపం కారణంగా వేలాది మంది గాయపడ్డారు.
టర్కీకి సాయం చేసేందుకు ముందుకొచ్చిన భారత్
టర్కీలో సంభవించిన తీవ్ర భూకంప పరిస్థితుల్లో భారతదేశం తన సహాయ మిషన్‌ను సిద్ధం చేసింది. భారత్ వైపు నుంచి రెండు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను టర్కీకి పంపాలని కేంద్రం నిర్ణయించింది. దీంతో పాటు బాధితులకు మెడిసిన్, వైద్య పరికరాలు, రిలీఫ్ మెటీరియల్స్‌ను పంపడానికి ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. టర్కీ దేశానికి ఎలాంటి సహాయక సామగ్రి అందించాలి అనే అంశంపై సోమవారం ప్రధాని మంత్రి కార్యాలయంలో సమావేశం సైతం జరిగింది.
భారీ భూకంప విపత్తు సమయంలో భారత్ నుంచి అన్ని విధాలుగా సహాయాన్ని అందిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. అనంతరం ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ డా. పి.కె. తక్షణ సహాయక చర్యలపై చర్చించేందుకు మిశ్రా సౌత్ బ్లాక్‌లో సమావేశం నిర్వహించారు. NDRF సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్‌లతో పాటు రిలీఫ్ మెటీరియల్‌తో పాటు వైద్య బృందాలను వెంటనే టర్కీ దేశానికి పంపాలని కీలక సమావేశంలో నిర్ణయించారు.
భారతదేశం నుంచి టర్కీ పంపనున్న బృందంలో ప్రత్యేక శిక్షణ పొందిన డాగ్ స్క్వాడ్‌లు, అవసరమైన పరికరాలతో 100 మంది సిబ్బందితో కూడిన రెండు NDRF టీమ్స్ భూకంప ప్రభావిత ప్రాంతానికి వెళ్తాయి. అక్కడ టర్కీ అధికారులతో కలిసి రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటాయి. మెరుగైన వైద్య సేవలు అందించనున్న వైద్యులు, పారా మెడికల్ సిబ్బందితో వైద్య బృందాలను కూడా కేంద్రం టర్కీకి పంపిస్తోంది.