Viral Video: బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలి, మద్యం తాగి వాహనం నడపొద్దు, నిర్లక్ష్యంగా, ప్రమాదపూరితంగా వాహనాలు నడపొద్దు, ఇతరులకు ఇబ్బంది కలిగించేలా స్టంట్స్ చేయవద్దు, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి అంటూ నిత్యం ట్రాఫిక్ పోలీసులు చెబుతూనే ఉంటారు. కానీ చాలా మంది వాటిని పెద్దగా పట్టించుకోరు. అందులో కొందరైతే ట్రాఫిక్ నిబంధనలు పట్టించుకోకపోగా.. నిర్లక్ష్యంగా వాహనం నడుపుతూ ప్రమాదాలకు కారణం అవుతారు. ఈ రోడ్డు ప్రమాదాలపై పోలీసులు తరచూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంటారు. వాటి వల్ల అవగాహన వచ్చి మార్పు వచ్చిన వారిని వేళ్లపై లెక్కపెట్టవచ్చు. ఈ సోషల్ మీడియా యుగంలో సాంప్రదాయ పద్ధతిలో వెళ్తే కుదరదని, చాలా రాష్ట్రాల పోలీసులు సోషల్ మీడియాలోనూ అవగాహన కల్పించడం మొదలు పెట్టారు. వివిధ ప్రాంతాల్లో జరిగే రోడ్డు ప్రమాద వీడియోలు పోస్టు చేస్తూ అవగాహన కల్పిస్తున్నారు. అలా దిల్లీ పోలీసులు కూడా ఓ వీడియోను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ఇప్పుడు అది కాస్త వైరల్ గా మారింది.


Also Read: Rahul Gandhi Convoy: మణిపూర్‌లో రాహుల్ గాంధీ పర్యటన- మధ్యలో కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు


సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియోను దిల్లీ పోలీసులు చాలా క్రేజీగా వాడేసుకున్నారు. ఆ వీడియోను పోస్టు చేస్తూ 'జబ్ వి మెట్' అని రాసుకొచ్చారు. 28 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో ఓ జంట బైక్ పై రయ్ రయ్ మంటూ దూసుకెళ్తుంది. బైక్ పై నడిపే వ్యక్తి, వెనక మరో అమ్మాయి కూర్చొని ఉంటారు. బైక్ నడుపుతున్న వ్యక్తి ముందు చక్రాన్ని గాల్లోకి లేపి వీలీ స్టంట్ చేశాడు. కొన్ని సెకన్ల పాటు అంతా సవ్యంగానే ఉంది. అంతలోనే బైక్ పై నియంత్రణ కోల్పోవడంతో వెనక ఉన్న ఆ అమ్మాయి రోడ్డుపై పడిపోతుంది. అతడు కూడా పట్టుకోల్పోయి పడిపోయేలా ఉంటాడు. ఈ వీడియోను షేర్ చేసిన దిల్లీ పోలీసులు ఆ వీడియోకు క్యాప్షన్ కూడా ఇచ్చారు. 'జబ్ వి మెట్' సినిమా టైటిల్ ను వాడుకున్నారు. అలాగే యే ఇష్క్ హాయే సాంగ్ ను బ్యాగ్రౌండ్ లో పెట్టారు. 'యే ఇష్క్ హాయే'లో ఇష్క్ ఉన్న చోట రిస్క్ పెట్టి ఆ వీడియోను ఎడిట్ చేశారు. దిల్లీ పోలీసుల క్రేజీ ఐడియాకు నెటిజన్ల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. ఈ వీడియో అలా పెట్టగానే ఇలా వైరల్ గా మారిపోయింది.






ఈ వీడియోను జూన్ 28వ తేదీ సాయంత్రం 5.28 గంటలకు పోస్టు చేయగా ఇప్పటి వరకు 40.7K వ్యూస్ వచ్చాయి. వందలకొద్దీ కామెంట్లు కూడా చేస్తున్నారు. ఇలాంటి అవగాహన చాలా అవసరం అని ఓ యూజర్ కామెంట్ చేశారు. 'దిల్లీ రోడ్లపై రోమియోల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తమ జీవితాలను, ఇతరుల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నారు. ఇలాంటి వారిని కచ్చితంగా చట్టపరంగా శిక్షించాలి' అని ఓ యూజర్ కామెంట్ పెట్టారు. 






'సందేశాన్ని సూక్ష్మంగా చాలా ప్రభావవంతంగా అందించారు. ప్రజలకు అవగాహన కలిగించేందుకు ఇలాంటి వినూత్న ఆలోచనలతో వస్తున్న దిల్లీ పోలీసులకు సెల్యూట్' అని మరొకరు కామెంట్ రాశారు. 






'రోడ్డు భద్రతా నియమాలను వివరించడానికి ఇదే సరైన దారి..' అని మరో నెటిజన్ స్పందించారు. 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial