Donald Trump : అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టాక డోనాల్డ్ ట్రంప్ భారీ మార్పులు, చర్యలకు ఉపక్రమిస్తున్నారు. వలసదారుల నిషేధంపై ఫోకస్ చేసిన ప్రభుత్వం.. ఇప్పడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. సుంకాలు విధించే ఉత్తర్వులపై ట్రంప్ అన్నంత పనీ చేశారు. తాజాగా ఆయన టారిఫ్ (Tariff) లకు సంబంధించి కీలక ఉత్తర్వులపై సంతకం చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం, మెక్సికోపై 25 శాతం, కెనడాపై 25 శాతం, చైనాపై 10 శాతం సుంకాలు వర్తించనున్నాయి. గతంలోనూ ఈ దేశాలపై సుంకాలు విధిస్తానంటూ ట్రంప్ హెచ్చరించగా.. ఇప్పుడు దాన్ని అమలు చేసేందుకు సన్నాహాలు పూర్తి చేశారు.
కెనడా, మెక్సికో దిగుమతులపై 25శాతం, చైనాపై 10శాతం టారిఫ్ అమలుపై తాను సంతకం చేశానని డోనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా ద్వారా స్పష్టం చేశారు. ఫెంటానిల్ సహా తమ దేశ పౌరులను చంపే చట్టవిరుద్ధమైన, ప్రాణాంతకమైన డ్రగ్స్ ముప్పు కారణంతోనే ఈ నిర్ణయానికి శ్రీకారం చుట్టామని ప్రకటించారు. అమెరికా పౌరులను రక్షించాల్సిన బాధ్యత తమపై ఉందన్న ట్రంప్.. అందరికీ భద్రత కల్పించడం అధ్యక్షుడిగా తన కర్తవ్యమని చెప్పారు. మాదక ద్రవ్యాలే కాదు చట్టవిరుద్దంగా వచ్చే వలసదారులను సరిహద్దుల్లోకి కూడా రాకుండా చేస్తామని ఎన్నిక ప్రచారంలో చెప్పిన హామీకి.. తాను ఇప్పటికీ కట్టబడి ఉన్నానని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా కీలక ప్రకటన చేసిన వైట్ హౌస్ అధికారులు.. సుంకాల నుండి ఎవరికీ ఎలాంటి మినహాయింపులు ఉండవని స్పష్టం చేశారు. సంక్షోభం తగ్గే వరకు ఈ సుంకాలు అమల్లో ఉంటాయని చెప్పారు.
ట్రంప్ నిర్ణయంతో మాంద్యం తప్పదంటోన్న నిపుణులు
ట్రంప్ ఆదేశాల ప్రకారం ఈ సుంకాలు మంగళవారం అర్థరాత్రి 12.01 (భారత కాలమానం ప్రకారం 5.01) గంటల నుంచి అమల్లోకి వస్తాయి. రవాణాలో ఉన్న వస్తువులు, కట్-ఆఫ్ సమయానికి ముందు అమెరికా సరిహద్దులోకి ప్రవేశించే వస్తువులకు సుంకాల నుంచి మినహాయింపు ఉంటుంది. అయితే, ట్రంప్ టారిఫ్ ఆర్డర్‌ల నుంచి మినహాయింపు పొందేందుకు మూడు దేశాలు తీసుకోనున్న చర్యలపై అధికారులు ఎలాంటి వివరాలను అందించలేదు. తాజా సుంకాలు ఈ ఏడాది యూఎస్ ఆర్థిక వృద్ధిని 1.5% తగ్గించి కెనడా, మెక్సికోలను మాంద్యంలోకి నెట్టివేస్తాయని నిపుణులు భావిస్తున్నారు.
బ్రిక్స్ దేశాలపై ఆగ్రహం
అంతకుముందు ట్రంప్.. బ్రిక్స్ (BRICS) దేశాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ వాణిజ్యంలో యూఎస్ డాలర్ కు ప్రత్యామ్నాయం చూసుకుంటే బ్రిక్స్ దేశాలపై 100శాతం సుంకాలు విధిస్తానని హెచ్చరించారు. ఈ విషయంలో ప్రపంచ దేశాలు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రంప్ పలుమార్లు హెచ్చరించారు. డాలర్ కు బదులుగా ఆయా దేశాలు మరో కరెన్సీని సృష్టించలేవని, ఒకవేళ డాలర్ ను వదులుకుంటే యూఎస్ ఎకానమీలో అమ్మకాలకు స్వస్తి పలికి, ప్రయోజనాల కోసం మరో దేశాన్ని ఎన్నుకోక తప్పని ట్రంప్ చెప్పారు. అలా చేస్తే 100 శాతం సుంకంతో పాటు, అమెరికాతో వాణిజ్యం వదుకోవాల్సి ఉంటుందని చెప్పారు.
Also Read : Budget 2025 : బడ్జెట్‌లో కొత్త పన్ను రేట్లతో నిజంగానే లాభముందా - ప్రభుత్వానికి వచ్చే నష్టమెంతంటే..