రష్యా బాంబు దాడులు చేస్తున్న వేళ ఉక్రెయిన్‌లో విదేశీయులతో పాటు తెలుగు విద్యార్థులు కూడా చిక్కుకుపోయారు. దీంతో వారు వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో ఉంచుతున్నారు. ఉక్రెయిన్‌లో తాము ఉండే ప్రాంతాన్ని కూడా రష్యా బలగాలు ఆక్రమించుకుంటాయని తమకు మీడియాలో వార్తలు వచ్చినట్లుగా తెలుగు వారు చెప్పారు. ఇంటి సరకులు ముందు జాగ్రత్తగా సమకూర్చుకోవాలని.. అవసరం లేకుండా బయటికి రావడం వంటివి చేయొద్దని ప్రభుత్వం సూచించినట్లుగా తెలిపారు. ఉద్రిక్త పరిస్థితుల వల్ల అక్కడి నుంచి స్వదేశానికి వెళ్లేందుకు ముందస్తుగా విమాన టికెట్లు బుక్ చేసుకున్నా.. అవి రద్దు అయిపోయినట్లుగా చెప్పారు. ఒకవేళ విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నా ట్రావెలింగ్ చేయొద్దని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాజధాని నగరం కీవ్‌కు వెళ్లొద్దని హెచ్చరించారని అన్నారు. 







‘‘మేం ఎప్పటికప్పుడు భారత రాయబార కార్యాలయ అధికారులతో టచ్‌లో ఉంటున్నాం. వారు ఇండియన్ అధికారులతో మాట్లాడి ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో బయటికి వెళ్లాలంటే పాస్ పోర్టు దగ్గర ఉంచుకోమన్నారు. అంతేకాక, ఏ పరిస్థితుల్లోనైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పారు. అంతేకాకుండా, బ్యాగులో బట్టలు సర్దుకొని ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉండాలన్నారు. ఒకవేళ ప్రమాదకర పరిస్థితులు తలెత్తితే సేఫ్ ప్లేస్‌కి తీసుకెళ్తామని చెప్పారు. తెలుగు వాళ్లు ఇక్కడ దాదాపు 500 మంది వరకూ మా యూనివర్సిటీలోనే ఉన్నారు. వేరే రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు కూడా ఇక్కడ ఉన్నారు.’’


ఉక్రెయిన్ రాజధాని నగరం కీవ్ నుంచి మేం ఉండే ప్రాంతం 9 గంటల జర్నీ ఉంటుంది. కాబట్టి, మేం ఉన్న చోట్ల పరిస్థితి మెరుగ్గానే ఉంది. ఇండియన్ ఎంబసీ వారు మమ్మల్ని భారత్ తరలించడానికి ఏర్పాట్లు చేశారు. మేం టికెట్లు కూడా బుక్ చేసుకున్నాం. కానీ, అన్ని ఫ్లైట్లు క్యాన్సిల్ అయ్యాయి. ఇండియన్ గవర్నమెంటే మమ్మల్ని స్వదేశానికి రమ్మంటుంది కాబట్టి.. ఇక్కడ మేం అభద్రంగా ఫీల్ అవుతున్నాం.’’ తెలుగు విద్యార్థులు వాపోయారు.