Budget 2025 : ఈ సారి కేంద్ర బడ్జెట్ లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్య తరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకుని వ్యక్తిగత ఆదాయ పన్ను సంస్కరణలు తీసుకొస్తున్నామన్నారు. అందులో భాగంగా జీతభత్యాల తరగతికి గణనీయమైన పన్ను మినహాయింపును ప్రకటించారు. రూ.12 లక్షల వరకు ఆదాయం ఉన్న వారు ఇకనుంచి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని వెల్లడించారు. ప్రామాణిక తగ్గింపుతో అంటే స్టాండర్డ్ డిడక్షన్ ను కలుపుకుంటే మరో రూ.75వేలతో కలిపి రూ.12.75 లక్షల ఆదాయం ఉన్న వారెవరూ ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదన్నమాట. నిజానికి ఈ కొత్త పన్ను ప్రతిపాదన మధ్యతరగతి ప్రజలపై పన్ను భారాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. దీని వల్ల ప్రజలు ఎక్కువ మొత్తంలో డబ్బు పొదుపు చేసేందుకు వెసులుబాటు లభిస్తుంది.
స్లాబ్ రేట్లలో మార్పులతో కలగనున్న ప్రయోజనాలు
తగ్గించిన స్లాబ్ రేట్లతో పాటు, సాధారణ ఆదాయంలో (ప్రత్యేక ఆదాయం మినహా) రూ. 12 లక్షల వరకు సంపాదించే వ్యక్తులకు పన్ను రాయితీలు ప్రకటించడం వల్ల పన్ను చెల్లింపుదారులు ఎలాంటి ఆదాయపు పన్ను చెల్లించనక్కర్లేదు. దాని ప్రకారం ఇప్పటివరకూ రూ. 12 లక్షల ఆదాయం కలిగిన వారు రూ. 80వేల ట్యాక్స్ చేల్లించేవారు. కానీ ఇది ప్రస్తుత పన్ను విధానంతో పన్నులో 100% తగ్గింపు లభిస్తుంది. అంటే వారు ట్యాక్స్ రిబేట్ కారణంగా పన్ను కట్టాల్సిన అవసరం లేదు. అదేవిధంగా, రూ. 18 లక్షలు సంపాదించే వ్యక్తులు రూ. 70 వేల వరకు ప్రయోజనం పొందుతారు. అలా రూ.25 లక్షల ఆదాయం కలిగిన పన్ను చెల్లింపుదారు రూ. 1,10,000 (సుమారు 25% తగ్గింపు) పన్ను ప్రయోజనాన్ని అందుకుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ బడ్జెట్ పన్ను చెల్లింపుదారులకు ఓ బహమమతి అని చెప్పవచ్చు.
ప్రభుత్వానికి తప్పని నష్టం
పన్ను చెల్లింపుల్లో మార్పులు చేయడంతో సాధారణ ప్రజలకు ఖచ్చితమైన ప్రయోజనాలున్నాయని స్పష్టంగా తెలుస్తోంది. కానీ ఈ కొత్త ప్రతిపాదనలు ప్రభుత్వానికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. పాలసీ మార్పుల వల్ల ప్రత్యక్ష పన్నుల (ఆదాయ పన్ను)లో రూ.లక్ష కోట్ల నష్టం వాటిల్లుతుందని అంచనా. దాంతో పాటు పరోక్ష పన్నులు, జీఎస్టీ, కస్టమ్స్ డ్యూటీలతో సహా దాదాపు రూ. 2,600 కోట్ల నష్టం వచ్చే అవకాశం ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ కొత్త పన్ను ప్రతిపాదనలను అమలు చేసేందుకు ప్రభుత్వం తన మొత్తం ఆదాయాన్ని వదులుకుందని చెప్పవచ్చు. ఇది ఆర్థిక వృద్ధిని ప్రేరేపించడం లేదా పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగించే లక్ష్యంతో అయి ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఆదాయపు పన్ను రేట్లలో కోతలు ప్రకటించినప్పటికీ, 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ స్థూల ఆదాయపు పన్ను వసూళ్లు గణనీయంగా పెరుగుతాయని కేంద్రం అంచనా వేసింది. 2025-26 బడ్జెట్ వసూళ్లు రూ.14.38 లక్షల కోట్లుగా నిర్ణయించారు. 2024-25కి సవరించిన అంచనా ప్రకారం రూ. 12.57 లక్షల కోట్లతో పోలిస్తే ఇది 21.1% పెరుగుదలను సూచిస్తోంది. ఇది అంచనా వేసిన దాని కంటే బలమైన పన్ను వసూళ్ల పనితీరును ప్రతిబింబిస్తోంది. అసలు బడ్జెట్ మొత్తం రూ.11.87 లక్షల కోట్ల కంటే ఇది ఎక్కువగా ఉంది.