Titanic Submarine Crash: టైటానిక్ శిథిలాలు చూడటానికి వెళ్లిన టైటాన్ సబ్‌మెర్సిబుల్ సాహసయాత్ర విషాదాంతం అయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ మినీ జలాంతర్గామికి చెందిన శకలాలను నిపుణులు బయటకు తీసుకొచ్చారు. అందులో మానవ అవశేషాలుగా అనుమానిస్తున్న భాగాలను నిపుణులు సేకరించినట్లు తెలుస్తోంది. టైటాన్ జలాంతర్గామిలో దొరికిన మానవ అవశేషాలుగా భావిస్తున్న వాటిని అమెరికాకు చెందిన వైద్య నిపుణులు విశ్లేషిస్తారని యూఎస్ కోస్ట్ గార్డ్ వెల్లడించింది. ఈ ప్రమాదానికి గల స్పష్టమైన కారణాలను గుర్తించడానికి, భవిష్యత్తులో అలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తగా ఉండటానికి ఈ అవశేషాలను పూర్తి స్థాయిలో పరిశీలించడం ముఖ్యమని నిపుణులు అంటున్నారు. పూర్తి స్థాయి దర్యాప్తులో చాలా విషయాలు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. కెనడాలోని న్యూఫౌండ్ లాండ్ అండ్ లాబ్రడార్ ప్రావిన్సులోని సెయింట్ జాన్స్ ఓడరేవుకు బుధవారం టైటాన్ శకలాలు చేరుకున్న సంగతి తెలిసిందే. టైటాన్ ఎలా పేలిపోయిందో తెలుసుకునేందుకు జరుగుతున్న దర్యాప్తులో ఇది కీలక పరిణామమని నిపుణులు చెబుతున్నారు. 


ఇటీవల టైటానిక్ శకలాలను వీక్షించేందుకు వెళ్లిన టైటాన్ జలాంతర్గామిలో.. ఈ సాహసయాత్రను నిర్వహించిన ఓషన్ గేట్ సంస్థ సీఈవో స్టాక్టన్ రష్, పాకిస్థాన్ కు చెందిన బిలియనీర్ షాజాదా దావూద్ తో పాటు ఆయన కుమారుడు సులేమాన్ ఉన్నారు. అలాగే యూఏఈలో ఉంటున్న బ్రిటీష్ వ్యాపారవేత్త హమీష్ హార్డింగ్, ఫ్రెంచ్ మాజీ నౌకాదళ అధికారి పాల్ హెన్రీ ఈ జలాంతర్గామిలో ఉన్నారు. ఇక ఈ మినీ జలాంతర్గామి అదృశ్యమైన కొన్ని గంటల్లోనే పేలిపోయింది. ఈ ప్రమాదానికి స్పష్టమైన కారణాలు ఇప్పటి వరకు గుర్తించలేదు. ఒత్తిడి పెరిగి పేలిపోయి ఉండవచ్చని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. 


Also Read: Viral Video: బైక్‌తో స్టంట్స్‌ చేస్తూ బొక్కబొర్లా పడ్డ జంట, దిల్లీ పోలీసుల క్రేజీ పోస్టు వైరల్






ప్రమాదం జరగడంపై జేమ్స్ కామెరూన్ ఆశ్చర్యం


టైటానిక్ శిథిలాలు చూసేందుకు వెళ్లిన సబ్‌మెర్సిబుల్ కు ప్రమాదం జరగడం, అందులో ప్రయాణించిన ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం తనని ఆశ్చర్యపరిచిందని లెజెండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ అన్నారు. 'టైటానిక్ ఘోరం జరిగిన చోటే ఈ ఘటన జరగడం నన్ను ఆశ్చర్యపరిచింది. టైటానిక్ శిథిలాలు ఉన్న ప్రాంతం అత్యంత క్రూరమైనది. అలాంటి ప్రమాదకర ప్రాంతంలో ఎంతో అప్రమత్తతో వ్యవహరించాలి. ఓషన్ గేట్ మినీ సబ్‌మెరైన్ కు అధునానత సెన్సార్లు ఉన్నాయి. ప్రమాదానికి ముందు పగుళ్లు వచ్చి ఉండవచ్చు. ఇది గమనించి ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి వాళ్లు బయటకు వచ్చే లోపే అది పేలి పోయి ఉండవచ్చు' అని జేమ్స్ కామెరూన్ అన్నారు. టైటానిక్ మునిగిన ప్రాంతాన్ని ఆయన ఇప్పటి వరకు 30 సార్లకు పైగా సందర్శించారు. ఈ ప్రమాదంలో చనిపోయిన పాల్ హెన్రీ అనే వ్యక్తి జేమ్స్ కు స్నేహితుడే. ఆయన కూడా టైటానిక్ శిథిలాల ప్రాంతాన్ని ఇప్పటి వరకు 37 సార్లు సందర్శించడం గమనార్హం.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial