Trump disqualified to contest colorado: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)నకు ఎదురుదెబ్బ తగిలింది. వచ్చే ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో.. కొలరాడో నుంచి పోటీ చేయకుండా ట్రంప్‌పై ఆ రాష్ట్ర సుప్రీంకోర్టు అనర్హత వేటు వేసింది. ఏడుమంది న్యాయమూర్తులు గల ధర్మాసనంలో ఈ తీర్పుపై ఏకాభిప్రాయం రాలేదు. ముగ్గురు న్యాయమూర్తులు ఈ తీర్పును వ్యతిరేకించారు. నలుగురు డోనాల్డ్ ట్రంప్పై నిషేధం విధించేందుకు మొగ్గు చూపారు. మెజారిటీ న్యాయమూర్తులు ట్రంప్ అనర్హతకు అనుకూలంగా ఉండటంతో... కొలరాడో నుంచి పోటీ చేసేందుకు ట్రంప్‌ను అనర్హుడిగా ప్రకటిస్తూ ఆ రాష్ట్ర సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. అమెరికా రాజ్యంగంలోని 14వ సవరణ సెక్షన్-3 ప్రకారం అధ్యక్ష అభ్యర్థిని అనర్హుడిగా ప్రకటించడం ఇదే తొలిసారి. అయితే.. ఈ తీర్పుపై అప్పీల్ చేసుకునే అవకాశాన్ని ట్రంప్‌నకు కల్పించింది కొలరాడో సుప్రీం కోర్టు.
అగ్రరాజ్యం అమెరికాలో వచ్చే ఏడాది అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. 2024 నవంబర్, డిసెంబర్ నెలల్లో అక్కడ పోలింగ్ జరిగే అవకాశం ఉంది. ఆ ఎన్నికల్లో ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రవాస భారతీయుడు వివేక్ రామస్వామి పోటీలో ఉన్నారు. ప్రీపోల్ సర్వేల్లో డొనాల్డ్ ట్రంప్ పైచేయి సాధిస్తూ వస్తున్నారు. పలు రాష్ట్రాల్లో జో బైడెన్ కంటే కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ వైపే అమెరికన్లు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో డోనాల్డ్ ట్రంప్ కొలరాడో నుంచి పోటీచేయకుండా సుప్రీం కోర్టు అనర్హత వేయడం సంచలనంగా మారింది. అలాంటి తీర్పు ఇవ్వడానికి గల కారణాలను కూడా వెల్లడించింది కొలరాడో సుప్రీం కోర్టు. అవేంటో ఒకసారి చూద్దాం.
2020లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోయి.. జోబైడన్ విజయం సాధించారు. ఆ ఎన్నికల తర్వాత ఆ దేశ పార్లమెంట్ భవనంపై దాడి చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని, డొనాల్డ్ ట్రంప్ ఓడిపోవడానికి ఎన్నికల కమిషన్ కారణమంటూ... ఆయన మద్దతుదారులు నిరసనకు దిగారు. 2021 జనవరి 6న వాషింగ్టన్‌లో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఆ ర్యాలీ సందర్భంగా యూఎస్ పార్లమెంట్ భవనంపై కూడా దాడి చేశారు. విధ్వంసాన్ని సృష్టించారు. ఈ దాడికి ట్రంప్ కారకుడని కొలరాడో కోర్టు గుర్తించింది. దీంతో... ఈసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా డొనాల్డ్ ట్రంప్‌పై అనర్హత వేటు వేసింది. ఎన్నికల బ్యాలెట్ నుంచి డొనాల్డ్ ట్రంప్ పేరును తొలగించాలని ఆదేశించింది.
ఇక... డొనాల్డ్ ట్రంప్‌నకు ఊరటను కూడా కల్పించింది సుప్రీంకోర్టు. ఈ తీర్పు కొలరాడో రాష్ట్రం వరకే పరిమితమవుతుందని ప్రకటించింది. అంటే కొలరాడో రాష్ట్రంలో పోటీ చేసందుకు ట్రంప్‌కు అవకాశం లేదు. కానీ మిగిలిన రాష్ట్రాల్లో పోటీ చేసుకోవచ్చు. మరి ట్రంప్ నెక్ట్స్ ప్లాన్ ఏంటి..? ఆయన భవిష్యత్ ప్రణాళిక ఎలా ఉండబోతోంది...? అమెరికా అధ్యక్ష బరిలో ఉండబోతున్నారా...? లేక తప్పకుంటారా..? కొలరాడో సుప్రీం కోర్టు తీర్పుపై అప్పీల్‌కు వెళ్తారా..? లేదా..? అనేది తేలాల్సి ఉంది.