ఆప్ఘనిస్థాన్‌లో తాలిబన్లు చెలరేగిపోతున్నారు. మహిళల్ని ప్రశాంతంగా బతకనివ్వకూడదని రూల్ పెట్టుకున్నారు. ఈ క్రమంలో తాజాగా మహిళా టీవీ యాంకర్లపై కూడా తాలిబన్లు కఠిన ఆంక్షలను విధించారు. వార్తల ప్రసారం సమయాల్లో మహిళా టీవీ యాంకర్లు తమ ముఖాలు కనిపించకుండా కప్పుకోవాలని తాలిబన్లు హుకుం జారీ చేశారు.  తాలిబన్లు ఇచ్చిన ఆదేశాలకు ఎదురుచెప్పే పరిస్థితి కానీ, వాటిపై బహిరంగచర్చించే పరిస్థితి గానీ అక్కడ ఎవరికీ లేదు. ఎవరైనా కాదంటే వారికి తూటానే సమాధానం చెబుతుంది. 



ఇలాంటి ఆదేశాలే దేశంలోని అన్ని టీవీ, రేడియో నెట్‌వర్క్‌ సంస్థలకు వెళ్లాయి. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో మహిళా యాంకర్లు ముఖాలకు మాస్కులు ధరించి ప్రసారాలను కొనసాగిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను కొందరు యాంకర్లు సోషల్‌ మీడియాలో పంచుకొని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.





అఫ్గానిస్తాన్‌ను హస్తగతం చేసుకున్న తరువాత అక్కడి మహిళలపై తాలిబన్ల ఆంక్షలు మరింత తీవ్రరూపం దాల్చాయి. ఇప్పటికే అక్కడి బాలికల విద్యపై, మహిళల స్వేచ్ఛపై తాలిబన్లు కఠిన ఆంక్షలను విధించారు. తాలిబన్ల ఆదేశాలను ఎదిరించే పరిస్థితిలేని స్థితిలో అక్కడి మహిళలు స్వేచ్ఛగా కూడా బయటకు రాలేని దయనీయపరిస్థితి ఏర్పడింది. మహిళలపై తాలిబన్ల ఆంక్షలు మరింత ఎక్కువయ్యాయని ఇప్పటికే నివేదికలు వెలువడ్డాయి. 



ఇటీవల మహిళలు అందరూ బయటకు వస్తే తప్పనిసరిగా శరీరం మొత్తం కప్పి ఉంచే బురఖాలు ధరించాలని ఆదేశించారు. చివరికి కళ్లను కూడా కప్పే బురఖాలు ధరించాలన్నారు. లేకపోతే ఇంట్లో అందర్నీ శిక్షిస్తామని హెచ్చరించారు. దీంతో తాలిబన్ల పాలనలో ఎవరైనా మహిళలు బయటకు రావాలంటే భయపడిపోతున్నారు.