Srilanka Issue : శ్రీలంక రావణకాష్టంలా మండుతూనే ఉంది. పాలకులంతా ప్రజల ఆగ్రహానికి పరార్ అవుతున్నారు. నిన్నగాక మొన్న ప్రధాని అయిన రణిల్ విక్రమసింఘే కూడా తప్పుకున్నారు. ఇక కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావాల్సి ఉంది. అయితే అది ప్రజాప్రభుత్వం కాదు. సంక్షోభాన్ని తాత్కలికంగా ముగించడానికి చేసుకుంటున్న ఏర్పాటు. కానీ ఇది సమస్యను పరిష్కరిస్తుందా అంటే కష్టమే. ఆ పాలకుల్నీ తరిమివేయరన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే ముందుగా ప్రజల కోపానికి కారణం అయిన కనీస అవసరాలను ప్రభుత్వాలు ఉన్న పళంగా తీర్చాల్సి ఉంటుంది.
ప్రజల కనీస అవసరాల కోసం శ్రీలంక చాలా కష్టపడాలి !
శ్రీలంకలో అన్ని వసువుల కొరత కనిపిస్తోంది. చమురు అసలు దొరకడం లేదు వాహానాల్లో పెట్రోల్, డీజిల్ నింపుకునేందుకు రోజులు తరబడి క్యూ లైన్లో ఉండాల్సి వస్తోంది. కొలంబో పెట్రోల్ బంక్ దగ్గర ఐదు రోజులు క్యూ లైన్లో నిరీక్షించి... ఫుల్ ట్యాంక్ చేయించకుండానే 63 ఏళ్ల ట్రక్ డ్రైవర్ గుండె పోటుతో అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయాడు. నిజానికి అలా జరగడం కొత్తేమీ కాదు. అంతకు ముందు తొమ్మిది మంది ఇలా పెట్రోల్ కోసం క్యూలైన్లో నిలబడి చనిపోయారు. ఎక్కువ మంది గుండెపోటుతోనే మరణించారు. ఇంధన కొరతను అధిగమించలేమన్న భయం వారిని వెంటాడుతోంది. ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మందులు అందుబాటులో లేవు. ప్రభుత్వ తప్పిదాల కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందని దేశంలో పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతున్నాయి.
ప్రజలకు కనీస సౌకర్యాలు అందితే ఆగ్రహం కాస్త తగ్గే అవకాMx
ప్రస్తుతం శ్రీలంకలో రోజుకు 13 గంటల విద్యుత్ కోత విధిస్తున్నారు. నిన్నమొన్నటి దాకా 10 గంటలున్న కోతలు ఇప్పుడు మరికాస్త పెరిగాయి. చమురు దిగుమతి వ్యయం పెరగడం కూడా పెట్రోల్, డీజిల్ కొరతకు కారణమవుతోంది. ఇప్పటి వరకు నెలకు 200 మిలియన్ డాలర్లున్న చమురు దిగుమతి వ్యయం ఇప్పుడు ఏకంగా 700 మిలియన్ డాలర్లకు పెరిగింది. అది భారత కరెన్సీలో 5 వేల 500 కోట్ల రూపాయలు అనుకోవాలి. శ్రీలంక కరెన్సీ విలువ తగ్గిపోవడం కూడా దిగుమతి వ్యయం పెరగటానికి కారణమవుతోంది. జనం నెల రోజులకు సరిపడా పెట్రోల్ నిల్వ చేసుకోవడంతో బంకుల్లో నిల్వలు ఉండటం లేదు. ఇంధన దిగుమతులు పెంచాలంటే ప్రభుత్వం దగ్గర డబ్బుల్లేవ్. మే నెలలో పెట్రోల్, డీజిల్ ధరలు 25 శాతం మేర పెంచినప్పటికీ .. జనం అవసరాల్లో తేడా కనిపించడం లేదు. ప్రపంచ దేశాలను బతిమాలుకుని అయినా కనీస అవసరాలను తీర్చే ప్రయత్నం చేస్తే ప్రజల ఆగ్రహం కాస్త తగ్గే అవకాశం ఉంది.
ఇప్పుడల్లా లంక కోలుకోవడం కష్టమే !
శ్రీలంక ఆర్థిక సంక్షోభ ప్రభావం భారత్ పైనా కనిపిస్తోంది. 2, 500 కోట్ల రూపాయల వ్యయంతో కొలంబోలో భారీ హోటల్ నిర్మాణం జరుపుతున్న ఐటీసీ సంస్థ ఇప్పుడు పనులను నిలిపివేసింది. టాాటా మెటార్స్, మహీంద్ర అండ్ మహీంద్రా, అశోక్ లేలాండ్, టీవీఎస్ మోటార్స్ లాంటి సంస్థలు వాహన విడిభాగాల ఎగుమతిని ఆపేశాయి. శ్రీలంకలోని అసెంబ్లింగ్ యూనిట్స్ లో పనులు నిలిపేశాయి. శ్రీలంక సంక్షోభం కారణంగా ఈశాన్య భారతంలోని తేయాకు పరిశ్రమకు మాత్రం లాభాల పంట ఖాయమనిపిస్తోంది.లంక నుంచి తేయాకు దిగుమతి చేసుకుంటున్న గల్ఫ్ దేశాలు.. ఇప్పుడు ఇండియాను దిగుమతికి ప్రాధాన్యమిస్తున్నాయి. లంక ఆర్థిక వ్యవస్థ గాడిలో పడాలంటే తక్షణ చర్యలతో పాటు దీర్ఘకాలిక వ్యూహాలు అవసరం. ముందుగా ప్రజాగ్రహాన్ని చల్లారిస్తేనే అది సాధ్యం.
ఇప్పుడు పాలకులు ఎవరు ?
దేశాన్ని నడిపించేవారు ఇప్పుడు కీలకం. అలాంటి వారు అందరూ ప్రజాగ్రహానికి దాక్కోవాల్సి వస్తోంది. ఇప్పుడు శ్రీలంక పగ్గాలు చేపట్టే వారు ప్రజాగ్రహానికి మళ్లీ పారిపోవాల్సిన పరిస్థితి రాకుండా ఉండాలంటే... ఇంధనం, విద్యుత్ వంటి మౌలిక వసతులను వీలైనంత త్వరగా కల్పించాలి