ఉక్రెయిన్ పై రష్యా బాంబులతో విరుచుకుపడుతోంది. గురువారం ఉదయం నుంచి రష్యా ఉక్రెయిన్ పై మిలిటరీ ఆపరేషన్ ప్రారంభించింది. ప్రధాన నగరాలను ఒక్కొక్కటిగా ఆక్రమిస్తుంది. రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ యుద్ధ ప్రకటన చేశారు. ఉక్రెయిన్ రష్యాను అడ్డుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. రష్యాకు చెందిన 5 మిలిటరీ హెలికాఫ్టర్లను కూల్చివేసినట్లు ప్రకటించింది. యుద్ధం కారణంగా ఉక్రెయిన్ గగనతలాన్ని మూసివేసింది. ఉక్రెయిన్ లోకి విమాన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఉక్రెయిన్ లో ఉన్న భారతీయులను తరలించేందుకు బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎయిర్ క్రాప్ట్ దేశానికి తిరిగి వస్తుంది. రష్యా  ఒక్కొ్క్కటిగా ఉక్రెయిన్ ఎయిర్ బేస్ లను ధ్వంసం చేస్తుంది.  






ఉక్రెయిన్ ఎయిర్ పోర్టులు, గగనతలాన్ని మూసివేసింది. దీంతో ఉక్రెయిన్ ​లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను తీసుకొచ్చేందుకు కీవ్ ​కు వెళ్లిన ఎయిర్ ఇండియా విమానం తిరిగి దేశానికి వచ్చేస్తుంది. గురువారం ఉదయం 7.30 గంటలకు దిల్లీలోని ఇందిరా గాంధీ విమానాశ్రయం నుంచి ఏఐ1947 ఎయిర్ ఇండియా విమానం కీవ్ కు బయలుదేరింది. కీవ్ లోని బోరిస్పిల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఈ విమానం చేరుకోవాల్సి ఉంది. కానీ ఉక్రెయిన్ తన గగనతలాన్ని మూసేస్తున్నట్లు ప్రకటించిన కారణంగా ఎయిర్ ఇండియా విమానాన్ని అధికారులు వెనక్కి పిలిపించారు. కీవ్ నుంచి భారత్ కు బయల్దేరిన ఓ విమానం గురువారం ఉదయం 7.45 గంటలకు దిల్లీకి చేరుకుంది. 182 మంది భారతీయులు ఈ విమానంలో దేశానికి చేరుకున్నారు. 


ఉక్రెయిన్ లోని భారతీయ పౌరులను రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. భారతీయులను దేశానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంది. భారతీయ పౌరులను క్షేమంగా దేశానికి తీసుకొచ్చేందుకు దౌత్యపరంగా చర్చిస్తామని అధికారులు చెబుతున్నారు. ఉక్రెయిన్ నుంచి సాధారణ విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. గగనతలాన్ని మూసేసిన కారణంగా భారతీయ విద్యార్థులను వెనక్కి తీసుకొచ్చేందుకు ఇతర మార్గాలను అధికారులను అన్వేషిస్తున్నారు. ఉక్రెయిన్​ లోని భారత రాయబార కార్యాలయం పనిచేస్తూనే ఉందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. యుద్ధ పరిస్థితుల కారణంగా ప్యారిస్ పర్యటనలో ఉన్న  విదేశాంగ మంత్రి జైశంకర్ భారత్ ​కు తిరిగి వస్తున్నారు. రష్యా వరుస దాడుల కారణంగా తూర్పు ఉక్రెయిన్​ తన గగనతలాన్ని డేంజర్​ జోన్ ​గా పేర్కొంది.