Gotabaya Rajapaksa Flees to Maldives: శ్రీలంక సంక్షోభంలో మరో ట్విస్ట్ జరిగింది. లంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశం విడిచి పారిపోయారు. పదవికి రాజీనామా చేయాలని నిరసనకారులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నసమయంలో అధ్యక్షుడు గొటబాయ రాజపక్స, తన భార్య సహా కొందరు బాడీగార్డ్స్‌తో కలిసి ప్రత్యేక ఎయిర్ ఫోర్స్ విమానంలో మాల్దీవులుకు వెళ్లిపోయారని సమాచారం. బుధవారం నాడు పదవికి రాజీనామా చేయాల్సి ఉండంగా, రాత్రికి రాత్రే మాల్దీవులు రాజధాని మాలే నగరానికి రాజపక్స పరారయ్యారు. మాల్దీవులుకు చేరుకున్న లంక అధ్యక్షుడికి అక్కడి అధికారులు ఘన స్వాగతం పలికినట్లు తెలుస్తోంది.
శుక్రవారం నుంచి జాడలేని అధ్యక్షుడు..
దేశంలో నిరసనలు తీవ్ర రూపం దాల్చడం, పదవికి రాజీనామా చేయాలని విపక్షాలతో పాటు దేశ ప్రజల నుంచి తీవ్ర ఒత్తిడి మొదలైంది. మరోవైపు గత శుక్రవారం నుంచి అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఎక్కడా కనిపించలేదు. శనివారం నాడు నిరసనకారులు పెద్ద ఎత్తున లంక ప్రధాని అధికారిక నివాసానికి చేరుకుని బంగ్లాను స్వాధీనం చేసుకున్నారు. రాజపక్ష కుటుంబం ఎన్నో ఏళ్లుగా లంకను పాలిస్తోందని, దేశంలో ఆర్థిక సంక్షోభం, రాజకీయ సంక్షోభానికి అధ్యక్షుడు గొటబాయ రాజపక్స, మాజీ ప్రధాని మహింద రాజపక్స పాలనే కారణమని తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
రాజీనామాకు గంటల ముందు పరార్ !
పదవికి రాజీనామా చేయాలని ఒత్తిడి పెరగడంతో అందుకు అధ్యక్షుడు గొటబాయ రాజపక్స అంగీకరించారు. బుధవారం అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. కానీ అందుకు ఓ ముఖ్యమైన షరతు విధించారు. తనను, తన కుటుంబాన్ని ఏ ఇబ్బంది లేకుండా సురక్షితంగా విదేశాలకు వెళ్లిపోయేందుకు అనుమతి ఇస్తే.. అధ్యక్ష పదవికి రాజీనామా చేయడానికి ఏ ఇబ్బంది లేదని గొటబాయ రాజపక్స మంగళవారం నాడు కండీషన్ పెట్టారు. అందుకు అధికార పార్టీతో పాటు విపక్షాలు సైతం అంగీకరించలేదు. దాంతో రూట్ మార్చిన రాజపక్స రాజీనామా విషయాన్ని పక్కనపెట్టేసి, తన భార్య సహా కొందరు కుటుంబసభ్యులతో కలిసి మంగళవారం అర్దరాత్రి దాటిన తరువాత మాల్దీవులుకు వెళ్లిపోయారు.
అధ్యక్షుడి సోదరుడ్ని పట్టుకున్న అధికారులు!
శ్రీలంక అధ్యక్షుడి సోదరుడు, మాజీ ఆర్థిక మంత్రి బాసిల్ రాజపక్సే దుబాయ్‌కి పారిపోయేందుకు యత్నించారు. అయితే విమానాశ్రయంలోని ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. సోమవారం సాయంత్రం గొటబాయ, ఆయన కుటుంబ సభ్యులు 15 మంది దేశాన్ని వీడేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. కొలంబో అంతర్జాతీయ విమానాశ్రయంలోని వీఐపీ టెర్మినల్ నుంచి మాజీ ఆర్థిక మంత్రి బాసిల్ రాజపక్సే దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు ప్రజలు ఆయనను గుర్తించినట్లు సమాచారం. వెంటనే అధికారులకు తెలియజేయగా విమానాశ్రయంలోనే ఆయన్ను అడ్డుకున్నట్లు తెలుస్తోంది.
Also Read: Srilanka Issue : శ్రీలంక సమస్యకు పరిష్కారమెప్పుడు ? ప్రజలు ఎప్పుడు శాంతిస్తారు ?
Also Read: Sri Lanka Crisis: దుబాయ్‌కు పారిపోవాలని ప్లాన్- శ్రీలంక అధ్యక్షుడి సోదరుడ్ని పట్టుకున్న అధికారులు!